విశాఖ లీగల్: ఓ జంటకు అగ్ని సాక్షిగా వివాహం జరిగింది. కొంత కాలం కాపురం చేశారు. మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అన్ని విషయాలు దాచి పెట్టి మళ్లీ పెళ్లి కోసం మహిళ కుటుంబ సభ్యులు పరిణయ వేదికలో ప్రకటన ఇచ్చారు. ఆ ప్రకటనకు ఆకర్షితుడైన బాధితుడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు కాపురం చేసిన తర్వాత ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పిలిచినా రాకపోవడంతో అతను న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం సూచనతో ఇద్దరూ రాజీపడి కొంత కాలం కాపురం చేసి మళ్లీ విడిపోయారు. ఈ సారి ఆమె తల్లిదండ్రులు అతనిపై ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఆమె గురించి ఆరా తీసి.. ఆ వివరాలతో త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆమైపె పోలీసులు కేసు పెట్టారు.
నేరం రుజువు కావడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు న్యాయమూర్తి ఏడాది జైలు, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన పక్షంలో అదనంగా నెల రోజులపాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలివీ. ఫిర్యాది విశాఖలో సిరిపురం ప్రాంతానికి చెందిన ఎడ్ల శ్రీనివాసరావు. తన వివాహం కోసం భారత్ మ్యాట్రిమోనీ అనే వివాహ వేదికను ఆశ్రయించాడు. ఆయన పేర్కొన్న విధంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ప్రాంతానికి చెందిన రమాదేవి అనే ఉపాధ్యాయురాలు జోడి కుదిరినట్టు మ్యాట్రిమోనీ ప్రతినిధులు అతనికి సమాచారం ఇచ్చారు. ఇరు కుటుంబాలు ఇష్టపడటంతో 2012 డిసెంబర్ 22న వీరికి వివాహం జరిగింది.
కొంత కాలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత రమాదేవి పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి పిలిచినా రాలేదు. దీంతో శ్రీనివాసరావు విశాఖలోని కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో మళ్లీ రమాదేవిని కాపురానికి పంపించారు. అయినా ఆమెలో మార్పు రాలేదు. చివరికి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడంతో విడాకులు తీసుకున్నారు. అంతటితో ఆగకుండా రమాదేవి తల్లిదండ్రులు కృష్ణమూర్తి, ప్రభావతి, సోదరుడు నరేంద్ర, సోదరి ప్రొఫెసర్ సునీత మరికొందరు శ్రీనివాసరావుపై అక్రమ కేసులు బనాయించారు. విషయం తెలుసుకున్న శ్రీనివాసరావు రమాదేవి కుటుంబ వివరాలను సేకరించాడు. సునీల్ అనే వ్యక్తితో రమాదేవికి 2003 జూన్ 21న వివాహం జరిగింది.
ఆ వివాహం రిజిస్ట్రేషన్ కూడా జరిగింది. ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో చట్టరీత్యా విడాకులు తీసుకున్నారు. ఆ వివరాలన్నీ శ్రీనివాసరావుకు చెప్పలేదు. ఈ వివరాలు సేకరించిన శ్రీనివాసరావు తగిన ఆధారాలతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ జరిపిన పోలీసులు.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై నేరాభియోగ పత్రాలను దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి టి.వి.రాజేష్.. నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు ఇచ్చారు. ఇటువంటి కేసులు దాఖలు కావడం అరుదుగా జరుగుతుందని పలువురు వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment