ప్రతి వివాహానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి
హన్మకొండ: గ్రామ పంచాయతీ కార్యదర్శులు తమ పరిధిలో జరిగే ప్రతి వివాహాన్ని తప్పనిసరిగా వివాహాల రిజిస్ట్రేషన్ చట్టం–202 కింద రిజిష్టర్ చేయాలని జిల్లా కలెక్టర్ అమ్రపాలి కాట సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వివాహాల రిజిస్ట్రేషన్, బాల్యవివాహాలు, పిల్లల దత్తత అంశంపై ఉదయం నుంచి సాయంత్రం వరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
వివాహాల రిజిస్ట్రేషన్ చట్టంలో నిబంధనలు అధికారులు తప్పనిసరిగా పాటిస్తూ రిజిస్ట్రేషన్ చేసి ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని అన్నారు. సర్టిఫికెట్ జారీ కోసం అధికారులు గ్రామ పంచాయతీ నిధులు వాడుకోవాలన్నారు. వివాహ అధికారులుగా నియామకమైన పంచాయతీ కార్యదర్శులు సంబంధిత నివేదికలు వీఓఆర్డీలకు అక్కడి నుంచి డీపీఓకు పంపాలని అన్నారు. సమగ్ర నివేదికను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో రూపొందించాలని అన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శైలజ, డీపీఓ మహమూది, జెడ్పీ సీఈఓ విజయ్‌గోపాల్, తరుణి ప్రతినిధి మమతరఘువీర్, అనితారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ రామ్మోహన్, జిల్లా బాలల పరిరక్షణ విభగం ప్రతినిధి సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచార పోస్టర్లు కలెక్టర్ ఆవిష్కరించారు.