ఉపాధికి గొడ్డలిపెట్టు | No Assistants in the panchayat field | Sakshi
Sakshi News home page

ఉపాధికి గొడ్డలిపెట్టు

Published Wed, Sep 2 2015 4:09 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

ఉపాధికి గొడ్డలిపెట్టు - Sakshi

ఉపాధికి గొడ్డలిపెట్టు

రాజకీయ దురుద్దేశం మహత్తర పథకాన్ని నీరుగారుస్తోంది. దిశ చూపే సారథి లేకుండా రథాన్ని సాగించాలని చూస్తోందీ ప్రభుత్వం. ఉపాధి హామీ పథకంలో కీలక పాత్ర వహించే క్షేత్ర సహాయకులను కుంటి సాకులతో తొలగించి కూలీల పొట్టగొడుతోంది. వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతిపిత పేరుతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలోని టీడీపీ సర్కారు కుహనా రాజకీయాలతో అతలాకుతలం చేస్తోంది. ఫలితంగా ఏ పాపం ఎరుగని కూలీ బతుకుదెరువు కోసం నగరాలకు వలస పోతున్నాడు.
- 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు ఖాళీ
- 491 పంచాయతీల్లో మాత్రమే లక్ష్యం మేరకు పనులు
- మిగిలిన చోట్ల అరకొర పనులు
సాక్షి, చిత్తూరు:
ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారం ఉపాధిహామీ పథకంలో లక్ష్యం చేరడానికి మరింత అడ్డంకిగా మారింది. అసలే అరకొర పనులు జరుగుతున్న ఈ పథకంలో  నిర్దేశిత లక్ష్యాలు చేరుకోలేదంటూ ఒక్కసారిగా 365 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడం మూలిగే నక్కపై తాటికాయ పడినట్లైంది. జిల్లా వ్యాప్తంగా 1363 పంచాయతీల్లో  ప్రస్తుతం 640 పంచాయతీల్లో ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్లు లేరు. ఇక  వెయ్యి పనిదినాలు కూడా కల్పించలేని పరిస్థితిలో 159  పంచాయతీల్లో ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించలేదు. దీంతో ఈ పంచాయతీలు ఖాళీగా ఉన్నాయి. ఇక  వెయ్యి నుంచి ఐడు వేల లోపు పనిదినాలు  మాత్రమే కల్పిస్తున్నారన్న కారణంగా 405 పంచాయతీలలో  పీల్డ్ అసిస్టెంట్ల కు బదులు  సీనియర్‌మేట్ల ను మాత్రమే నియమించారు.

కాని  వాటిలో కూడా క్షేత్రస్థాయి సిబ్బంది లక్ష్యాలను అధిగమించలేదంటూ ఇటీవల 165 మందిని తొలగించారు. ఇక మిగిలిన 759  పం చాయతీల్లో మాత్రమే ఇటీవల వరకు ఫీల్డ్‌అసిస్టెంట్లు ఉన్నారు. అయితే పంచాయతీల్లో 5 వేల పనిదినాలకు తగ్గకుండా పనులు కల్పించడమే కాక ముందస్తు ప్రణాళికలో చూపించిన పనుల్లో 75 శాతం పైగా పనులు  చేయించాల్సి ఉంది.  ఈ రెండు లక్ష్యాలను అధిగమిస్తేనే  ఫీల్డ్ అసిస్టెంట్లు  కొనసాగుతారు. కానీ వీరిలో లక్ష్యాలు చేరలేదంటూ 216 మంది క్షేత్ర సహాయకులను తాజాగా తొలగించా రు. దీంతో మొత్తం 381 మందిని తొలగించినట్లైంది. దీనికి తోడు ఖాళీగా ఉన్న 165 పంచాయతీలను కలిపితే జిల్లా వ్యాప్తంగా మొత్తం 1363లో 640 పంచాయతీల్లో ఉపాధి హామీ పనులకు సంబంధించి క్షేత్రస్థాయి సిబ్బంది లేరు.

అయితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పేరుకు ఉపాధి పనులు జరుగుతున్నా కేవలం 491 పంచాయతీల్లో మాత్రమే  నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు జరుగుతున్నట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ తేల్చింది. మిగిలిన పంచాయతీల్లో మొక్కుబడి పనులు మాత్రమే జరుగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 6.5 లక్షల మంది ఉపాధి హామీ జాబ్‌కార్డులు పొందగా డ్వామా లెక్కల ప్రకారం రోజుకు 1.10 లక్షల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. అరకొరగా మాత్రమే పనులు జరుగుతుండడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.293.43 కోట్ల ఖర్చు చేయాలన్న లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ఉపాధి హామీకి క్షేత్రస్థాయి సిబ్బంది లేకపోవడంతో పాటు కూలీలకు  గిట్టుబాటు కూలీ లభించకపోవడంతో ఉపాధి పనులపై వారు మొగ్గు చూపించడం లేదు. మరోవైపు కనీస వేతనం రూ.169కి పెంచినట్లు చెబుతున్నా అది కూడా సక్రమంగా అమలు జరగడం లేదు.
 
కోర్టును ఆశ్రయించిన ఫీల్డు అసిస్టెంట్లు
నిర్ధాక్షిణ్యంగా తొలగించారంటూ చం ద్రగిరి నియోజకవర్గం నుంచి ముగ్గురు ఫీల్డు అసిస్టెంట్లు తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లారు. మరో 50 మంది ఫీల్డు అసిస్టెంట్లు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే నిబంధనల మేరకే ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు చర్యలు చేపట్టినట్లు డ్వామా అధికారులు చెబుతున్నారు. 2011 నుంచి డ్వామాలో ప్రోగ్రెస్ రిపోర్టు నిబంధనలు అమలు చేస్తున్నట్లు వారు చెబుతున్నారు. ఫీల్డు అసిస్టెంట్ల పనితీరు ఆధారంగా 2012 డిసెంబర్‌లో 256 మందిని తొలగించగా, 2013 అక్టోబర్ 13లో 113 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. 2014లో కొత్తప్రభుత్వం ఏర్పడ్డాక ఫీల్డు అసిస్టెంట్ల తొలగింపు వ్యవహారాన్ని పక్కన పెట్టారు.

తాజాగా 356 మందిని తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సూచనల మేరకే ఈ కార్యక్రమం జరుగుతోందని అధికార వర్గాల భోగట్టా. తక్షణం ఖాళీగా ఉన్న పంచాయతీల్లో క్షేత్రస్థాయి సిబ్బందిని నియమించి మరింత మంది కూలీలకు పనులు కల్పిస్తేనే లక్ష్యాలు చేరే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement