పని పోయినట్లే! | Employment is gone | Sakshi
Sakshi News home page

పని పోయినట్లే!

Published Wed, Aug 19 2015 3:53 AM | Last Updated on Tue, Oct 2 2018 6:35 PM

పని పోయినట్లే! - Sakshi

పని పోయినట్లే!

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎసరు
♦ 5వేల పనిదినాల కంటే తక్కువున్న గ్రామాల్లో తొలగింపు
♦ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
♦ జిల్లాలో 231 పోస్టులకు మంగళం
♦ నిర్ణీత లక్ష్యంలో 75 శాతం పనిదినాలు కల్పించని ఎఫ్‌ఏలపైనా వేటు
♦ వచ్చే నెల నుంచే అమలుకు అవకాశం?
 
  బాబొస్తే.. జాబొస్తుంది. ఈ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతోంది. ఒకపక్క నిరుద్యోగుల ఆశలతో చెలగాటం ఆడుతూ.. చిరుద్యోగుల తొలగింపుతో ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేస్తోంది. ఆ జాబితాలో తాజాగా ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా చేరిపోయారు. పనితనం పేరిట పక్కకు తప్పించే చర్యలను ప్రభుత్వం ముమ్మరం చేసింది.
 
 సాక్షి ప్రతినిధి, కర్నూలు : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్‌ఆర్‌ఈజీపీ)లో ఫీల్డ్ అసిస్టెంట్లు(ఎఫ్‌ఏ)గా పనిచేస్తున్న వారికి గడ్డుకాలం వచ్చింది. జిల్లాలో ఏకంగా 231 ఎఫ్‌ఏ పోస్టులకు మంగళం పాడనున్నారు. ఏడాదిలో 5వేల పనిదినాల కంటే తక్కువున్న గ్రామాల్లో ఎఫ్‌ఏ పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 664 గ్రామాల్లో మాత్రమే ఏడాదిలో 5వేల పనిదినాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ గ్రామాలకు మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు అధికారిక అనుమతి ఉంటుంది. మిగిలిన గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించనున్నారు. ఆ మేరకు ఇప్పటికే ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వచ్చే నెల మొదటి వారం నుంచి అమలు చేసే అవకాశం ఉందని సమాచారం.

మూడు జాబితాలుగా గ్రామాలు
 జిల్లాలో మొత్తం 895 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిని పనిదినాల ఆధారంగా మూడు జాబితాలు(లిస్టు)గా విభజించనున్నారు. మొదటి జాబితాలో ఏడాదికి 5వేల పనిదినాల కంటే ఎక్కువ కల్పించే పంచాయతీలను చేర్చనున్నారు. ఇక రెండో జాబితాలో 5వేల కంటే తక్కువ... వేయి కంటే ఎక్కువ పనిదినాలు కల్పించే గ్రామ పంచాయతీలను, ఇక వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్న పంచాయతీలను మూడో జాబితాగా పరిగణించనున్నారు. ఈ విధంగా వర్గీకరించిన తర్వాత.. మొదటి జాబితాలో ఉన్న గ్రామ పంచాయతీలకు మాత్రమే అధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టును మంజూరు చేయనున్నారు.

ఇక రెండో జాబితాలోని గ్రామ పంచాయతీల్లో ఫీల్డ్ అసిస్టెంటును తొలగించి.. అప్పటికే ఉన్న మేటీల్లో సీనియర్‌ను గుర్తించి బాధ్యతలు అప్పగించాలనేది ప్రభుత్వ నిర్ణయం. వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్న గ్రామ పంచాయతీల్లో సీనియర్ మేటీ పోస్టు కూడా ఉండదు. కేవలం మేటీలు మాత్రమే పనులు చేయించాల్సి ఉంటుంది. ఈ విధంగా జిల్లాలో 664 గ్రామాల్లో 5వేల పనిదినాల కంటే ఎక్కువ కల్పిస్తున్నారు. ఈ గ్రామాల్లో మాత్రమే ఫీల్డ్ అసిస్టెంట్లు కొనసాగుతారు. ఇక 166 గ్రామాల్లో 5వేల కంటే తక్కువ.. వేయి కంటే తక్కువ పనిదినాలు కల్పిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల స్థానంలో సీనియర్ మేటీల వ్యవస్థ అమల్లోకి రానుంది. అదేవిధంగా 65 గ్రామాల్లో వేయి కంటే తక్కువ తక్కువ పనిదినాలు కల్పిస్తున్నారు. అంటే ఈ గ్రామాల్లో కేవలం మేటీల వ్యవస్థ మాత్రమే అమల్లో ఉండనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 231 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు మంగళం పాడనున్నారు.
 
 75 శాతం పనిదినాలు కల్పించకుంటే అవుట్
 ఒకవైపు పనిదినాల ఆధారంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను పూర్తిగా ఎత్తివేయనున్న ప్రభుత్వం.. పనిదినాలు కల్పించని ఎఫ్‌ఏలపైనా వేటు వేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా నిర్ణీత లక్ష్యంలో 75 శాతం పనిదినాలను కల్పించని ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాలని భావిస్తోంది. వీరి స్థానంలో మళ్లీ కొత్త వారిని నియమించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే.. 75 శాతం కాకుండా 60 శాతం పనిదినాలను పరిగణలోనికి తీసుకోవాలనే అంశంపైనా ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. దేనిని కటాఫ్‌గా తీసుకోవాలనే అంశం ఈ నెలాఖరులోగా కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement