అనంతపురం సెంట్రల్ : ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్‌ల తొలగింపు, నియామకం రెండూ రాజకీయనాయకుల చేతుల్లోనే జరిగిపోతున్నాయి. ప్రతి స్థానానికి ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను జోడించి తొలగింపులు, నియామకాలు చేపడుతున్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థలో ఇటీవల ఒకేసారి 437 మంది ఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు. పనితీరులో వెనుకబడిన వారిని మాత్రమే తొలగించామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరిగింది.
75 శాతం కన్నా తక్కువ పనిదినాలు కల్పించిన వారిని తొలిగించామని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవానికి పనిదినాలు కల్పించడంతో పాటు సర్వీసులో నయా పైసా కూడా నిధులు పక్కదారి పట్టకుండా పనిచేస్తున్న సిబ్బంది ఉన్నారు. కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించగా తొలగింపులు విరుద్ధంగా జరిగాయని, వెంటనే విధుల్లో కొనసాగించాలని ఉత్తర్వులు వస్తున్నాయి. ఇవేమి అధికారులు పట్టించుకోవడం లేదు. త్వరలో 437 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వీటికి తోడు గత 18వ తేదీన 82 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం స్థానాల్లో అధికారపార్టీకి చెందిన వారినే నియమించాలని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 82 స్థానాలకు కేవలం 8 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో కూడా అన్నీ సక్రమంగా లేవని తెలుస్తోంది. నిబంధనల మేరకు సర్పంచు రిజర్వేషన్ ప్రకారం అభ్యర్థులు 25 రోజులు తప్పనిసరిగా పని చేసిన వారు అర్హులు. దీనికి తోడు జన్మభూమి కమిటీలు ఆమోదించాలని మెలికపెట్టారు.
దీంతో అధికారపార్టీకి చెందిన వారు మాత్రమే అర్హులన్నట్లు తయారైంది. రిజర్వేషన్లు, పనిదినాలు అన్నీ సక్రమంగా ఉన్నా జన్మభూమి కమిటీలు ఆమోదించడం లేదు. ఒకసారి ఎమ్మెల్యేను కలిసి అక్కడి నుంచి లేఖ తీసుకుని రావాలని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కటాక్షం ఉంటేనే ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం వస్తుందని అభిప్రాయం సర్వత్రావ్యక్తమవుతోంది.
ధర్మవరం నియోజకవర్గంలో ముందే నియామకాలు :
ధర్మవరం నియోజకవర్గంలో అధికారులు చేయాల్సిన పనిని అక్కడున్న రాజకీయ నేతలే చేసేస్తున్నారు. ఇంకా నోటిఫికేషన్ కూడా విడుదల చేయని స్థానాల్లో అనధికారికంగా ఫీల్డ్ అసిస్టెంట్‌లను నియమించుకున్నారు. ముదిగుబ్బ మండలంలో ఈ పరిస్థితి ఎక్కువశాతం నెలకొంది. దీంతో అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవడానికే వెనుకంజ వేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే తొలుత విడుదల చేసిన 82 స్థానాలను మాత్రమే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఖాళీ ఏర్పడిన 437 స్థానాలకు భర్తీ విషయం హైకోర్టుకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా తమను తొలగించారని కొంతమంది బాధిత ఫీల్డ్ అసిస్టెంట్‌లు కోర్టును ఆశ్రయించారు. అధికారులు త్వరలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు నుంచి ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఫీల్డ్ అసిస్టెంట్‌ల నియమాకం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
నేతల కనుసన్నల్లోనే...
Published Thu, Oct 1 2015 2:54 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement