వెంగళాయపాలెం గ్రామం
అభివృద్ధిలో పంచాయతీలు పోటీ పడాలని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌ని ప్రకటిస్తోంది. అందుకు సరిపడా నిధులను మాత్రం అందించలేకపోతోంది. ఒకవేళ నిధులిచ్చినా జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఒకవైపు సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దయ్యింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దశలో గ్రామాలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా ‘డమ్మీ స్టార్స్’తో లేని అభివృద్ధి ఉన్నట్టు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది.
సాక్షి, అమరావతి బ్యూరో/ఎస్‌వీఎన్‌కాలనీ: గ్రామ పంచాయతీల అభివృద్ధిని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌తో సూచిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులకు, వచ్చిన రేటింగ్స్‌కు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. వివిధ శాఖల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి, మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ అంటూ మభ్యపెడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. జన్మభూమి కమిటీలకు అధికారాలను కట్టబెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.
గ్రేడింగ్‌లు ఇలా...
గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో స్టార్‌ల రూపంలో ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల నుంచి నిధులు విడుదల అవుతున్నా, క్షేత స్థాయిలో ఆశించిన మేర అభివృద్ధి కనిపించడం లేదని ప్రభుత్వం పంచాయతీలకు గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ అంశాలపై ఈ రేటింగ్ విధానం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
రేటింగ్ ఇలా..
పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచేందుకు 11 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్‌లు సాధించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.
- ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ గ్రామంగా ఉండాలి
- ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామాల్లో వీధి దీపాలు ఎల్‌ఈడీలుగా మార్పు
- ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి
- సురక్షిత తాగునీరు అందాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్
- పారిశుద్ధ్యాన్ని మొరుగుపరిచేందుకు ఘన, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు
- ప్రయాణాలకు అనువైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం
- కో నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి పైబర్ నెట్
- ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో ఉండేలా చూడటం. వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులు చూపించాలి.
- బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు హాజరు కావడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు
- చిన్నారులకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, వంద శాతం పోషకాహారం అందాలి.
- మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితకు కృషి. లింగ సమానత్వం, గృహ హింస రహిత గ్రామాలు
ఇదీ జిల్లా సంగతి..
జిల్లాలో మొత్తం 1011 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఒక్కో పంచాయతీకి 10 వరకు స్టార్ రేటింగ్ ఇస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలు 10,110 స్టార్‌లు సాధించాలి. కానీ ఇంత వరకు 5,624 స్టార్ రేటింగ్స్‌ను మాత్రమే సాధించాయి. ప్రభుత్వం పేర్కొన్న అంశాల ప్రకారం స్టార్‌లు 55.89 శాతం మాత్రమే వచ్చాయి. అంటే జిల్లాలో ఎక్కువ శాతం పంచాయతీలు చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాయని చెబుతునప్పటికీ , క్షేత్ర స్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకనిధులు అందటం లేదు. విద్యుత్తు, రక్షిత మంచినీటి ప«థకాల నిర్వహణకు కూడా చిన్న పంచాయతీల్లో నిధులు సరిపోని పరిస్థితి
నెలకొంది.
అభివృద్ధి ఆధారంగానే రేటింగ్
గ్రామ పంచాయతీల్లో ఓడీఎఫ్, విద్యుత్తు, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, పౌరసేవలు వంటి అంశాల ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చారు. గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు అభివృద్ధిలో స్టార్ రేటింగ్ మెరుగుపరచుకునేలా చర్యలు తీసుకుంటాం.–అరుణ, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment