పంచాయతీలకు ’పవర్‌’ కట్‌ | power problems to panchayats | Sakshi
Sakshi News home page

పంచాయతీలకు ’పవర్‌’ కట్‌

Published Mon, Jan 30 2017 11:08 PM | Last Updated on Wed, Sep 5 2018 3:37 PM

పంచాయతీలకు ’పవర్‌’ కట్‌ - Sakshi

పంచాయతీలకు ’పవర్‌’ కట్‌

బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌ శాఖ నోటీసులు 
 చీకట్లో మగ్గుతున్న పల్లెలు
చింతలపూడి/జంగారెడ్డిగూడెం :
జిల్లాలోని పల్లెలు చీకట్లో మగ్గాల్సిన దుస్ధితి తలెత్తింది. గ్రామాలను స్మార్ట్‌ విలేజ్‌లుగా అభివృద్ధి చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల భారాన్ని పంచాయతీలపైనే రుద్దుతోంది. అసలే నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు విద్యుత్‌ బిల్లులు తలబొప్పి కట్టిస్తున్నాయి. బకాయిలు ఉన్న గ్రామ పంచాయతీలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేస్తున్న ఘటనలు 10 రోజులుగా జిల్లాలో పెరుగుతున్నాయి. బకాయిలు చెల్లించాలంటూ గ్రామ పంచాయతీలకు, జిల్లా పంచాయతీ అధికారికి నోటీసులు పంపించామని, సరైన స్పందన రాకపోవడంతో గత్యంతరం లేక విద్యుత్‌ నిలిపివేస్తున్నామని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. గతంలో 13వ ఆర్థిక సంవత్సరం నిధులు పంచాయతీల విద్యుత్‌ బిల్లులకు కొంత సొమ్ము జమ చేశారు. అయినా.. బకాయిలు తీరలేదు. మేజర్‌ పంచాయతీల మాటెలా ఉన్నా మైనర్‌ పంచాయతీల పరిస్థితి అధ్వానంగా ఉంది. మైనర్‌ పంచాయతీలకు ఆదాయ వనరులు లేకపోవడంతో విద్యుత్‌ బకాయిలు చెల్లించలేకపోతున్నాయి. దీంతో ట్రాన్స్‌కోకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయి. పాత బకాయిలు కట్టకపోతే గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు సైతం విద్యుత్‌ నిలిపివేయక తప్పదని విద్యుత్‌ శాఖ అధికారులు తెగేసి చెబుతున్నారు. బకాయిలు చెల్లించే వరకు విద్యుత్‌ను పునరుద్ధరించేది లేదని భీష్మిస్తున్నారు. పంచాయతీల విద్యుత్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలని చాలాకాలంగా సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. 
 
బకాయిలు రూ.170 కోట్లు
జిల్లాలో చాలా పంచాయతీలకు ఇప్పటికే ఏపీ ఈపీడీసీఎల్‌ అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. వీటిలో కొన్ని చోట్ల ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో అనధికారికంగా కనెక‌్షన్లు ఇచ్చినప్పటికీ చాలా పంచాయతీలు నేటికీ చీకట్లో మగ్గుతున్నాయి. జిల్లాలో 906 పంచాయతీలు ఉండగా,  రూ.170 కోట్ల మేర విద్యుత్‌ బకాయిలు పేరుకుపోయాయి. మేజర్‌ పంచాయతీల విషయానికి వస్తే వీధిలైట్లు, పంచాయతీ కార్యాలయాలకు సంబంధించి రూ.22.94 కోట్లు బకాయిలు ఉండగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.57.54 కోట్లు చెల్లించాల్సి ఉంది. మైనర్‌ పంచాయతీలు వీధిలైట్లు, కార్యాలయాల విద్యుత్‌కు సంబంధించి రూ.22.23 కోట్లు బకాయి పడగా, మంచినీటి సరఫరాకు సంబంధించి రూ.67.22 కోట్లను బకాయిపడ్డాయి. మూడు నెలలుగా బకాయిలు పేరుకుపోతున్నాయని విద్యుత్‌ శాఖ చెబుతోంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాత బకాయిలు చెల్లించి , ఆ తరువాత మూడు నెలల నుంచి ఏ నెలకు ఆ నెల బిల్లులు చెల్లించాలని కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయినప్పటికీ పంచాయతీల వద్ద నిధుల లేకపోవడంతో ప్రతినెలా బిల్లులు పెండింగ్‌ పడుతున్నాయి. 
 
ప్రభుత్వమే చెల్లించాలి
గ్రామ పంచాయతీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. వాటికి వచ్చే ఆదాయం సిబ్బంది జీతాలకే సరిపోవడం లేదు. దీనికి తోడు తాగునీటి సరఫరా, పారిశుధ్యానికి నిధులు చాలడం లేదు. ఈ పరిస్థితుల్లో పాత బకాయిలు కట్టలేకపోతున్నాం. ప్రభుత్వం తక్షణం స్పందించి విద్యుత్‌ బకాయిలను రద్దు చేయాలి. లేదంటే ప్రభుత్వమే ఆ మొత్తాలను చెల్లించాలి.
 మారిశెట్టి జగదీశ్వరరావు, సర్పంచ్, చింతలపూడి 
 
సరఫరా నిలిపివేస్తున్నాం
విద్యుత్‌ బిల్లులు చెల్లించని పంచాయతీల్లో సరఫరా నిలిపివేస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత బకాయిలు వీటినుంచి కట్టించుకున్నా, ఆ తరువాత వరుసగా మూడు నెలల నుంచి పంచాయతీలు బిల్లులు చెల్లించడం లేదు. ఏ నెల బిల్లు ఆ నెల కట్టాలంటూ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా పంచాయతీలు చెల్లించడం లేదు. దీంతో బకాయిపడిన పంచాయతీలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్నాం. ఈ విషయంలో మేం చేయగలిగిందేమీ లేదు
 సీహెచ్‌ సత్యనారాయణరెడ్డి, ఎస్‌ఈ, ఏపీ ఈపీడీసీఎల్‌
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement