50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా? | ACB Caught Red Handed To Chandragiri Panchayat EO | Sakshi
Sakshi News home page

50 లక్షల లంచమిచ్చా.. సంపాదించుకోకపోతే ఎలా?

Published Sat, Mar 1 2025 11:39 AM | Last Updated on Sat, Mar 1 2025 3:13 PM

ACB Caught Red Handed To Chandragiri Panchayat EO

 లంచంతో రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీకి పట్టుబడ్డ చంద్రగిరి పంచాయతీ ఈవో 

అవినీతి కేసులో పట్టుబడి నెల్లూరు సెంట్రల్‌ జైలుకు 

డబ్బులిచ్చి పోస్టింగ్‌ తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు 

ఏసీబీ చేతిలో కీలక సమాచారం

సాక్షి,  చిత్తూరు: అవినీతి అధికారుల గుండెల్లో దడ మొదలైంది. ప్రజాప్రతినిధులకు లంచమిచ్చి పోస్టింగ్‌ తెచ్చుకున్న వారి వెన్నులో వణుకు పుడుతోంది. ఏసీబీ(ACB) అధికారుల చేతిలో కీలక ఆధారాలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని లంచావతారమెత్తిన అధికారుల్లో గుబులు రేకెత్తుతోంది.  

కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) ఏర్పడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు మొదలయ్యాయి. తిరుపతికి అతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఉండడంతో పోస్టింగ్‌ల కోసం భారీగా డిమాండ్‌ తలెత్తింది. అందులోనూ నియోజకవర్గ కేంద్రంలో పోస్టింగ్‌ కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులు పైరవీలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో నియోజకవర్గ ముఖ్యప్రజాప్రతినిధికి ముడుపులు చెల్లించినట్టు అప్పట్లో దుమారం రేగింది. ఇలా పోస్టింగులు తెచ్చుకున్న ఉద్యోగులు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అక్రమ వసూళ్లకు తెరలేపారు. ఏపనికి వెళ్లినా మామూళ్ల కోసం వేధించడం మొదలు పెట్టారు. కడుపు మండిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు.  

ఈవోగా కొనసాగడానికి రూ.50 లక్షలు ఇచ్చా! 
‘చంద్రగిరి(Chandragiri) పంచాయతీ ఈవోగా రావడానికి స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి రూ.50 లక్షలు లంచంగా ఇచ్చా. మీలాంటి వాళ్లు ఇవ్వకుంటే నేను ఆ డబ్బు ఎలా సంపాధించాలి. నా కుటుంబం ఏమైపోతుంది. నేను అడిగినంత ఇస్తేనే బిల్లు పాస్‌ చేస్తా’నని చంద్రగిరి పంచాయతీ ఈఓ మహేశ్వరయ్య తేల్చిచెప్పారు. ఎంబుక్‌లు, రికార్డు చేసినందున రూ.50 వేలు ఇవ్వాలని చిన్నగొట్టిగల్లుకు చెందిన కాంట్రాక్టర్‌దినేష్‌ను డిమాండ్‌ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పినా వినకపోవడంతో దినేష్‌ ఏసీబీని ఆశ్రయించారు. ఈ మేరకు ఈఓ మహేశ్వరయ్య రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.  

ఏసీబీ అధికారుల చేతిలో కీలక ఆధారాలు 
చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వర య్య లంచగొండుతనమంతా ఏసీబీ అధికారుల చేతుల్లో ఉన్నట్టు సమాచారం. ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్‌ దినేష్‌ దగ్గర సంబంధిత అధికారులు ఒక చిప్‌ ఇచ్చి అతని ద్వారా పోలీసులు ట్రాప్‌ చేసినట్టు సమాచారం. నాలుగు రోజుల నుంచి వారిద్దరి మధ్యన జరిగిన సంభాషణ మొత్తం రికార్డు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులోనే ఈవో పోస్టుకు రూ.50 లక్షలు స్థానిక ప్రజాప్రతినిధి సతీమణికి అందజేసినట్టుగా చెప్పిన మాటలు కూడా రికార్డు అయినట్టు సమాచారం. ఆ సంభాషణను విన్న తర్వాత ఏసీబీ అధికారులు బాధితుడు దినేష్‌ చేతికి రూ.50 వేలు ఇచ్చి ఈవో మహేశ్వరయ్యకు ఇప్పించి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

లంచగొండి అధికారుల గుండెల్లో గుబులు 
చంద్రగిరి మేజర్‌ పంచాయతీలో జరిగిన ఏసీబీ దాడులతో నియోజకవర్గంలో కాసులు చెల్లించి పోస్టింగులు తెచ్చుకున్న అధికారుల గుండెల్లో గుబులు పట్టుకుంది. ముడుపులు చెల్లించి లంచావతారం ఎత్తిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పోలీసు, మండల పరిషత్‌ కార్యాలయం, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, రోడ్లు భవనాల శాఖ అధికారులు కొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టడానికి సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement