అత్తింటి ముందు బిడ్డతో స్పందన
జమ్మికుంట: ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టడమే శాపమైంది. బిడ్డతో కాపురానికి వచ్చిన ఆమెకు మెట్టినింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లోకి రానీయకుండా అత్తమామలు అడ్డుకున్నారు. కాపురానికి రావద్దని భర్త తెగేసి చెప్పాడు. ఆ ఇల్లాలు 100కు కాల్ చేయగా.. పోలీసులు వచ్చి.. గొడవలు వద్దని, పంచాయితీ చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తికి బండ ప్రభాకర్, పుష్పలత దంపతుల కూతురు బండ స్పందనను ఐదేళ్ల క్రితం మాచనపల్లికి చెందిన గాండ్ల శంకర్, అరుణ దంపతుల కుమారుడు కిరణ్‌కిచ్చి వివాహం చేశారు. రూ.4 లక్షల కట్నం, ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
11 నెలల క్రితం స్పందన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని కిరణ్ కనీసం చూసేందుకూ రాలేదు. పైగా కాపురానికి నిరాకరిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం స్పందన తండ్రి చనిపోవడంతో ఆమెకు పెద్ద దిక్కులేకుండా పోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా కిరణ్ మనసు మారలేదు.
బంధువుల సహకారంతో స్పందన ఆదివారం మాచనపల్లికి చేరుకుంది. దీంతో అత్తమామ, భర్త, ఆడబిడ్డ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని గెంటేశారు. దీంతో బాధితురాలి బంధువులు 100 కాల్ చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు రెండురోజుల్లో పంచాయితీ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. స్పందన పుట్టెడు దుఃఖంతో మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment