karimnagar distrcit
-
కలెక్టర్ కి అడ్డుపడి ధర్నాకు కూర్చున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
-
ఆడపిల్ల పుట్టిందని..
జమ్మికుంట: ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టడమే శాపమైంది. బిడ్డతో కాపురానికి వచ్చిన ఆమెకు మెట్టినింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లోకి రానీయకుండా అత్తమామలు అడ్డుకున్నారు. కాపురానికి రావద్దని భర్త తెగేసి చెప్పాడు. ఆ ఇల్లాలు 100కు కాల్ చేయగా.. పోలీసులు వచ్చి.. గొడవలు వద్దని, పంచాయితీ చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తికి బండ ప్రభాకర్, పుష్పలత దంపతుల కూతురు బండ స్పందనను ఐదేళ్ల క్రితం మాచనపల్లికి చెందిన గాండ్ల శంకర్, అరుణ దంపతుల కుమారుడు కిరణ్‌కిచ్చి వివాహం చేశారు. రూ.4 లక్షల కట్నం, ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 11 నెలల క్రితం స్పందన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని కిరణ్ కనీసం చూసేందుకూ రాలేదు. పైగా కాపురానికి నిరాకరిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం స్పందన తండ్రి చనిపోవడంతో ఆమెకు పెద్ద దిక్కులేకుండా పోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా కిరణ్ మనసు మారలేదు. బంధువుల సహకారంతో స్పందన ఆదివారం మాచనపల్లికి చేరుకుంది. దీంతో అత్తమామ, భర్త, ఆడబిడ్డ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని గెంటేశారు. దీంతో బాధితురాలి బంధువులు 100 కాల్ చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు రెండురోజుల్లో పంచాయితీ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. స్పందన పుట్టెడు దుఃఖంతో మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. -
ట్విస్టులే ట్విస్టులు.. కిడ్నాపర్‌ను పట్టించిన స్టిక్కర్.. ఆపరేషన్ ‘నిమ్రా’ సక్సెస్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ కరీంనగర్‌క్రైం: నగరంలో ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. నాలుగు గంటల్లోనే కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు బాలికను తల్లిఒడికి చేర్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను మంగళవారం కరీంనగర్ సీపీ సత్యనారాయణ వెల్లడించారు. నగరంలోని అశోక్‌నగర్‌కు చెందిన మహమ్మద్ కుత్బుద్దీన్ దంపతులకు ఏడాదిన్నర వయసున్న కూతురు నిమ్రా ఉంది. చదవండి: పెంచి, పెళ్లి చేసుకొని.. హతమార్చాడు సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటూ అదృశ్యమైంది. స్థానికం గా గాలించినా ఆచూకీ తెలియలేదు. పాప ఆటోలో వెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో కుత్బుద్దీన్ రాత్రి 9.30 గంటలకు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రంయించాడు. ఏసీపీ తుల శ్రీనివాస్ నేతృత్వంలో ఐదు సివిల్, ఒక టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ, స్థానికుల సమాచారంతో గంట వ్యవధిలోనే పాపను ఎత్తుకెళ్లిన ఆటో డ్రైవర్ సంతోశ్ ఇంటిని గుర్తించారు. అతని ద్వారా నిమ్రా కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమద్ది రాములు ఇంట్లో ఉంచాడని తెలుసుకున్నారు. అతని ఇంటికి వెళ్లి పాపను అర్ధరాత్రి దాదాపు 12.45 గంటలకు సురక్షితంగా కాపాడారు. ఈ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ తుల శ్రీనివాసరావు, సీఐలు నటేశ్, దామోదర్‌రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, రహీంపాషా, టీ.మహేశ్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్,లక్ష్మణ్, జ్ఞానేశ్వర్, దేవేందర్, కానిస్టేబుళ్లు బషీర్ అహ్మద్ ఖాన్, రవీందర్, మల్లయ్య, రాజ్‌కిరణ్, బద్రుద్దీన్, మనోహర్‌లను సీపీ సత్యనారాయణ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించారు. నిమ్రాను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు మేనమామ అనుకుని ఎక్కిన నిమ్రా సోమవారం రాత్రి 7 గంటలకు అశోక్‌నగర్ ఉండే ఆటోడ్రైవర్ సంతోశ్ వద్దకు ఇద్దరుమహిళలు వచ్చి బీబీఆర్ ఆసుపత్రి వెళ్లేందుకు కిరాయి మాట్లాడుకున్నారు. వారిది చిన్నగల్లీ కావడంతో ఆటో వెళ్లలేదు. రాత్రి 7.25కి ఆటో(టీఎస్ 02యూసీ 3079)ను కుత్బుద్దీన్ ఇంటి ఎదుట నిలిపాడు. బయట ఆడుకుంటున్న నిమ్రా తన మేనమామ ఆటో అనుకుని ఎక్కింది. సంతోశ్ పక్కనే కూర్చుంది. మద్యంమత్తు లో ఉన్న అతనూ చిన్నారి నిమ్రాను వారించలేదు. ఈలోపు మహిళలురాగానే వారిని బీబీఆర్ ఆసుపత్రి వద్ద దించాడు. తరువాత అతనిలో పాపను అమ్మేసి సొమ్ము చేసుకోవాలన్న దుర్బుద్ధి పుట్టింది. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌లోని తన స్నేహితుడు కొలమ ద్ది రాములుకు పాపను అప్పగించాడు. తెల్లవారి పాపను ఎంతోకొంతకు విక్రయించాలని ఇద్దరూ కలిసి అనుకున్నారుు. ఏమీ తెలియనట్లుగా రాత్రి 11.30 గంటలకు సంతోశ్ తిరిగి ఇల్లు చేరాడు. అప్పటికే కాపుకాసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి మొత్తం విషయం కక్కేశాడు. వన్‌టౌన్ పోలీసులు సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదేరాత్రి ఖాజీపూర్‌లోని రాములు ఇంటిని చుట్టుముట్టారు. రాత్రి 12.45 గంటలకు ఏసీపీ తుల శ్రీనివాస్, సీఐ నటేశ్, ఎస్సై శ్రీనివాస్‌లు పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించడంతో కిడ్నాప్ కథ సుఖాంతమైంది. స్టిక్కర్ పీకేసిన సంతోశ్ 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా నగరంలో ఆటోలపై స్టిక్కర్లు వేశారు. బీబీఆర్ ఆస్పత్రి వద్ద మహిళలను దించిన సమయంలోనూ సంతోశ్ ఆటోపై స్టిక్కర్ ఉంది. పాపను రాములుకు అప్పగించిన తరువాత స్టిక్కర్‌ను తొలగించాడు. ఆటో నంబరు సరిపోలినా.. వెనక స్టిక్కర్ లేదు. కానీ, స్టిక్కర్ తీసేసిన ప్రాంతం జిగటగా ఉండటంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అదే ఆటో అని నిర్ధారించుకుని సంతోశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా నిమ్రా అదృశ్యమవగానే.. పాప చిత్రం, వివరాలతో పలు మెసేజ్‌లు నగరంలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరలయ్యాయి. దీంతో పలువురు యువకులు స్వచ్ఛందంగా గాలించారు. పాప ఆచూకీ చిక్కిన సమయంలోనూ వీరంతా పోలీసుల వెంటే ఉండటం గమనార్హం -
కన్నీరు పెట్టిస్తున్న వినయ్ సూసైడ్ లేఖ.. ఆ 14 మందే కారకులు..
సాక్షి, సైదాపూర్(హుస్నాబాద్): అర గుంట భూమి కోసం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు ఓ వ్యక్తి. తన చావుకు కారకుల పేర్లు సూసైడ్ నోట్లో రాసి, గురువారం ఉదయం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకొని మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. మండలంలోని జాగీర్పల్లి గ్రామానికి చెందిన కమ్మం వినయ్‌కుమార్(34) ఎంబీఏ పూర్తి చేశాడు. మండల కేంద్రంలోని వెంకటసాయి ఫర్టిలైజర్ షాపులో ఆరేళ్లు పని చేశాడు. కొన్ని రోజుల క్రితం పని మానేశాడు. అతడి తండ్రికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కాచెల్లెల్లు ఉన్నారు. ఉమ్మడి ఆస్తులు, వ్యవసాయ భూములు పంపకాలు జరిగాయి. చదవండి: (వివాహేతర సంబంధం.. ఒకే గదిలో ముగ్గురు.. చివరకు..) ఎవరి భూమి వారు కాస్తు చేసుకుంటున్నారు. కాగా వినయ్‌కుమార్ తండ్రి పెద్దన్నకు 20 గుంటల భూమి పట్టా కావడంలేదు. అంతే కాకుండా ఇళ్ల స్థలం రెండు గుంటలు వినయ్ తాత, మేనత్తకు ఇచ్చాడు. ఆమె తమ్మునికి అమ్ముకుంది. తమ్ముడు మరో వ్యక్తికి విక్రయించాడు. ఆ రెండు గుంటల్లో తన తండ్రికి అర గుంట రావాలని వినయ్‌కుమార్ కొంతకాలంగా మేనత్త, చిన్నాన్నలపై పోరాటం చేస్తున్నాడు. ఈ సమస్య పరిష్కారం కావడంలేదు. దీంతో పాటు ఆరేళ్లు తాను పని చేసిన ఫర్టిలైజర్ షాపు యజమాని తనను దొంగగా, మోసగాడిగా ముద్రవేశాడని మనస్తాపం చెందాడు. చదవండి: (ప్రియురాలికి స్నేహితురాలు వీడియోకాల్.. వక్రబుద్ధితో..) ‘వేణు అంకుల్ నా గోస తగిలి మీరు, మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండమంటూ, తన చావుకు బూర్ల భాస్కర్, కమ్మం సమ్మయ్య, కమల, కమ్మం వినీత్, కమ్మం వివేక్, కమ్మం విశాల్, దొడ్డి సురేష్, దొడ్డి గట్టయ్య, కమ్మం చంద్రయ్య, మహెంద్ర, కమ్మం ఉదయ్, కమ్మం కావ్య, గంజి అలేఖ్యలు కారకులని, తన భూములు ఆక్రమించుకున్నారు’ అని సూసైడ్‌లో పేర్కొన్నాడు. మృతుడికి భార్య ప్రవళిక, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి తల్లి కమ్మం జయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధూకర్‌రెడ్డి తెలిపారు. -
చేనేత మృతుల కుటుంబాలను ఆదుకోండి
ఖైరతాబాద్: ఆర్థిక ఇబ్బందులతో మూకుమ్మడిగా ఆత్మ హత్యలకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కాట్నాపల్లికి చెందిన చేనేత కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. మృతుల కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జాతీయ చేనేతన్నల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ చైర్మన్ దాసు సురేష్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రవీణ్‌కుమార్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాములు మాట్లాడారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సామూహిక ఆత్మహత్యలకు పాల్పడినా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీపీఐ నేత పాశికంటి లక్ష్మినర్సయ్య, బీసీ మహిళానేత శారద గౌడ్, సాజిదా సికిందర్, బోనం ఊర్మిళ, వీరస్వామి పాల్గొన్నారు. -
Huzurabad Bypoll: ‘గులాబీ’ దూకుడు
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గ ఉపఎన్నిక నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ప్రారంభంకాగా టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ తొలిరోజే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుతోపాటు ప్రచారంలోనూ తమదే ముందంజ అని చాటిచెప్పాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది మే 1న ఈటల కేబినెట్ నుంచి బర్తరఫ్ కాగా, జూలై 12న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడర్ చేజారకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. తర్వాత ఈటల వెంట వెళ్లిన లీడర్లతోపాటు ఇతర పార్టీల ముఖ్యనేతలు, క్రియాశీల నాయకులను టీఆర్ఎస్ గూటికి తెచ్చేలా పావులు కదిపి ఫలితం సాధించింది. పార్టీ నుంచి ఈటల నిష్క్రమించిన తర్వాత 114 రోజుల వ్యవధిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో 140 వరకు సభలు, సమావేశాలు నిర్వహించింది. ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు సారథ్యంలో పార్టీ యంత్రాంగం ఊరూరా, ఇంటింటా ప్రచారం చేసి జనానికి చేరువయ్యే ప్రయత్నం చేస్తోంది. తొలుత పార్టీ కేడర్‌తో మండలాలవారీగా సమావేశాలు, నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తి, కొత్త పనులకు శంకుస్థాపన వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. పలువురు నియోజకవర్గ నేతలకు రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా స్థానిక నాయకత్వం విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేసింది. ‘దళితబంధు’ అమలుకు హుజూరాబాద్‌ను వేదికగా ఎంచుకుని ఆగస్టు 16న జరిగిన సభకు పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఓ వైపు లబ్ధిదారులు.. మరోవైపు సామాజిక వర్గాలు నియోజకవర్గంలో 2.36 లక్షల మంది ఓటర్లు ఉండగా వీరిలో సుమారు లక్షన్నర మంది వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులే ఉన్నట్లు టీఆర్ఎస్ గుర్తించింది. దీంతో లబ్ధిదారులను చేరుకోవడం లక్ష్యంగా మూడు నెలలుగా అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వచ్చింది. సామాజికవర్గాలవారీగా ఓటర్లను గుర్తించి సమ్మేళనాలను నిర్వహించింది. మరోవైపు నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలు, ఐదు మండలాల పరిధిలో రూ.80 కోట్లు ప్రత్యేక నిధులు విడుదల చేసి పెండింగ్ పనులు పూర్తి చేయించేలా మంత్రి హరీశ్‌రావు కీలక పాత్ర పోషించారు. దళితబంధు పథకం లబ్ధిదారులకు అందుబాటులో ఉండేలా పార్టీ తరపున ఏడుగురు ఇన్చార్జీలను నియమించింది. ముగ్గురు మంత్రులు, సుమారు 20 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మరో 50 మంది టీఆర్ఎస్ ముఖ్యనేతలు నియోజకవర్గంలో మకాం వేసి ప్రచారవ్యూహాన్ని అమలు చేస్తున్నారు. సమన్వయం, ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పార్టీ కేడర్ చేజారకుండా చూసుకోవడం, ఇతర పార్టీల నుంచి చేరికలు, ప్రభుత్వ కార్యక్రమాల అమలుతో హుజూరాబాద్ నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించామనే ధీమా టీఆర్ఎస్లో కనిపిస్తోంది. అయితే, దుబ్బాక చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ తేదీవరకు అన్ని స్థాయిల్లోనూ అప్రమత్తంగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ‘గత మూడు నెలలుగా నియోజకవర్గంలోని ప్రతి ఓటరునూ కనీసం మూడు నుంచి నాలుగుసార్లు కలిశాం. ఇంటింటి ప్రచారం చేసి ఓటర్లను ప్రత్యక్షంగా కలిసేందుకు ఎక్కువ ప్రయత్నించాం. ఓ రకంగా ఉప ఎన్నికల సన్నాహాలకు సంబంధించి పార్టీపరంగా సిలబస్ పూర్తి చేశాం. ఇక తుది పరీక్ష కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. ప్రత్యర్థి పార్టీలకు తావు ఇవ్వకుండా ఎప్పటికప్పుడు పార్టీ వ్యూహాన్ని పునశ్చరణ చేసుకునేలా ప్రచార సరళి ఉంటుంది’అని హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ తరపున కీలకంగా పనిచేస్తున్న నేత ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. -
ప్రాణం మీదకు తెచ్చిన కరోనా భయం
సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్): కరోనా భయం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎక్కడ కరోనా వస్తుందోనని చికెన్‌కు శానిటైజ్ చేసి తినడం ప్రాణాపాయ స్థితికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీ యాకుబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఇంటికి చికెన్ తీసుకొచ్చాడు. కరోనా భయంతో చికెన్ వండిన తర్వాత చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను అందులో కలిపాడు. వాసన రావడంతో భార్యాపిల్లలు తినలేదు. ఒక్కడే తినడంతో కొద్దిసేపటి తర్వాత వాంతులయ్యాయి. దీంతో మొదటి వారంలోనే వరంగల్ ఎంజీఎంకు వెళ్లాడు. పేగులు గాయపడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారనే భయంతో ఆగస్టు 29న ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇవ్వకుండానే స్వగ్రామానికి చే రాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, కాళ్లూ చేతులు పనిచేయకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. పరిస్థితి విషమించినట్లు తెలియడంతో జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ తన వంతు ఆర్థికసాయం అందజేశారు. మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి తగిన వైద్యసాయం చేస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. సర్పంచ్ మహేందర్, నాయకులు పాల్గొన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ సమీక్ష
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్‌గా విభజన చేస్తామని తెలిపారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను నియమిస్తామన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమారును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని.. గోదావరి మాతకి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి చీర, సారే సమర్పించారు. అనంతరం కాళేశ్వరము ముక్తేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు. -
లిక్కర్ కాదు..లైబ్రరీ కావాలి
శంకరపట్నం(మానకొండూర్): గ్రామాల్లో లిక్క ర్ కాదు ..చదువుకునేందుకు లైబ్రరీ ఉండాలే... ఆకలేస్తే అక్షరాలు తినాలని గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ అన్నారు. శంకరపట్నం మండలం కన్నాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం సందర్శించారు. ప్రభుత్వ బడిలో చదువుకున్న ఎస్సెస్సీలో 600మార్కులకు 389 మార్కులు సాధించిన, ఇంటర్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని కష్టపడి ఐపీఎస్ సాధించినప్పుడు మీరెందుకు ఐఏఎస్ కాకూడదని విద్యార్థుల్లో ఆలోచనలు రేకెత్తించారు. ప్రభుత్వ బడుల్లో చదువుకున్న పేదవిద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్, శాస్త్రవేత్తలు అయ్యేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించా లని సూచించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థికి ఒక్క రూపాయి ఇవ్వండి మీరు ఇచ్చేది రూపాయే కని విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందన్నారు. విద్యార్థి దశలో కష్టపడి చదువుకున్న ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంటర్ తర్వాత ముఖ్యంగా బాలికలు మంచి కాలేజీ ఎంపిక చేసుకుని డిగ్రీ చదువుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు విద్యార్థులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను సన్మానించారు. -
తమాషా చేస్తున్నారా? - కలెక్టర్ ఆగ్రహం
జగిత్యాల: తమాషా చేస్తున్నారా...ఒక్క మొక్క చనిపోయినా ఊరుకునేది లేదు..మొక్కలకు రక్షణ కల్పించాలని, సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని అందరు సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్ శరత్ అధికారులకు సూచించారు. మంగళవారం ఐఎంఏ హాల్ నుంచి నర్సింగ్ కళాశాల, డీఆర్డీఏ ఆఫీసు, మహిళ సంక్షేమ కార్యాలయం, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాటిన మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సమీపంలో మొక్కలకు ఏర్పాటు చేసిన ట్రీగార్డులు సక్రమంగా లేకపోవడం, బోర్డులు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖ నాటిన మొక్కల బాధ్యత వారే చూసుకోవాలన్నారు. ప్రతీ మూడు రోజులకోసారి పరిశీలిస్తానన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనంతరం మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఆయన వెంట వివిధశాఖల అధికారులున్నారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
సాక్షి, కథలాపూర్(కరీంనగర్) : కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో చీర్నం మంజుల ఉరఫ్ ఏజీబీ హనిశ్రీ(20) అనే వివాహిత ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...కథలాపూర్ మండలం ఊట్‌పెల్లికి చెందిన హనిశ్రీకి పెగ్గెర్ల గ్రామానికి చెందిన చీర్నం శ్రీకాంత్‌తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. శ్రీకాంత్ పెళ్లయిన తర్వాత గల్ఫ్ దేశం వెళ్లి 10 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈనెల 22న ఆ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తల మధ్య కుటుంబం విషయంలో గొడవ జరిగింది. ఈక్రమంలో మంజులను భర్త శ్రీకాంత్ పలు మాటలతో వేధిస్తూ కొట్టాడు. మనస్తాపానికి గురైన మంజుల బెడ్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు మెట్పల్లి డిఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి, అత్తమామల గ్రామాలు పక్కపక్కనే కావడంతో ఇరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోరుట్ల సీఐ సతీశ్‌చందర్‌రావు, కథలాపూర్ ఎస్సై అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి తల్లి గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోకిరీలకు వణుకు పుట్టాలి..
సాక్షి, కరీంనగర్ : అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ అక్రమార్కుల గుండెల్లో దడ పుట్టించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వీబీ కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులను ఆదేశించారు. కరీంనగర్ కమిషనరేట్‌లో శుక్రవారం విబి కమల్‌హాసన్ రెడ్డి టాస్క్‌ఫోర్స్ , షీ బృందాల పోలీసు విభాగాలతో సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..రేషన్ బియ్యం అక్రమ రవాణా, కల్తీ విత్తనాలు, ఆహార పదార్థాలపై దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ విభాగం పోలీసులు అంకితభావంతో పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. ఉత్తమ పనితీరును కనబరిచిన పోలీసులకు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ తరహాలో కరీంనగర్ టాస్క్‌ఫోర్స్ విభాగాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. పోకిరీలకు వణుకు పుట్టాలి.. ప్రేమ పేరిట విద్యార్థులను, మహిళలను వేధించే పోకిరీలకు వణుకు పుట్టించేలా పనిచేయాలని కమిషనర్ కమల్‌హాసన్ రెడ్డి షీ బృందాల పోలీసులను ఆదేశించారు. పోకిరీల ఆగడాలను అరికట్టేందుకు వారిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదూ చేస్తామని తెలిపారు. ముఖ్యంగా షీ బృందాలు తమ పనితీరుతో మహిళలకు భద్రత పట్ల భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో వేధిస్తున్న పోకిరీలపై ఫిర్యాదు చేసేందుకు వచ్చే విద్యార్థినులు, మహిళల పేర్లను గోప్యంగా ఉంచుతామని హామి ఇచ్చారు.ఈ సమావేశానికి అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ఎస్.శ్రీనివాస్, ఎసిసి శోభన్ కుమార్, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ దామోదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీడని పీటముడి..!
ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టి పొత్తులు.. ఎత్తులు.. సీట్ల పంపకాలపై దృష్టిపెట్టాయి. పార్టీలు చర్చల్లో నిమగ్నమై ఉంటే ఇక కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. మహా కూటమిలో సీట్ల పంపకాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పొత్తులపై ఎలాంటి నిర్ణయమూ తేల్చలేదు. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై లెక్కలింకా తేలలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ నడుస్తోంది. ఏ సీటు ఎవరికి కేటాయించబడుతుందోనని మహాకూటమి పార్టీల్లోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కూటమిలో పొత్తులు తేలితే తమకు అనుకూలించే నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీపీఎం ఒకచోట, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ రెండు చోట్ల అభ్యర్థులను గురువారం ప్రకటించింది. దీంతో టీఆర్ఎస్కు తోడు సీపీఎం, బీఎల్‌ఎఫ్‌లు కూడా ప్రచార వ్యూహం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్లపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. సర్దుబాట్ల లెక్కలు తేలక మహాకూటమిలో సీట్లపై పీఠముడి వీడటంలేదు. సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ నేతత్వంలో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల ముడి మరింత బిగిసింది. బుధవారం కూటమిలో భాగస్వామ్య పార్టీల అగ్రనాయకత్వం చర్చలు ఫలించలేదు. టీడీపీ 19, టీజేఎస్ 22, సీపీఐ 8 స్థానాలను కోరుతున్నాయి. రెండు రోజుల క్రితం వార్‌రూంలో సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం టీడీపీకి 8, టీజేఎస్, సీపీఐలకు తలా మూడు స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్తున్నారు. 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీతో కోర్‌కమిటీ సమావేశం అయిన సందర్భంగా మరోమారు పొత్తుల అంశం తెరమీదకు వచ్చినా.. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? అన్నది తేలలేదు. గురువారం నాటికి కూటమి పొత్తుల విషయమై ఏమీ తేలకపోవడంతో కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఆశిస్తున్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, రామగుండం తదితర స్థానాల్లో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా వుంటే పొత్తులలో ఎవరికెన్ని స్థానాలనేది ముఖ్యం కాదని, ఇప్పటికే నిర్వహించిన సర్వేల ఆధారంగా కాంగ్రెస్ సహా మహాకూటమిలోని ఏయే పార్టీలు.. ఏయే స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయో అక్కడక్కడా ఆయా పార్టీల అభ్యర్థులను దింపాలని నిర్ణయానికి కూడా వచ్చినట్లు చెప్తున్నారు. ఏదేమైనా నాలుగైదు రోజుల్లో కూటమి భాగస్వామ్య పార్టీల పొత్తులు, సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల జాబితాపై కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మూడు స్థానాలకు సీపీఎం, బీఎల్ఎఫ్ అభ్యర్థుల ప్రకటన.. తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లాలో చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్), సీపీఎంలు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్ఎస్ పార్టీ చొప్పదండి నియోజకవర్గాన్ని మినహాయించగా, అక్కడి నుంచే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థుల నియామకానికి శ్రీకారం చుట్టింది. బీఎల్ఎఫ్ అభ్యర్థులుగా చొప్పదండి నియోజకవర్గానికి కనకం వంశీ, కరీంనగర్ నియోజకవర్గానికి వసీమొద్దీన్ను నియమించారు. అదేవిధంగా మానకొండూర్ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా మర్రి వెంకటస్వామి పేరును ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్లో రామగుండం నుంచి సీపీఎం అభ్యర్థిని బరిలోకి దింపనుండగా, మిగిలిన మరో తొమ్మిది స్థానాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థులు పోటీ చేస్తారని బీఎల్ఎఫ్ పార్లమెంట్ ఇన్చార్జి గీట్ల ముకుందరెడ్డి చెప్పారు. కాగా.. ఇక నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులతోపాటు బీఎల్ఎఫ్ అభ్యర్థులు కూడా ప్రచారానికి కదలనున్నారు. కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలు పొత్తులపై ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. టికెట్ల కేటాయింపు ఆలస్యమైనా కొద్దీ ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. చివరి నిమిషంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే అస్త్రశస్త్రాలను కూడగడుతుండడంతో మిగతా పార్టీలు సైతం తమకు కావలసిన సీట్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. పొత్తుల వ్యవహారం పట్టు విడుపు లేకుండా సాగుతుండడంతోనే ఆలస్యం జరుగుతుందనే వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి. వేడెక్కిన కరీంనగర్ రాజకీయాలు.. ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా వెలువడనప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు జంప్‌జిలానీలు, ఇటు నుంచి అటు.. అటు నుంచి పార్టీల ఫిరాయింపులు, చేరికలు.. మరోవైపు ‘ముందస్తు’ ప్రచారాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. రాజకీయాల కంచుకోటగా పేరొందిన ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. అదేవిధంగా అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఫిరాయింపుల జోరు పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు ముందే బలప్రదర్శనకు నెలవుగా పోటాపోటీ సమావేశాల నిర్వహణకు అన్ని పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ప్రజాబలమే దన్నుగా ప్రజాకర్షణ కోసం ఏదో ఒక కార్యక్రమం కొనసాగించేందుకు ఆయా పార్టీల కొత్తదనంతో సిద్ధపడుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో నిత్యం పార్టీల్లో చేరికలు విరివిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఓ పార్టీలో కొందరు చేరితే మరో రెండు రోజుల్లోనే ఎదుటి పార్టీ నాయకులు కూడా ఇతరుల్ని తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వైరిపక్షం ఎత్తుగడల్ని చిత్తు చేస్తున్నామనే సంకేతాల్ని ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆకర్షణ మంత్రాన్ని అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎల్ఎఫ్, బీఎస్పీ తదితర పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో రాజకీయ వేడి జోరందుకుంది. -
కరువు సాయం అందేదెప్పుడో..?
ఇంకా జమకాని ‘రుణమాఫీ’ కొత్తరుణాలు అందక రైతన్న ఇబ్బందులు ఎల్కతుర్తి : రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరందక పంటలు ఎండిపోయి అన్నదాతలు అప్పులపాలయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆరునెలల క్రితం నష్టపోయిన పంటను సర్వే చేసి ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించినా నేటికి అందక పోవడంతో రైతులకు తిప్పలు తప్పడం లేదు. మండల పరిధిలో ఈ సారి వర్షాలు ఆలస్యంగా కురిసినా ఆశించిన మేర చెరువులు, కుంటల్లోకి నీరు చేరింది. దీంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఖరీఫ్ సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా మూడో విడతlరుణమాఫీ సైతం ఇప్పటి వరకు బ్యాంకులో జమ చేయకపోవడం వల్ల అధికారులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. రెండు పసళ్లుగా పంటలు పండకపోవడంతో అధిక వడ్డీకి సైతం అప్పు పుట్టడం లేదు. గత సీజన్లో పరిస్థితి.. మండలంలోని 15 గ్రామాల పరిధిలో ఎనిమిది వేల హెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణం ఉండగా గత ఖరీఫ్‌లో వరి 800 హెక్టార్లు సాగుచేయగా ఇందులో సుమారు 35 శాతానికి పైగా ఎండిపోయాయి. అలాగే మొక్కజొన్న 500 హెక్టార్లలో సాగు చేయగా దిగుబడి భారీగా తగ్గింది. పంట నష్టాన్ని అంచానా వేసే సమయానికి వరి, మొక్కజొన్న పంటలు కోత కోయడంతో వాటిని అధికారులు అంచనా వేయలేదు. కేవలం పత్తి 4,800 హెక్టార్లు సాగుచేయగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో 2,925 హెక్టార్ల పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపించినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు. మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినా ప్రభుత్వం కేవలం పంట పరిహారం కింద మండలానికి రూ.1కోటి 90లక్షలు మంజూరు చేసింది. ఏడాది గడిచినా రైతులకు పరిహారం అందకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈ ఖరీఫ్‌లో పంటసాగు చేయడానికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన డబ్బులు విడుదల చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. . పరిహారం అందించాలి –బరం రాజయ్య రైతు సూరారం కరువు మండలంగా ఎంపిక చేసినా నేటికి రూపాయి పరిహారం అందలేదు. పత్తిపంట నష్టంపై సర్వేనిర్వహించి ఏడాది గడుస్తంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పరిహారం వెంటనే అందించాలే. పెట్టుబడి భారం కొంతైనా తగ్గుద్ది. ప్రభుత్వానికి నివేదించాం –ఏవో లక్ష్మారెడ్డి, ఎల్కతుర్తి మండలంలో పత్తిపంట నష్టంపై సర్వే చేసి 2090 హెక్టార్ల పంటకు నష్టం వాటిళ్లినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపించాం. ఈ మేరకు రూ.1కోటి 90లక్షలు పరిహారం మంజూరైంది. త్వరలోనే రైతులకు అందజేయనున్నాం.