సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా, సాగునీటి లక్ష్యాల సాధనకు ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల పునర్ వ్యవస్థీకరణ జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు. సాగునీటికి సంబంధించిన అన్ని ఇంజనీరింగ్ విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తామని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమీక్షా సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు, ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి సరఫరాపై అధికారులకు సీఎం దిశా నిర్దేశం చేశారు.
ఈ సమీక్షలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సాగు నీటి ఇంజనీరింగ్ వ్యవస్థను 11 సర్కిల్స్‌గా విభజన చేస్తామని తెలిపారు. సర్కిల్ అధిపతిగా చీఫ్ ఇంజనీర్‌ను నియమిస్తామన్నారు. జూన్ నెలాఖరులోగా ఇరిగేషన్ ఇంజనీరింగ్ విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఇరిగేషన్ అధికారులు, సిబ్బందికి క్వార్టర్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 530 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తి పోసేలా అధికారులు అన్ని విధాలుగా సంసిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని చెరువులను నింపేలా కార్యచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. సాగునీటి కాలువలకు మే నెలాఖరులోగా అవసరమైన అన్ని మరమ్మత్తులు చేపట్టాలన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోనేలా బ్యారేజీల ఆపరేషన్ రూల్స్ కార్యచరణ సిద్ధం చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కరీంనగర్‌తో పాటు నిజామాబాద్ జిల్లా కేంద్రాలలో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్ల స్థానంలో కొత్త కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టాలన్నారు. కొత్త కలెక్టరేట్లను మంజూరు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమారును ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సమీక్ష సమావేశానికి ముందు సీఎం కేసీఆర్ జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో గోదావరి పుష్కరఘాట్‌కు చేరుకుని.. గోదావరి మాతకి ప్రత్యేక పూజలు చేశారు. గోదావరికి చీర, సారే సమర్పించారు. అనంతరం కాళేశ్వరము ముక్తేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం కేసీఆర్ వెంట సీఎస్ సోమేశ్ కుమార్, మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment