చనిపోయిన మంజుల.. గ్రామస్తులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న డీఎస్పీ మల్లారెడ్డి
సాక్షి, కథలాపూర్(కరీంనగర్) : కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో చీర్నం మంజుల ఉరఫ్ ఏజీబీ హనిశ్రీ(20) అనే వివాహిత ఆదివారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం...కథలాపూర్ మండలం ఊట్‌పెల్లికి చెందిన హనిశ్రీకి పెగ్గెర్ల గ్రామానికి చెందిన చీర్నం శ్రీకాంత్‌తో ఏడాది క్రితం పెళ్లి జరిగింది. శ్రీకాంత్ పెళ్లయిన తర్వాత గల్ఫ్ దేశం వెళ్లి 10 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. ఈనెల 22న ఆ దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆదివారం ఉదయం భార్యభర్తల మధ్య కుటుంబం విషయంలో గొడవ జరిగింది.
ఈక్రమంలో మంజులను భర్త శ్రీకాంత్ పలు మాటలతో వేధిస్తూ కొట్టాడు. మనస్తాపానికి గురైన మంజుల బెడ్రూంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమేరకు మెట్‌పల్లి డిఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి తల్లి, అత్తమామల గ్రామాలు పక్కపక్కనే కావడంతో ఇరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కోరుట్ల సీఐ సతీశ్‌చందర్‌రావు, కథలాపూర్ ఎస్సై అశోక్ సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి తల్లి గంగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment