
కూతురు చెప్పడంతో కూపీ లాగిన పోలీసులు
రెండేళ్ల తర్వాత వెలుగు చూసిన వాస్తవం.. నిందితుడికి ఎట్టకేలకు జైలు
వెంగళరావునగర్: ‘మా అమ్మను నాన్నే కొట్టి చంపాడు’ అని ఓ చిన్నారి కేసు పెట్టడంతో నిందితుడిని మధురానగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. మధురానగర్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ వర్మ కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లాకు చెందిన షేక్ సలీంకు కామారెడ్డి జిల్లాకు చెందిన ఫర్జానా బేగంతో 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. జీవనోపాధి కోసం 8 ఏళ్ల క్రితం నగరంలోని జవహర్‌నగర్ మసీదుగడ్డకు వలస వచ్చి అద్దె గదిలో నివసించేవారు. పెళ్లయినప్పటి నుంచీ సలీం, ఫర్జానా దంపతులు తరచూ గొడవ పడేవారు. ఈ నేపథ్యంలోనే సలీం మద్యానికి బానిసయ్యాడు.
రెండేళ్ల క్రితం సలీం మద్యం మత్తులో ఇంటికి వచ్చి భార్య బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.50 వేల కోసం గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో వంట గదిలో ఉన్న పప్పుగుత్తితో తలపై బలంగా కొట్టాడు. పెద్ద కుమార్తె జోక్యం చేసుకోగా ఆమెను కూడా కొట్టాడు. తెల్లారుజామున కుమార్తె తల్లిని నిద్ర లేపడానికి ప్రయత్నించగా ఆమె లేవలేదు. సలీం వచ్చి తన భార్యకు పల్స్ ఆడటం లేదని తెలుసుకుని ఆమె బంధువులకు తెలియజేశాడు. తల్లిని కొట్టి చంపిన విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని కుమార్తెను బెదిరించాడు. ఇద్దరు కుమార్తెలను కామారెడ్డి వెళ్లి ఫర్జానా సోదరి షెహనాజ్‌కు అప్పగించాడు.
అప్పట్లో అనుమానాస్పద మృతిగా మధురానగర్ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పెద్దమ్మ వద్దే∙ఇద్దరు పిల్లలు పెరిగారు. ఇటీవల ఫర్జానా బేగం పెద్ద కుమార్తె తన పెద్దమ్మతో గతంలో జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో ఆమెను తీసుకుని షెహనాజ్ మధురానగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. తన తండ్రి కొట్టడం వల్లే తల్లి చనిపోయినట్లు ఫర్జానాబేగం పెద్ద కుమార్తె పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని విచారించగా.. భార్యను తానే కొట్టినట్టు అంగీకరించాడు. పోలీసులు హత్యానేరం కిందట కేసు నమోదు చేసి అతనిని కోర్టుకు హాజరుపరచగా రిమాండ్‌కు
పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment