వీడని పీటముడి..! | Mahakutami Seat Distribution In United Karimnagar District | Sakshi
Sakshi News home page

Published Fri, Sep 28 2018 2:54 PM | Last Updated on Fri, Sep 28 2018 2:55 PM

Mahakutami Seat Distribution In United Karimnagar District - Sakshi

ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే ఉమ్మడి జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెట్టి పొత్తులు.. ఎత్తులు.. సీట్ల పంపకాలపై దృష్టిపెట్టాయి. పార్టీలు చర్చల్లో నిమగ్నమై ఉంటే ఇక కూటమి నేతల్లో టెన్షన్‌ నెలకొంది. మహా కూటమిలో సీట్ల పంపకాల కోసం చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు పొత్తులపై ఎలాంటి నిర్ణయమూ తేల్చలేదు. ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై లెక్కలింకా తేలలేదు. దీంతో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్, కూటమి అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్‌ నడుస్తోంది. ఏ సీటు ఎవరికి కేటాయించబడుతుందోనని మహాకూటమి పార్టీల్లోని ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కూటమిలో పొత్తులు తేలితే తమకు అనుకూలించే నియోజకవర్గాల్లో టికెట్‌ దక్కించుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సీపీఎం ఒకచోట, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ రెండు చోట్ల అభ్యర్థులను గురువారం ప్రకటించింది. దీంతో టీఆర్‌ఎస్‌కు తోడు సీపీఎం, బీఎల్‌ఎఫ్‌లు కూడా ప్రచార వ్యూహం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ సీట్లపై ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ.. సర్దుబాట్ల లెక్కలు తేలక మహాకూటమిలో సీట్లపై పీఠముడి వీడటంలేదు.
 

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: కాంగ్రెస్‌ నేతత్వంలో ఏర్పాటైన మహాకూటమిలో సీట్ల ముడి మరింత బిగిసింది. బుధవారం కూటమిలో భాగస్వామ్య పార్టీల అగ్రనాయకత్వం చర్చలు ఫలించలేదు. టీడీపీ 19, టీజేఎస్‌ 22, సీపీఐ 8 స్థానాలను కోరుతున్నాయి. రెండు రోజుల క్రితం వార్‌రూంలో సమావేశం అనంతరం కాంగ్రెస్‌ అగ్రనాయకత్వం మాత్రం టీడీపీకి 8, టీజేఎస్, సీపీఐలకు తలా మూడు స్థానాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు చెప్తున్నారు. 40 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసేందుకు ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీతో కోర్‌కమిటీ సమావేశం అయిన  సందర్భంగా మరోమారు పొత్తుల అంశం తెరమీదకు వచ్చినా.. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు? అన్నది తేలలేదు. గురువారం నాటికి కూటమి పొత్తుల విషయమై ఏమీ తేలకపోవడంతో కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు ఆశిస్తున్న స్థానాలపై ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, రామగుండం తదితర స్థానాల్లో ఆశావహుల్లో ఆందోళన మొదలైంది.  ఇదిలా వుంటే పొత్తులలో ఎవరికెన్ని స్థానాలనేది ముఖ్యం కాదని, ఇప్పటికే నిర్వహించిన సర్వేల ఆధారంగా కాంగ్రెస్‌ సహా మహాకూటమిలోని ఏయే పార్టీలు.. ఏయే స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయో అక్కడక్కడా ఆయా పార్టీల అభ్యర్థులను దింపాలని నిర్ణయానికి కూడా వచ్చినట్లు చెప్తున్నారు. ఏదేమైనా నాలుగైదు రోజుల్లో కూటమి భాగస్వామ్య పార్టీల పొత్తులు, సీట్ల కేటాయింపులు, అభ్యర్థుల జాబితాపై కొలిక్కి వచ్చే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మూడు స్థానాలకు సీపీఎం, బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థుల ప్రకటన..
తెలంగాణ రాష్ట్ర సమితి ఉమ్మడి జిల్లాలో చొప్పదండి మినహా 12 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌ (బీఎల్‌ఎఫ్‌), సీపీఎంలు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ చొప్పదండి నియోజకవర్గాన్ని మినహాయించగా, అక్కడి నుంచే బహుజన లెఫ్ట్‌ఫ్రంట్‌ అభ్యర్థుల నియామకానికి శ్రీకారం చుట్టింది. బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులుగా చొప్పదండి నియోజకవర్గానికి కనకం వంశీ, కరీంనగర్‌ నియోజకవర్గానికి వసీమొద్దీన్‌ను నియమించారు. అదేవిధంగా మానకొండూర్‌ నియోజకవర్గానికి సీపీఎం అభ్యర్థిగా మర్రి వెంకటస్వామి పేరును ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్‌లో రామగుండం నుంచి సీపీఎం అభ్యర్థిని బరిలోకి దింపనుండగా, మిగిలిన మరో తొమ్మిది స్థానాల్లో బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు పోటీ చేస్తారని బీఎల్‌ఎఫ్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జి గీట్ల ముకుందరెడ్డి చెప్పారు. కాగా.. ఇక నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతోపాటు బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థులు కూడా ప్రచారానికి కదలనున్నారు. కూటమిలో భాగస్వాములైన కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ పార్టీలు పొత్తులపై ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. టికెట్ల కేటాయింపు ఆలస్యమైనా కొద్దీ ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల్లో ఆందోళన కొనసాగుతోంది. చివరి నిమిషంలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే.. కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడిప్పుడే అస్త్రశస్త్రాలను కూడగడుతుండడంతో మిగతా పార్టీలు సైతం తమకు కావలసిన సీట్లపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. పొత్తుల వ్యవహారం పట్టు విడుపు లేకుండా సాగుతుండడంతోనే ఆలస్యం జరుగుతుందనే వాదనలు వాదనలు వినిపిస్తున్నాయి.

వేడెక్కిన కరీంనగర్‌ రాజకీయాలు..
ఎన్నికల నోటిఫికేషన్‌ ఇంకా వెలువడనప్పటికీ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఓ వైపు జంప్‌జిలానీలు, ఇటు నుంచి అటు.. అటు నుంచి పార్టీల ఫిరాయింపులు, చేరికలు.. మరోవైపు ‘ముందస్తు’ ప్రచారాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, విమర్శలు ప్రతి విమర్శలు ఊపందుకున్నాయి. రాజకీయాల కంచుకోటగా పేరొందిన ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. అదేవిధంగా అన్ని పార్టీల్లోనూ అసంతృప్తి రాగాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా ఫిరాయింపుల జోరు పెరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు ముందే బలప్రదర్శనకు నెలవుగా పోటాపోటీ సమావేశాల నిర్వహణకు అన్ని పార్టీలు మొగ్గుచూపుతున్నాయి. ప్రజాబలమే దన్నుగా ప్రజాకర్షణ కోసం ఏదో ఒక కార్యక్రమం కొనసాగించేందుకు ఆయా పార్టీల కొత్తదనంతో సిద్ధపడుతున్నాయి. కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలో నిత్యం పార్టీల్లో చేరికలు విరివిగా కొనసాగుతూనే ఉన్నాయి. ఒకరోజు ఓ పార్టీలో కొందరు చేరితే మరో రెండు రోజుల్లోనే ఎదుటి పార్టీ నాయకులు కూడా ఇతరుల్ని తమ పార్టీలో చేర్చుకునే కార్యక్రమాల్ని నిర్వహిస్తూ వైరిపక్షం ఎత్తుగడల్ని చిత్తు చేస్తున్నామనే సంకేతాల్ని ఇస్తున్నారు. అవసరాన్ని బట్టి ఆకర్షణ మంత్రాన్ని అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌ సీపీ, సీపీఐ, సీపీఎం, బీఎల్‌ఎఫ్, బీఎస్‌పీ తదితర పార్టీలు వ్యూహాలకు మరింత పదును పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 13 నియోజకవర్గాల్లో రాజకీయ వేడి జోరందుకుంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement