హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు.
బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment