జిల్లా పంచాయతీ కార్యాలయం
పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకం పక్కదారిపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీలను కేటాయించినట్లు తెలుస్తోంది. అనుకూలురైన అధికారులకు నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం, లేని వారికి ఒకటి రెండు పంచాయతీలతో సరిపెట్టడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది.
చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకాల్లో పైరవీలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు ఎక్కువ పంచాయతీలు కట్ట బెట్టాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అనుకూలంగా లేని అధికారులకు మొక్కుబడిగా ఒకటి రెండు పంచాయతీలను అప్పజెప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కేటాయింపులు పరి శీలిస్తే పైరవీలు ఏ స్థాయిలో జరిగాయో ఇట్టే అర్థమవుతోంది.
నిబంధనలు ఇలా..
జిల్లాలో సర్పంచ్‌ల స్థానంలో స్పెషలాఫీసర్ల నియామకాలకు కలెక్టర్ అధ్యక్షతన ముందుగా కమిటీలు వేయాలి. ఎవరినైతే స్పెషలాఫీసర్లుగా నియమిస్తున్నారో ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ సూచించే వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉండాలి. ఆ కమిటీలో సభ్యులు నిబంధనల ప్రకారం స్పెషలాఫీసర్లను కేటాయించాల్సి ఉంటుంది.
జరిగింది ఇలా..
కమిటీలో ఎవరున్నారో స్పెషలాఫీసర్లకు తెలియదు. అలాంటప్పుడు ఎలా నియమించారో చెప్పాల్సి ఉంది. ఏ ప్రాతిపాదికన కేటాయించారో ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితి. జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా ఈ నెల 3న స్పెషలాఫీసర్లను ఇష్టానుసారం నియమించారు. ఆ నివేదికలను కలెక్టర్‌కు ఈ ఆఫీసులో పంపి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఆపై అదే రోజు రాత్రి ఆగమేఘాలపై ఎంపీడీఓల మెయిల్‌కు స్పెషలాఫీసర్ల ఎంపిక వివరాలను పంపారు.
మాజీలకు పంగనామాలు..
సర్పంచ్‌ల పదవీ కాలం ఈనెల రెండో తేదీన ముగిసింది. ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రత్యేకాధికారుల నియామకానికి పచ్చజెండా ఊపింది. పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా తమనే నియమిస్తారనుకున్న మాజీలకు భంగపాటు తప్పలేదు. ప్రత్యేకాధికారులకు స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని పలువురు రుసరుసలాడుతున్నారు. నమ్ముకున్న పార్టీయే నట్టేట ముంచేస్తోందని ఆవేదన చెందుతున్నారు.
పైరవీల జోరు..
ఈనెల రెండో తేదీన పంచాయతీ సర్పంచ్ పాలన ముగిసింది. అదేరోజు పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. మండల కేడర్ ఉన్న అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించుకోవాలని ఆదేశించింది. ఈ నెల 2న కలెక్టర్‌కు బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మూడో తేదీ నుంచి బిజీ అయిపోయారు. ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఈ నెల మూడున శ్రీలంక ప్రధాని, నాలుగో తేదీ సీఎం చంద్రబాబు జిల్లాకు విచ్చేయడంతో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు కొందరు మండల స్థాయి నుంచే పైరవీలకు తెరలేపారు. తాము చెప్పిన అధికారికి తమ పంచాయతీలను అప్పజెప్పాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకే నియామకాలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఉత్తర్వుల జాడేలేదు..
పంచాయతీల ప్రత్యేకాధికారుల నియామకాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. పంచాయతీల కేటాయింపులు మాత్రమే స్థానికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే తామనుకున్న పంచాయతీలకు, తాము సూచించిన అధికారులు వస్తారని కొందరు టీడీపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నట్టు సమాచారం.
ఎంపీడీఓలకే ఎక్కువ పంచాయతీలు..
జిల్లాలో 65 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరికే అధిక పంచాయతీలు కేటాయించినట్లు తెలుస్తోంది. సీఎం ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో 18 గ్రామపంచాయతీలకు గాను ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓకు గుడుపల్లె, అగరం, బెగ్గిలిపల్లె, శెట్టిపల్లె, కంచిబందార్లపల్లె పంచాయతీలను కేటాయించారు. అదే మండల ఎంఈఓకు సోడిగానిపల్లె, చీకటిపల్లి రెండు పం చాయతీలను అప్పజెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువులో ఎంపీడీఓకు ఐదు పంచాయతీలు, అక్కడ పనిచేస్తున్న ఎంఈఓకు ఒక (సోంపల్లె) పంచాయతీకి బాధ్యతలిచ్చా రు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు పైరవీలు చేసి స్పెషలాఫీసర్ల నియామకాలను వారి చేతుల్లోకి తీసుకున్నారని మాజీ సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామపాలన కష్టమే..
జిల్లాలోని 1,353 పంచాయతీలకు 346 మంది స్పెషలాఫీసర్లను నియమించారు. పశువైద్యులకు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లకు గ్రామాల అభివృద్ధి ఏమి తెలుస్తుందని మాజీ సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఫ్యాన్ల కింద కూర్చునే అధికారులకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు.
గ్రామాభివృద్ధి శూన్యమే
నిత్యం పని ఒత్తిడిలో ఉండే అధికారులను స్పెషలాఫీసర్లగా నియమించారు. వారు ఏ విధంగా గ్రామ సమస్యలపై దృష్టి పెడతారో అర్థం కావడం లేదు. మా పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. స్థానిక సమస్యలు మాకు తప్ప అధికారులకేం తెలుసు? ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీలను అప్పజెప్పారు. సమస్యలు వారెలా పరిష్కరిస్తారో...?
– బాబు, చిన్నతయ్యూరు మాజీ సర్పంచ్
Comments
Please login to add a commentAdd a comment