కుమారుడితో కల్యాణి (ఫైల్)
- రెండు రోజుల క్రితం వివాహిత ఆత్మహత్య
- రెండు కుటుంబాల మధ్య రాజీతో గుట్టుగా ఖననం
- కుమారుడి పేర పొలాన్ని రాసివ్వని భర్త కుటుంబీకులు
- పోలీసులను ఆశ్రయించి మృతురాలి బంధువులు
- నేడు మృతదేహానికి పోస్టుమార్టం
గూడూరు: వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలో పెద్దల పంచాయితీ బెడిసికొట్టింది. భర్త తరపు కుటుంబీకులు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించక పోవడంతో మృతురాలి బంధువులు పోలీసులు ఆశ్రయించారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ పంచాయతీ మజరా గ్రామమైన వై.ఖానాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వై.పవన్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన ఉప్పరి మల్లికార్జున, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె కల్యాణి (20)కి వై.ఖానాపురం గ్రామానికి చెందిన ఊరిమిండి గిడ్డయ్య మనవడు వీరేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. కల్యాణి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే భార్యాభర్తలు మధ్య మనస్పర్థలతో తరచూ ఘర్షణ పడేవారు. అలాగే భర్త, అత్త, మామ, ఆడపడుచులు వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్యాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
పంచాయితీలో ఒప్పుకున్నారు.. తర్వాత కాదన్నారు..
కల్యాణి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు వై.ఖానాపురానికి వెళ్లి గొడవకు దిగారు. అయితే కొంత మంది పెద్దలు పంచాయితీ చేసి మృతురాలి కుమారుడి పేరు మీద 8 ఎకరాల పొలం రాసి ఇవ్వాలని, నష్టపరిహారంగా ఇచ్చిన కట్నకానుకలకు అదనంగా మరికొంత ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు.
అనంతరం దహన సంస్కారాలు చేశారు. అయితే ఒప్పందం మేరకు సోమవారం కుమారుడి పేరున పొలాన్ని రాసివ్వడానికి బాలుడి తండ్రి నిరాకరించడంతో మృతురాలి బంధువులు గొడవకు దిగారు. జరిగిన సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనపై ఎస్‌ఐ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా తహసీల్దార్ సమక్షంలో మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు.