
చెన్నై: కులం పేరుతో అవమానించిన వ్యవహారం విల్లుపురంలో సంచలనం కలిగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందల్ గ్రామంలో రెండు కులాలకు చెందిన నివాసప్రాంతాలున్నాయి. శుక్రవారం ఒక కులం ప్రజలు ఉంటున్న ప్రాంత ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ను మీరి ఉత్సవాలకు ఏర్పాటు చేయడంతో మరో వర్గానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరువెన్నైనల్లూరు పోలీసులు ఆలయం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమకు సమాచారం తెలిపిన యువకుడి గురించి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు.
దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ఊరి పంచాయతీలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ముగ్గురిని మరో వర్గం కాళ్లకు మొక్కింపజేసి అవమానపరిచింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి విల్లుపురం జిల్లా కలెక్టర్ అన్నాదురై, ఎస్పీ రాధాకృష్ణన్ ఒట్టందల్ గ్రామానికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఇరువర్గాలపై తిరువెన్నైనల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించిన 50 మందిపైనా కేసు నమోదైంది. ఈ సంఘటనను సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు.
చదవండి: ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్
Comments
Please login to add a commentAdd a comment