బదిలీల జాతర!
♦ నేడు పంచాయతీ కార్యదర్శులకు కౌన్సెలింగ్
♦ మూడేళ్లు పైబడిన వారికి స్థానచలనం
♦ ఏ,బీ,సీ కేటగిరీలుగా క్లస్టర్ల విభజన
♦ వీఆర్‌ఓల బదిలీలకు రంగం సిద్ధం
♦ అభ్యంతరాలను కోరుతూ నేడు నోటిఫికేషన్
పంచాయతీ కార్యదర్శుల బదిలీకి ముహూర్తం ఖరారైంది. మూడేళ్ల పైబడిన 265 మందికి స్థానచలనం కలిగించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం పంచాయతీ కార్యదర్శుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ జరగనుంది. పంచాయతీ గ్రేడ్‌కు తగ్గట్టుగా కార్యదర్శుల నియామకాలు లేకపోవడం.. కొన్ని క్లస్టర్లలో ఒకరే ఉండడం, శివార్లలో ఇద్దరు.. ముగ్గురు ఉండడంతో వీరిని హేతుబద్ధీకరించాలని పంచాయతీరాజ్ విభాగం నిర్ణయించింది.
కొన్నేళ్లుగా బదిలీలపై ఆంక్షలు ఉండడం.. పలుకుబడి ఉన్నవారు నేరుగా శివారు పంచాయతీల్లో పోస్టింగ్‌లు పొందుతుండడం.. మారుమూల ప్రాంతాల్లో ఏళ్ల తరబడి కొంతమంది కొనసాగుతుండడాన్ని పరిగణనలోకి తీసుకున్న జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పంచాయతీరాజ్ విభాగాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్యదర్శుల మార్పులు, చేర్పులకు తెరతీశారు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలోని 688 గ్రామ పంచాయతీలను అధికారులు 371 క్లస్టర్లుగా విభజించారు. దీంట్లో మూడేళ్ల పైబడినవారి జాబితాను సిద్ధం చేశారు. బదిలీల ను కూడా ఏ,బీ,సీ కేటగిరీలుగా వర్గీకరిం చారు. దీనికి అనుగుణంగా శివారు పంచాయతీల్లో పనిచేస్తున్నవారిని సెమీ అర్బన్ లేదా గ్రామీణ ప్రాంతాలకు.. అక్కడి వారు ఇక్కడకు పోస్టింగ్ పొందేలా మండలాల వారీగా కేటగిరీలను నిర్దేశించారు. దీంతో శుక్రవారం జరిగే కౌన్సెలింగ్‌లో ఈ మేరకు ఆప్షన్‌ను ఇచ్చే అవకాశం కార్యదర్శులకు కల్పించారు. కాగా, 34 మందికి పదోన్నతులు కల్పించిన జిల్లా యంత్రాంగం.. మరో 33 మందిని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీల్లో సడలింపులు ఇచ్చినట్లు తెలిసింది. వీరిలో వితంతు, వికలాంగులు, ఆఫీసు బేరర్లు, మరో కేట గిరీ వారికి మినహయింపులు ఇ చ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
దొడ్డిదారి పోస్టింగులతో..
నగరానికి సమీపంలోని జిల్లాకు చెందిన పంచాయతీల్లో పనిచేసేందుకు పోటీ విపరీతంగా ఉంది. ఈ క్రమంలో కొందరు సచివాలయ స్థాయిలో పైరవీలు నెరిపి ప్రత్యేక ఉత్తర్వులతో కీలక పంచాయతీల్లో తిష్టవేశారు. అధికారుల అండదండలతో.. అమాత్యుల ఒత్తిడితో ఒకే స్థానంలో కుర్చీకి అతుక్కుపోయారు. కుత్బుల్లాపూర్, సరూర్‌నగర్, మేడ్చల్, హయత్‌నగర్, రాజేంద్రనగర్ మండలాల్లో ఒకటో శ్రేణి పంచాయతీల్లో తక్కువ కేడర్‌కు చెందిన వారిసంఖ్య ఎక్కువగా ఉంది. వీటిల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పంచాయతీ కార్యదర్శులే అధికం. తాజాగా పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు జిల్లా యంత్రాంగం పచ్చజెండా ఊపడంతో వారిలో గుబులు మొదలైంది.
కౌన్సెలింగ్ ఇలా..
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీ కౌన్సెలింగ్ శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్‌లోని అపార్డ్‌లో జరగునుంది. ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 1,2,3 శ్రేణులకు చెందిన కార్యదర్శుల బదిలీలు నిర్వహించనుంది. మధ్యాహ్నం 2గంటల నుంచి గ్రేడ్-4 కార్యదర్శుల బదిలీలు చేపట్టనుంది. ఈ మేరకు మండల విస్తరణ అధికారులుకు సంక్షిప్త సమాచారం ద్వారా సమాచారాన్ని పంపింది. తాజాగా క్లస్టర్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించేందుకు యంత్రాంగం చొరవ చూపుతుండడంతో మెజార్టీ కార్యదర్శులకు స్థానచలనం కలగనుంది.
వీఆర్‌ఓల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్!
గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌ఓ) బదిలీలకు రంగం సిద్ధమైంది. ఒకేచోట మూడేళ్లుగా పనిచేస్తున్న 106 మందికి స్థానచలనం కలిగించాలని నిర్ణయించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి ధర్మారెడ్డి తెలిపారు. ఈ మేరకు అభ్యంతరాలను కోరుతూ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు. బదిలీల ప్రక్రియ ఈ నెలాఖరులో జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు చెప్పారు.