స్ఫూర్తి
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.
ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్‌కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్‌ని ప్రాధేయపడుతుంది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది.
ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.
ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్‌లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్‌లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్‌లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.
75 ఏళ్ల వయసులో...
అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్‌లో ఔట్‌డోర్‌కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్‌గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను.
లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.
జీవితంలో సవాళ్లు
తండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.
పంచాయత్ అంటే...
టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్‌లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్‌లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం.
Comments
Please login to add a commentAdd a comment