పంచాయతీలకు మహర్దశ
► మరిన్ని అధికారాలు.. విధుల బదిలీకి సీఎం నిర్ణయం
► కేటీఆర్‌కు అధ్యయన బాధ్యత
► 164 కార్యదర్శుల పోస్టుల భర్తీకి అవకాశాలు
► మెరుగుపడనున్న గ్రామ పాలన
సాక్షి, మంచిర్యాల : ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం.. లోపించిన పారిశుధ్యం.. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని సమస్యలు.. అరకొర సిబ్బందితో ఏటా లక్ష్యం చేరుకోని ఆస్తి పన్ను వసూళ్లు.. ఇలాంటి సమస్యలు మరెన్నో గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవరోధాలుగా మారాయి. మరోపక్క.. పల్లెల అభివృద్ధి కోసం గతేడాది ఆగస్టులో ప్రారంభించిన ‘గ్రామజ్యోతి’ పథకం అమలు ఊసే లేదు. పథకం ప్రారంభమై ఆరు నెలలు పూర్తయినా ఇంకా చాలా చోట్ల గ్రామసభలు కూడా పూర్తి కాలేదు. ఇలా.. పడకేసిన పంచాయతీలకు మహర్దశ తీసుకొచ్చే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. పంచాయతీల బలోపేతం.. బాధ్యతను మరింత పెంచే విధంగా గ్రామ పంచాయతీలకు మరిన్ని అధికారాలు బదలాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పల్లె పాలన అభివృద్ధిని పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి కల్వకుంట తారక రామారావు ఆధ్వర్యంలో అధికారులతో కూడిన ఓ కమిటీకి అధ్యయన బాధ్యతలు అప్పగించారు. అవసరమైతే.. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకొచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. సీఎం తీసుకున్న ఈ నిర్ణయంతో.. అభివృద్ధిలో వెనకబడిన.. అత్యధిక మారుమూల గ్రామాలు.. సమస్యల్లో చిక్కుకున్న పల్లెలకు మహర్దశ రానుంది.
జిల్లాలో 866 గ్రామ పంచాయతీలు
జిల్లాలో 866 గ్రామ పంచాయతీలున్నాయి. రెండు, మూడు పంచాయతీలను కలిపి 580 క్లస్టర్లుగా చేశారు. 70శాతం జనాభా గ్రామాలో ్లనే ఉంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు విడుదల చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపం.. నిధుల వినియోగంలో అక్రమాల కారణంగా అభివృద్ధి కుంటుపడింది. కనీసం గ్రామాల్లో పారిశుధ్యం.. రక్షిత తాగునీరు సైతం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలకు అధికారాలు.. విధులు.. బాధ్యతలు అప్పగించాలనే నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు.. పారిశుధ్య నిర్వహణ, పన్నుల వసూళ్లు, నిధుల వినియోగం(సర్పంచులతో జాయింట్ చెక్‌పవర్).. పలు ధ్రువీకరణ పత్రాల జారీ వంటి చిన్న చిన్న పనులకే పరిమితమైన పంచాయతీ కార్యదర్శులకు ఇకపై క్షేత్రస్థాయిలో అమలయ్యే ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకంలో భాగస్వాములను చేసి.. వారికి బాధ్యతలు అప్పగించాలని సీఎం నిర్ణయించారు.
దీంతో పనుల పురోగతికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 580 క్లస్టర్లలో కేవలం 416 మంది కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. సీఎం నిర్ణయంతో జిల్లాలో ఏళ్ల నుంచి ఖాళీగా ఉన్న 164 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ అయ్యే అవకాశాలున్నాయి. పంచాయతీల నుంచి ఏటా రూ. 17లక్షల ఆస్తిపన్ను వసూలు కావాలి. కానీ కార్యదర్శులు లేకపోవడంతో 65 శాతానికి మించి వసూళ్లు జరగడం లేదు. కార్యదర్శుల పోస్టులు భర్తీ అయితే పన్నుల వసూళ్లతోపాటు గ్రామాల్లో పారిశుధ్య, అభివృద్ధి పనుల పర్యవేక్షణకు వీలుంటుంది. మరోపక్క.. గ్రామజ్యోతి పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 654 డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు వాటిలో ఏడు మాత్రమే ఏర్పాటయ్యాయి.
276 చోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం విషయంలోనూ జిల్లా వెనకబడే ఉంది. జిల్లాకు 42,268 మరుగుదొడ్లు మంజూరైతే.. ఇప్పటివరకు 2,620 మాత్రమే పూర్తయ్యాయి. 8,346 నిర్మాణ దశలో ఉన్నాయి. పెద్ద ఇంకుడు గుంతల విషయానికొస్తే.. 5396 మంజూరైతే.. 1201 నిర్మాణ దశలో ఉన్నాయి. 179 మాత్రమే పూర్తయ్యాయి. చిన్న ఇంకుడు గుంతలు 40,255 మంజూరైతే.. 3,619 నిర్మాణ దశలో ఉన్నాయి. 800 మాత్రమే పూర్తయ్యాయి. సుమారు 14వేల పైచిలుకు శ్మశాన వాటికల నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా... ఇప్పటి వరకు రెండు వేలకు మించి శ్మశాన వాటికల నిర్మాణాలు జరగలేదు. పల్లెల్లో పనుల వేగ వంతం.. పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 580 క్లస్టర్లలో ఈ-పంచాయతీలు చేసింది.
ఇప్పటి వరకు 30కి మించి ఈ-పంచాయతీలు జిల్లాలో కానరాని పరిస్థితి. విద్యుత్, ఆన్ లైన్ సమస్యతోపాటు పర్యవేక్షణ లేకే ఈ పంచాయతీల లక్ష్యం అమలుకు ఆమడ దూరంలో ఉంది. స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరించేందుకు జిల్లాకు మూడు వేలకు పైగా సైకిల్ రిక్షాలు వచ్చే వీలుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి పథకంతోపాటు సీఎం కేసీఆర్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో గ్రామాల దశ మారుతుందని జిల్లా పంచాయతీ అధికారి పోచయ్య అభిప్రాయపడ్డారు.