
సీమాంధ్రులతో పంచాయితీ లేదు
‘హైదరాబాద్‌లోని సీమాంధ్రులతో మాకు ఎలాంటి పంచాయితీ లేదు. వాళ్లు బావుండాలి, మనమూ బావుండాలి’ అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.
* రెండు రాష్ట్రాలు ఏర్పడకుంటే ఏపీ అభివృద్ధి చెందేదా: మంత్రి కేటీఆర్
* అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలుపుతాం
* కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్ గూటికి కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్‌లోని సీమాంధ్రులతో మాకు ఎలాంటి పంచాయితీ లేదు. వాళ్లు బావుండాలి, మనమూ బావుండాలి’ అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఏపీ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే వెళ్లి శుభాకాంక్షలు తెలిపి వస్తామని చెప్పారు.
తెలంగాణ ఏర్పడగానే హైదరాబాద్‌లో అల్లకల్లోలం జరుగుతుందని, పారిశ్రామికవేత్తలు పారిపోతారని, తెలంగాణ వారికి పరిపాలన చేతకాదని, సీమాంధ్రుల్ని తరుముతారని విష ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి నర్సింహ యాదవ్ తన అనుచరులతో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. రెండు రాష్ట్రాలుగా కాకుండా ఉమ్మడి ఏపీగానే ఉంటే అమరావతిలో కొత్త రాజధాని నిర్మించాలనే ఆలోచన వచ్చేదా, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి వంటివి అభివృద్ధి చెందేవా, ఏపీకి లాభం జరిగేదా అని ఆయన ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాలు విడిపోవడం వల్లే అభివృద్ధిలో పోటీ పడుతున్నామని పేర్కొన్నారు. 425 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ అన్ని వర్గాల వారినీ, అన్ని మతాల, ప్రాంతాల వారిని అక్కున చేర్చుకుందన్నారు. ఎవరెంత రెచ్చగొట్టినా, సఖ్యత దెబ్బకొట్టాలని ప్రయత్నించినా గట్టిగా నిలబడ్డామని, శాంతిభద్రతలను పరిరక్షించామని చెప్పారు. కూకట్‌పల్లి ప్రాంతంలో ఉంటున్న సీమాంధ్రులు ఆలోచించాలని కోరారు. నగరంలో రోడ్ల పరిస్థితిపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, గతంలో వీరు పాలించనట్టు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
నగరంలో 18 చోట్ల రూ.2,651 కోట్లతో స్కైవేలు, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేస్తున్నామని, మౌలిక వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. మూడు నె లల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ రోడ్లను తయారు చేస్తామన్నారు. శివారు మున్సిపాలిటీల సమస్యలనూ పరిష్కరిస్తామని, 30 లక్షల మందికి తాగునీరు అందిస్తామన్నారు. దీనికోసం రూ. 1,700 కోట్లు హడ్కో రుణం మంజూరైందని, రూ.200 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోందని మొత్తం గా రూ.1,900 కోట్లతో సమస్యలు తీరుస్తామని చెప్పారు.
మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి సంక్షేమ రంగాల్లో తెలంగాణ ముందంజలో ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం సాధిస్తుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని దుయ్యబట్టారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరపు కృష్ణారావు మాట్లాడుతూ.. హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. అనంతరం నర్సింహయాదవ్, ఆయన అనుచరులకు కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు.