సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును సీఎంను చేయడం ఎలా? అన్నదే షర్మిల లక్ష్యంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సంక్షేమ పథకాలు, సుపరిపాలనతో ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక అన్ని అ్రస్తాలు ప్రయోగించిన చంద్రబాబు చివరి ప్రయత్నంగా షర్మిలను తీసుకొచ్చారని చెప్పారు. చంద్రబాబుకు ప్రయోజనం చేకూర్చడం కోసమే షర్మిల పీసీసీ చీఫ్‌గా రాష్ట్రానికి వచ్చారన్నది ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ఇదంతా చంద్రబాబు ఎత్తుగడేనని చెప్పారు.
గతంలో షర్మిలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఎల్లో మీడియా ఇప్పుడు ఆమెను భుజానికెత్తుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. నిన్నటిదాకా తెలంగాణలోనే తన బతుకు, చావు అంటూ వైఎస్సార్ టీపీని నడిపిన షర్మిల ఇప్పుడు హఠాత్తుగా పీసీసీ చీఫ్‌గా రాష్ట్రానికి ఎందుకొచ్చారో చెప్పాలన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్‌పై ఉమ్మేసేవారంటూ నిన్నటిదాకా తూర్పారబట్టిన షర్మిల ఇప్పుడు రాష్ట్రంలో ఆ పార్టీకి నేతృత్వం వహించడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీశారు.
అడ్డగోలుగా విభజించి ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకుందన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో నోటాకు 1.28 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 1.17 శాతం ఓట్లు వచ్చాయని సజ్జల గుర్తు చేశారు. టీడీపీ వెంటిలేటర్‌పై ఉండగా కనుమరుగైన కాంగ్రెస్‌కు నాయకులే లేరన్నారు. అలాంటి కాంగ్రెస్‌ను బతికించడమంటే శవానికి జీవం పోయటమేనని ఎద్దేవా చేశారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే...
భాష, యాస బాధాకరం..
పీసీసీ చీఫ్‌గా ప్రమాణ స్వీకారం సందర్భంగా షర్మిల మాట్లాడిన భాష, యాస దివంగత వైఎస్సార్ కుటుంబ సన్నిహితులకు, అభిమానులకు, ఆయన ఆశయాల సాధనకు పేటెంట్ కలిగిన వైఎస్సార్‌సీపీ నాయకులకు బాధ కలిగించింది. సీఎం జగన్ మహానేత వైఎస్ తనయుడిగానే కాకుండా రాజకీయ వారసుడిగా, వైఎస్సార్ ఆశయాల సాధనకు ప్రజలతో మమేకమవుతూ నిబద్ధతతో పని చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. షర్మిల వ్యవహార శైలి చూస్తే ఒక రకంగా జాలి కలుగుతోంది. కేవీపీ, రఘువీరారెడ్డి మినహా కాంగ్రెస్‌లో షర్మిలకు పరియం ఉన్న వారెవరూ లేరు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ వేధించడం షర్మిలకు తెలుసు.
ప్రసంగాన్ని తయారు చేసి పంపించారు..
రాష్ట్రంలో ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీకి హఠాత్తుగా అధ్యక్షురాలిగా వచ్చి చంద్రబాబు డైలాగులనే షర్మిల చెబుతుంటే జాలి కలగక మరేం అనిపిస్తుంది? జగన్‌కు మద్దతుగా గతంలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న షర్మిల ఇప్పుడు ఆయన నియంత అంటూ విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తన పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో 56 నెలలుగా కొనసాగుతున్న సీఎం జగన్ సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు.
తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా ఆమె డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి ఎందుకు వచ్చారు? రాహుల్ గాం«దీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యమైతే ఇక్కడకు వచ్చి ఆమె చేయగలిగింది ఏముంది? ఆమె లక్ష్యం.. రాహుల్ గాందీని ప్రధానిని చేయడం కాదు.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం ఎలా అన్నదే. వైఎస్ అభిమానుల ఓట్లు చీల్చడానికి షర్మిల తోడ్పడతారన్నదే చంద్రబాబు చివరి ఎత్తుగడ. క్రిస్టియన్ మైనార్టీలు, దళితుల ఓట్లు చీల్చడమే లక్ష్యంగా ప్రసంగాన్ని తయారు చేసి షర్మిలకు ఇచ్చి పంపారు.
ఆ అవసరం, అవకాశం కూడా లేదు..
రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ.. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. హస్తం గుర్తు కాంగ్రెస్ ఎప్పుడో పోయింది. వైఎస్సార్ వారసుడిగా సీఎం జగన్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్రంలో మైనార్టీలు, క్రైస్తవులు, ఎస్సీలతోపాటు అందరికీ రక్షణ కల్పించే శక్తి, నిబద్ధత తనకుందని పన్నెండేళ్లుగా సీఎం జగన్ రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఇక వేరే ప్రత్యామ్నాయం రాష్ట్రంలో అవసరం లేదు. ఆ అవకాశం కూడా లేదు. మతం ఏదైనా వ్యక్తిగతంగానే ఉండాలి కానీ రాజకీయంగా, పరిపాలనలో దాని ప్రభావం ఉండకూడదని బలంగా విశ్వసించే వ్యక్తి సీఎం జగన్.
ఏ దేవుడ్ని ఎవరు కొలిచినా అన్నిటి భావం ఒకటే అని నమ్మిన వ్యక్తిగా వాటికి అతీతంగా ఉన్నారు. ఎవరికి అన్యాయం జరిగినా వారిని రక్షించి అక్కున చేర్చుకుంటున్నారు. మత ప్రాతిపదికన ఎవరికి అన్యాయం జరిగినా ఆయన సహించరు. ఐదు కోట్ల మంది ప్రజలు దీన్ని విశ్వసిస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత విశ్వాసాలు కాకుండా రాష్ట్రం అవసరాలు, ప్రజల ఆకాంక్షలే మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని సీఎం జగన్ బలంగా నమ్ముతారు. కేంద్రంలో ఎవరున్నా వారితో సమన్వయం చేసుకుంటూ వీలైనంత వరకూ రాష్ట్రానికి మేలు చేయాలని భావిస్తారు. సీఎం జగన్ చెల్లెలుగా, మహానేత వైఎస్ కుమార్తెగా తనను ఆదరించే వారి అభిమానాన్ని సైతం పోగొట్టుకునే దిశగా షర్మిల అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
హోదాపై కాంగ్రెస్ తరఫున వివరణ ఇవ్వాలి..
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో కుమ్మక్కై అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించి తీరని అన్యాయం చేసింది. రాష్ట్ర హక్కులను రక్షించకుండా, ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చకుండా ద్రోహం చేసింది కాంగ్రెస్సే. ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడింత పోరాడాల్సిన అవసరమే ఉండదు కదా? రాజధానికి ఆర్థిక వనరులు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ఇస్తామని ఆ రోజు చట్టంలో చేర్చి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా? తాను చేసిన తప్పులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్న షర్మిల వాటిపై సీఎం జగన్‌ను ప్రశ్నించడం విచిత్రం.
కాంగ్రెస్ తరఫున ప్రత్యేక హోదా, రాజధానికి నిధులపై షర్మిల వివరణ ఇవ్వాలి. ప్రత్యేక హోదాపై సీఎం జగన్ ఒకే మాటకు కట్టుబడ్డారు. పోరాటం ఏ పద్ధతుల్లో చేయాలో అలా కొనసాగించడంతోపాటు కేంద్రంపై ఒత్తిడి పెంచి మనపై ఆధారపడే పరిస్థితి వచ్చే వరకూ ఆ అంశాన్ని సజీవంగా ఉంచుతున్నాం. ఎప్పటికప్పుడు హోదా అంశాన్ని ప్రస్తావిస్తూ సరైనా అవకాశం రాగానే సాధించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రధాని సమక్షంలోనే విశాఖ సభలో సీఎం జగన్ హోదా అంశాన్ని గుర్తు చేశారు. ఆదిలోనే ఇదే అంశాన్ని ఢిల్లీలో విలేకరుల సమావేశంలోనూ సీఎం జగన్ స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ద్రోహం..
ఏకపక్ష విభజనతో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్ మహానేత వైఎస్ కుటుంబానికి తీరని ద్రోహం చేసింది. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి వైఎస్ చేసిన కృషే ప్రధాన కారణమని నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పలు సందర్భాల్లో చెప్పారు. వైఎస్ మరణానంతరం అక్రమ కేసులు బనాయించి ఆయన పేరును నేరుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టిన పార్టీ కాంగ్రెస్.
వైఎస్సార్ తనయుడు జగన్‌ను అక్రమంగా 16 నెలలు జైల్లో నిర్భందించిన పార్టీ కాంగ్రెస్. శంకర్రావు, ఎర్రన్నాయుడు, అశోక్ గజపతిరాజు కలిసి ఆ కేసులు వేశారు. సోనియాగాంధీ చెబితేనే కేసులు పెట్టామని శంకర్రావు పలు మార్లు మీడియాకు చెప్పారు. సోనియా చెప్పినట్టుగా జగన్ విని ఉంటే కేసులు పెట్టేవాళ్లం కాదని అప్పట్లో కాంగ్రెస్‌లో కీలక భూమిక పోషించిన కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ కూడా చెప్పారు. అంటే అవన్నీ అక్రమ కేసులేనని తెలిసిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment