
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పునర్విభజన ప్రకారం జిల్లాల వారీగా గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను పేర్కొంటూ తాజా సమాచారాన్ని శనివారం వెల్లడించింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాల్లో అతి తక్కువగా 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండేవి.
పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు సైతం గ్రామ పంచాయతీలుగా మారాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 26 గ్రామ పంచాయతీలలో 300 కంటే తక్కువ జనాభా ఉంది. ఈ గ్రామాల్లో 210 నుంచి 230 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలలో ఐదుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉంటారు. వీరిలోనే ఒకరు ఉపసర్పంచ్‌గా ఎన్నికవుతారు.
Comments
Please login to add a commentAdd a comment