- రైతుల వివరాలు కంప్యూటరీకరణ
- ఆధార్ తరహాలో వారికి గుర్తింపు సంఖ్య
- పారదర్శకతతో అనర్హులకు నో చాన్స్
- రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాల కోసం స్మార్‌ట కార్డు వినియోగం తప్పనిసరి
సాక్షి, బెంగళూరు : అర్హులైన రైతులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడానికి వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోనుంది. ఇందుకోసం మే మొదటి వారంలో ‘కే-కిసాన్’ (కర్ణాటక కృషి సమాచార సేవలు, నెట్‌వర్కింగ్) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదట రాష్ట్రంలోని ప్రతి తాలూకా కేంద్రంలో ఉన్న వ్యవసాయ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తారు.
అనంతరం ఆయా కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఇందులో రైతు ఫోన్ నంబర్, రైతుకు చెందిన భూ విస్తీర్ణం తదితర వివరాలతో పాటు నేల రకాన్ని కూడా పొందుపరుస్తారు. అనంతరం రైతు గత ఐదేళ్లుగా పండిస్తున్న పంట రకాలను కూడా నమోదు చేస్తారు. రెండోదశలో రాష్ట్రంలోని 747 హోబళీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతుల వివరాలను రైతు సంపర్క కేంద్రాల్లో నమోదు చేసుకుని తాలూకా వ్యవసాయ కార్యాలయం, ఆయా జిల్లా వ్యవసాయ క్యార్యాలయాలకు అనుసంధానం చేస్తారు.
అటుపై రాష్ట్రంలోని ప్రతి రైతు, కౌలురైతు వ్యక్తిగత, పంట వివరాలన్నీంటినీ బెంగళూరులోని కేంద్ర కార్యాలయంలోని కంప్యూటర్ డాటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. దీని వల్ల రాష్ట్రంలోని ఉన్న రైతుల, కౌలు రైతుల సంఖ్య, వ్యవసాయ భూమి విస్తీర్ణంపై ఖచ్చితమైన సమాచారం లభ్యమవుతుంది. వివరాలన్నింటినీ క్రోడికరించిన తర్వాత ప్రతి రైతు, కౌలు రైతుకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఒకరికి కేటాయించిన సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి కేటాయించరు. అటుపై ఈ సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డ్‌ను రైతులకు అందజేస్తారు.
పారదర్శకత పెరిగే అవకాశం...
ప్రస్తుత విధానంలో వ్యవసాయ రుణం మంజూరు చేయడంతో పాటు రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాల వితరణలు చాలా వరకూ అర్హులకు దక్కడం లేదు. రైతులకు స్మార్ట్ కార్డులు అందించిన తర్వాత రుణాలు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇచ్చే సమయంలో తప్పక ఆ కార్డును వినియోగించాల్సి ఉంటుంది.
కార్డుపై ప్రత్యేక సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్ ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి ఒకరికి అందాల్సిన సంక్షేమ ఫలితాలు మరొకరు పొందడానికి వీలు పడదు. ఏ పంటకు రాష్ట్రంలోని ఏ మార్కెట్‌లో ఉత్తమ ధర దొరుకుతోందనే విషయాన్ని రైతులకు ఎస్.ఎం.ఎస్ రూపంలో కూడా పంపించడానికి వీలవుతుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటికే ఇటువంటి ప్రక్రియ అమలు దశలో ఉంది. కే-కిసాన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. మే మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు.