విశాఖ మధురవాడ మిలీనియం టవర్‌లో సిద్ధమైన ప్రీమియం సర్వీస్ సెంటర్ లోపలి భాగం
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ. ఇటువంటి కష్టాలు, అవినీతి లేకుండా ప్రజలకు సులభంగా, అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం సీఎం జగన్ నేతృత్వంలో ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లకు అధికారులు రూపకల్పన చేశారు.
అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ సేవలు అందుతాయి. తొలి దశలో 9 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, శ్రీకాకుళంలో రెండు సెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుపై ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. విశాఖ మధురవాడ సెజ్‌లోని టవర్–బిలో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ ఇప్పటికే అన్ని హంగులతో సిద్ధమైంది. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు.
ఆ తర్వాత శ్రీకాకుళంలో రెండోది ఏర్పాటు చేస్తారు. అనంతరం విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో ఏర్పాటు చేస్తారు. సోమవారం దీనిపై ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమవనున్నారు. ఆయన అంగీకరించిన వెంటనే విశాఖలో పైలట్ ప్రాజెక్టు మొదలు పెడతారు. ఈ సెంటర్ల పనితీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందననుబట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్.. సింగిల్ విండో రిజిస్ట్రేషన్లు
ఈ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ (ముందు భాగం)లో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా, ఆ తర్వాత అన్నీ ఆన్‌లైన్ సేవలే ఉండేలా వీటిని డిజైన్ చేశారు. వినియోగదారులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్ విండో కింద రిక్వెస్ట్ పెడితే ఆన్‌లైన్‌లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినియోగదారులే తమ సమాచారాన్ని నమోదు (డేటా ఎంట్రీ) చేసుకోవచ్చు. అది ఆన్‌లైన్‌లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళుతుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ప్రోపర్టీ వెరిఫికేషన్‌ను సంబంధిత ప్రభుత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా పరిశీలిస్తారు.
అది సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదు. రిజిష్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టాంప్ డ్యూటీ కలెక్షన్లను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
ఇందుకోసం ఆ సంస్థ అక్కడ ఒక బ్రాంచిని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా అక్కడికక్కడే ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని వినియోగించనున్నారు. అవసరాన్నిబట్టి ఫ్రంట్ ఎండ్ సేవలను అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సెంటర్లలో వినియోగదారుల కోసం విశ్రాంతి గది, కెఫెటేరియా వంటి సదుపాయాలుంటాయి.
అవినీతి రహితంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు
అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు.
– డాక్టర్ రజత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
Comments
Please login to add a commentAdd a comment