సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజలను కోరారు. ఈ విధానం అత్యంత సురక్షితమైంది.. పారదర్శకమైందని చెప్పారు. భౌతికంగా దస్తావేజులు ఉండవనే విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దస్తావేజులు భౌతికంగా కావాలనుకునే వారు ఇప్పుడు కూడా పొందే అవకాశం ఉందని ఆయనస్పష్టంచేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయని, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు భౌతికంగా దస్తావేజులు పొందే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి టైమ్‌స్లాట్ బుక్ చేసుకున్న వారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమకు భౌతికంగా డాక్యుమెంట్లు కావాలంటే అక్కడే వారి సంతకాలు తీసుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించామన్నారు.
ఈ కొత్త విధానం గతం కంటే ఎంతో మెరుగైందని, సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డ్ 1.0 విధానం 1999లో రూపొందించారని.. అప్పట్లో ఏడాదికి రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ, భద్రత, ప్రజల సౌలభ్యం వంటి అన్ని అంశాలతో కార్డ్ 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు.
ఆటో సబ్ డివిజన్.. ఆటో మ్యుటేషన్..
కొత్త విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా అమ్మేవాళ్లు, కొనేవాళ్లు తమ వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిస్తే ఒక మోడల్ డాక్యుమెంట్ (దస్తావేజు) జనరేట్ అవుతుందన్నారు. అందులో ఇంకా అదనంగా ఏమైనా వివరాలు చేర్చాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్వే నెంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరు ఉందో చూపిస్తుందని తెలిపారు.
గతంలో నాలుగు రకాల చలానాలు కట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఆ సర్వే నెంబర్‌కు సంబంధించి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చూపిస్తుందని.. దాన్ని వెంటనే ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని సాయిప్రసాద్ చెప్పారు. వ్యవసాయ భూములైతే ఈ దశలోనే సబ్ డివిజన్ అవసరమైతే ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నారు.
రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యుటేషన్ కూడా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని, గతంలో మాదిరిగా మళ్లీ రెవెన్యూ శాఖ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో అయితే అమ్మేవాళ్లు ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలని, అప్పుడే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారని చెప్పారు.
ఐటీ చట్టం మార్పుతో ఇ–సైన్‌లు చెల్లుబాటవుతున్నాయి
ఇక గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సైతం ఇ–సైన్‌లు చెల్లుబాటయ్యేలా ఐటీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని సాయంప్రసాద్ గుర్తుచేశారు. ఆస్తి అమ్మేవాళ్ల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇ–సైన్ తీసుకుంటారని, సబ్ రిజిస్ట్రార్ కూడా అదే విధంగా ఇ–సైన్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను వినియోగదారులకు ఇస్తారని, అది ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా భౌతికంగా తమకు డాక్యుమెంట్ కావాలంటే వాళ్లతో సంతకాలు చేయించుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్ ఇస్తారని తెలిపారు.
ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేదన్నారు. ఆన్‌లైన్ డాక్యుమెంట్‌వల్ల కూడా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని, ఐటీ రిటర్నులన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయన్నారు. అలాగే, అనేక ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్‌లోనే జెనరేట్ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా అంతేనన్నారు. ఆన్‌లైన్ దస్తావేజులు పొందిన వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని సాయంప్రసాద్ స్పష్టంచేశారు.
ఆన్‌లైన్ ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లూ చెయ్యొచ్చు..
ఇక గతంలో దస్తావేజులు పోతే కేసులు పెట్టి అనేక అవస్థలుపడాల్సి వచ్చేదని, కొత్త విధానంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఎప్పుడైనా ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్‌ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, భౌతికంగా దస్తావేజులు కావాలనే ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లు కూడా చేయవచ్చని, వారి స్కిల్‌ను అక్కడ కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఆటోమ్యుటేషన్ విధానం నెలరోజుల్లో మున్సిపాల్టీల్లోనూ అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment