New Registration Act
-
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై.. అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజలను కోరారు. ఈ విధానం అత్యంత సురక్షితమైంది.. పారదర్శకమైందని చెప్పారు. భౌతికంగా దస్తావేజులు ఉండవనే విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దస్తావేజులు భౌతికంగా కావాలనుకునే వారు ఇప్పుడు కూడా పొందే అవకాశం ఉందని ఆయనస్పష్టంచేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు భౌతికంగా దస్తావేజులు పొందే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి టైమ్‌స్లాట్ బుక్ చేసుకున్న వారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమకు భౌతికంగా డాక్యుమెంట్లు కావాలంటే అక్కడే వారి సంతకాలు తీసుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించామన్నారు. ఈ కొత్త విధానం గతం కంటే ఎంతో మెరుగైందని, సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డ్ 1.0 విధానం 1999లో రూపొందించారని.. అప్పట్లో ఏడాదికి రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ, భద్రత, ప్రజల సౌలభ్యం వంటి అన్ని అంశాలతో కార్డ్ 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఆటో సబ్ డివిజన్.. ఆటో మ్యుటేషన్.. కొత్త విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా అమ్మేవాళ్లు, కొనేవాళ్లు తమ వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే ఒక మోడల్ డాక్యుమెంట్ (దస్తావేజు) జనరేట్ అవుతుందన్నారు. అందులో ఇంకా అదనంగా ఏమైనా వివరాలు చేర్చాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్వే నెంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరు ఉందో చూపిస్తుందని తెలిపారు. గతంలో నాలుగు రకాల చలానాలు కట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆన్లైన్లో ఆ సర్వే నెంబర్‌కు సంబంధించి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చూపిస్తుందని.. దాన్ని వెంటనే ఆన్లైన్లోనే చెల్లించవచ్చని సాయిప్రసాద్ చెప్పారు. వ్యవసాయ భూములైతే ఈ దశలోనే సబ్ డివిజన్ అవసరమైతే ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యుటేషన్ కూడా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని, గతంలో మాదిరిగా మళ్లీ రెవెన్యూ శాఖ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో అయితే అమ్మేవాళ్లు ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలని, అప్పుడే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారని చెప్పారు. ఐటీ చట్టం మార్పుతో ఇ–సైన్లు చెల్లుబాటవుతున్నాయి ఇక గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సైతం ఇ–సైన్లు చెల్లుబాటయ్యేలా ఐటీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని సాయంప్రసాద్ గుర్తుచేశారు. ఆస్తి అమ్మేవాళ్ల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇ–సైన్ తీసుకుంటారని, సబ్ రిజిస్ట్రార్ కూడా అదే విధంగా ఇ–సైన్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను వినియోగదారులకు ఇస్తారని, అది ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా భౌతికంగా తమకు డాక్యుమెంట్ కావాలంటే వాళ్లతో సంతకాలు చేయించుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్ ఇస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేదన్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్వల్ల కూడా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని, ఐటీ రిటర్నులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్నారు. అలాగే, అనేక ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే జెనరేట్ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా అంతేనన్నారు. ఆన్లైన్ దస్తావేజులు పొందిన వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని సాయంప్రసాద్ స్పష్టంచేశారు. ఆన్లైన్ ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లూ చెయ్యొచ్చు.. ఇక గతంలో దస్తావేజులు పోతే కేసులు పెట్టి అనేక అవస్థలుపడాల్సి వచ్చేదని, కొత్త విధానంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఎప్పుడైనా ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్‌ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, భౌతికంగా దస్తావేజులు కావాలనే ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లు కూడా చేయవచ్చని, వారి స్కిల్‌ను అక్కడ కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఆటోమ్యుటేషన్ విధానం నెలరోజుల్లో మున్సిపాల్టీల్లోనూ అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో కొత్త రిజిస్ట్రేషన్ విధానం..
అమరావతి: ఏపీలో సెప్టెంబర్ 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసికొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కొత్త సాఫ్ట్వేర్(కార్డ్ ప్రైమ్) వాలాను ఎక్కడా అభ్యంతరాలు తలెత్తలేదన్నారు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 23 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మాత్రమే ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నామని నెలరోజుల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాతే కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని అయన తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానంపై అవగాహన లేనివారే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయచేసి ఆ అపోహలను నమ్మవద్దని కోరారు. కొత్త విధానంలో ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వరని ఎవ్వరూ చెప్పలేదని దానిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పాత,కొత్త రెండు విధానాల్లోనూ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగిస్తామని ఈ సిస్టమ్ మీద అవగాహన లేనివారే దీనిని జిరాక్స్ కాపీలంటూ ప్రచారం చేస్తున్నారని వివరించారు. అలాంటివారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మూడు రోజులుగా సాగుతోన్న రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మొత్తం 700 రిజిస్ట్రేషన్లు చేస్తే అన్నిటినీ ఫిజికల్ డాక్యుమెంట్లతోనే చేశామని.. కొత్త రిజిస్ట్రేషన్ విధానాన్ని ఆప్షనల్‌గా మాత్రమే అమలు చేస్తున్నామని తెలిపారు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ ఇది కూడా చదవండి: ‘చంద్రబాబు కొడుకు, బ్రహ్మణి భర్త తప్ప లోకేశ్ అర్హత ఏంటి’ -
వేరే రాష్ట్రాల్లో మళ్లీ రిజిస్ట్రేషన్ అక్కర్లేదు !
సాక్షి, న్యూఢిల్లీ: తమ కొత్త వ్యక్తిగత వాహనాలను ప్రభుత్వ/ప్రైవేటు ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లినపుడు ఆ రాష్ట్రాల్లోనూ మళ్లీ రిజిస్ట్రేషన్ చేయాల్సిన పనిలేకుండా ‘భారత్ సిరీస్ (బీహెచ్–సిరీస్)’ పేరిట కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త సిరీస్ సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి తేనుంది. ఈ వివరాలతో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయరహదారుల శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం కొత్త వాహనాలకు భారత్ సిరీస్ (బీహెచ్ –సిరీస్) వినియోగించనున్నారు. వాహన యజమాని మరొక రాష్ట్రానికి బదిలీ అయినప్పటికీ ఈ రిజిస్ట్రేషన్ ముద్ర ఉన్న వాహనాన్ని రీ–రిజిస్ట్రేషన్ చేయించుకోనవసరం ఉండదని రవాణా శాఖ తెలిపింది. కేంద్ర భద్రతా బలగాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, నాలుగుకంటే ఎక్కువ రాష్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు వేరే రాష్ట్రాలకు బదిలీ అయినపుడు ఈ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని వాడుకోవచ్చని పేర్కొంది. బీహెచ్–సిరీస్ రిజిస్ట్రేషన్ మార్క్ ఉన్న వాటి వాహనాల పన్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో చెల్లించాలి. మోటారు వాహనం పన్నును రెండేళ్లు, అంత కుపైన విధించనున్నారు. 14 ఏళ్లు పూర్తవగానే ఆ వాహనంపై ఏటా విధించే పన్ను అంతకు ముందు విధించిన మొత్తంలో సగానికి తగ్గించనున్నారు. అదేవిధంగా, కొత్త సిరీస్ ఉన్న నాన్–ట్రాన్స్పోర్ట్ వాహనాల ధర రూ. 10 లక్షల లోపు ఉంటే 8% వాహన పన్ను, రూ. 10–20 లక్షల మధ్య ఉంటే 10% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ముద్ర ఫార్మాట్ YY BH #### XX. ఇందులో వైవై అంటే తొలి రిజిస్ట్రేషన్ సంవత్సరం, బీహెచ్ అంటే భారత్ సిరీస్ కోడ్, #### అంటే 0000 నుంచి 9999 నంబర్లు.. ఎక్స్ఎక్స్ అంటే ఆంగ్ల అక్షర క్రమం. -
రిజిస్ట్రేషన్ మేడీజీ..
కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చే నెల నుంచి అమలుకు కసరత్తు తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి వాహన యజమానులకు ఊరట మర్రిపాలెం: ‘రవాణా’లో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే నెల నుంచే కొత్త విధానం అందుబాటులోకి రానుంది. తాత్కాలిక రిజిస్ట్రేషన్లకు స్వస్తి చెబుతూ వాహనం కొనుగోలు సమయంలో శాశ్వత రిజిస్ట్రేషన్ అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ విధానంలో రవాణా శాఖ మార్పుకు సిద్ధపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి తొలి లేదా రెండో వారంలో కొత్త రిజిస్ట్రేషన్ల చట్టం అమలులోకి రానున్నట్టు కమిషనర్ ఇటీవల ప్రకటించారు. వాహనం కొనుగోలు తర్వాత రిజిస్ట్రేషన్ కోసం యజమానులు పడుడున్న ఇబ్బందులు గుర్తించి పరిష్కారం చూపించారు. ఇటీవల కాలంలో రిజిస్ట్రేషన్ల కోసం కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. వాహన యజమానుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో దళారులు జేబులు నింపుకుంటున్నట్టు పరిశీలనలో తేలింది. షోరూమ్‌లతో దళారులు కుమ్మక్కై దోచుకుంటున్నారని రుజువైంది. దళారులతో పనిలేకుండా వాహన యజమాని నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా రవాణా శాఖ నిమగ్నమైంది. వాహన యజమాని రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ జరుపుకోవడానికి నిర్ణయించింది. షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ... వాహనాలు విక్రయించే షోరూమ్‌లలో రిజిస్ట్రేషన్ జరపాలని అధికారులు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్ అందచేస్తున్నట్టుగా శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తారు. షోరూమ్‌లలో నిర్వాహకులు వాహనం, యజమాని వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఇంకా వాహనం ఫోటోలు వివిధ కోణాలలో తీసి అప్లోడ్ చేస్తారు. ప్రతీ వాహనం ఇంజన్, చాసిస్ నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. యజమాని చిరునామా, గుర్తింపు, ఆధార్ పత్రాలు షోరూమ్‌లో స్వీకరిస్తారు. అక్కడే యజమాని సంతకం కంప్యూటర్ ప్యాడ్‌లో ఫీడ్ చేస్తారు. ఆయా షోరూమ్‌లలో పొందుపరిచిన వాహనాలను ఆన్లైన్లో రవాణా ఉద్యోగులు స్వీకరిస్తారు. యజమాని వివరాలు, పత్రాలు సరిపోల్చి రిజిస్ట్రేషన్ కార్డ్‌ను స్పీడ్ పోస్ట్‌లో చేరవేస్తారు. ఒకవేళ యజమాని పేరుతో మరో వాహన అదనంగా ఉన్నట్టుగా తేలితే షోరూమ్‌లలో టాక్స్ చెల్లించే విధంగా ఇప్పటికే ఉత్తర్వులు అమలులో ఉన్నాయి. యజమానులకు ఊరట షోరూమ్‌లలో శాశ్వత రిజిస్ట్రేషన్ మంజూరుతో వాహన యజమానులకు ఊరట లభించనుంది. దళారులు, రవాణా కార్యాలయానికి రాకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. రవాణా శాఖ తెలియజేసిన చలానా ధరలు షోరూమ్‌లలో చెల్లించడంతో ఖర్చు తగ్గనుంది. శాశ్వత రిజిస్ట్రేషన్ల బాధ్యత షోరూమ్‌లకు అప్పగించడంతో రవాణా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అవసరం ఉండదని తెలుస్తోంది. ఫ్యాన్సీ నంబర్లకు ఈ-టెండరింగ్ విధానం ఫ్యాన్సీ నంబర్ల మంజూరుకు ఈ-టెండరింగ్ విధానం అమలు చేయాలని రవాణా శాఖ భావిస్తోంది. రిజిస్ట్రేషన్‌కు ముందుగా ఫ్యాన్సీ నంబర్లకు ఆన్లైన్లో బుకింగ్ జరుపుకోవచ్చు. ఆయా నంబర్లకు ఉంటున్న డిమాండ్‌ను బట్టి ఈ-టెండరింగ్‌లో పోటీపడాలి. ఎక్కువ బిడ్ దాఖలు చేసిన యజమానికి నంబర్ కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు కనీస ధర నిర్ణయించడం పోటీని బట్టి సీల్ టెండర్లు కోరడం జరిగేది. ఇకపై కనీస ధరతోపాటు పోటీ వాతావరణం కల్పించి ఆదాయం రాబట్టడానికి రవాణా శాఖ ఆలోచిస్తోంది. ఇక సాధారణ నంబర్లు వాహనం కొనుగోలు సమయంలో వరుస క్రమం ప్రకారం ఆన్లైన్లో కేటాయిస్తారు.