సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక సంవత్సరం చివరలో రాష్ట్ర ఖజానాకు కరోనా రూపంలో అనుకోని కష్టం వచ్చిపడింది. ఈ నెల 22 నుంచి అధికారికంగా కర్ఫ్యూ, లాక్‌డౌన్ ప్రకటించినా, అంతకుముందు నుంచే కరోనా ప్రభావం కనిపిస్తోందని, ఈ పక్షం రోజుల్లో దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయంలో కోతపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో అమ్మకాలు, కొనుగోళ్లు పెద్దఎత్తున పడిపోవడంతో పన్ను రాబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల ఆదాయం స్తంభించిపోయిందని, మద్యం అమ్మకాలు లేకపోవడం, పెట్రోల్, డీజిల్ విక్రయాలు కూడా తగ్గిపోవడంతో ఆయా శాఖల పరిధిలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాణిజ్య పన్నులు గోవిందా!
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రోజుకు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, గత 8 రోజులుగా ఈ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం రోజుకు రూ.10 కోట్ల మేర కూడా ఆదాయం రావడం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఒక్క శాఖ పరిధిలోనే గత పక్షం రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,500 కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్‌లో జీఎస్టీ బకాయిలకు వన్ టైం సెటిల్‌మెంట్ ప్రకటించడంతో పరిస్థితి సజావుగా ఉంటే మరికొంత ఆదాయం వచ్చి ఉండేది. ఇక, రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడ్డాయి. వచ్చే ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల రాబడి వస్తుందన్న ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారమే ఈ ఆరు రోజుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా రోజుకు సుమారు రూ.20 కోట్ల చొప్పున ఈ 15 రోజుల్లో కొంచెం రూ. 250 కోట్ల వరకు ఆదాయం కోల్పోయింది. రవాణా శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.1,000 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. మరోవైపు మైనింగ్, ఇసుక అమ్మకాలు తదితర పన్నేతర రాబడుల ఊసే లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని, వచ్చే సంవత్సరం బడ్జెట్ నిర్వహణపై ఈ పరిణామాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు.
కరువులో అధిక మాసం..
రోజువారీ రాబడులు లేకపోయినా కరోనా రూపంలో చేయాల్సిన అనివార్య ఖర్చును సర్దేందుకు ఆర్థిక శాఖ అధికారులు కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో చేయాల్సిన ఖర్చులు, పేదలకు బియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1,500 చొప్పున నగదు పంపిణీ, అవసరమైతే సరుకులు ఇళ్లకు పంపాల్సి రావడం లాంటి ఖర్చులు ఎంత తక్కువ వేసినా రూ.3 వేల కోట్లు దాటుతాయని, వీటికి తోడు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అయ్యే రోజువారీ ఖర్చులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కత్తి మీద సాములా మారిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆర్థిక మూలాలు బలంగా ఉండటం, ఆర్థిక క్రమశిక్షణ లాంటి సానుకూలతలను ఆసరాగా చేసుకుని ప్రజలకు అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎన్ని డబ్బులైనా సర్దుబాటు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment