State Treasury
-
ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేటేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటలపాటు సమీక్షించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జీఎస్టీ రాబడిపై దృష్టి పెట్టండి నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని, అలాగే, ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం చెప్పారు. వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు? ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణమేంటని సీఎం రేవంత్ ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని ఈ సందర్భంగా చర్చ జరిగింది. డిస్టిలరీస్ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం నిర్దేశించారు. రియల్ ఎస్టేట్‌కు అనుకూలం రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఈ ఆరు నెలల్లో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా అదే మాదిరి పుంజుకుంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేటేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. -
ఖజానాకు కరోనా ‘ఎఫెక్ట్’!
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక సంవత్సరం చివరలో రాష్ట్ర ఖజానాకు కరోనా రూపంలో అనుకోని కష్టం వచ్చిపడింది. ఈ నెల 22 నుంచి అధికారికంగా కర్ఫ్యూ, లాక్డౌన్ ప్రకటించినా, అంతకుముందు నుంచే కరోనా ప్రభావం కనిపిస్తోందని, ఈ పక్షం రోజుల్లో దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయంలో కోతపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో అమ్మకాలు, కొనుగోళ్లు పెద్దఎత్తున పడిపోవడంతో పన్ను రాబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల ఆదాయం స్తంభించిపోయిందని, మద్యం అమ్మకాలు లేకపోవడం, పెట్రోల్, డీజిల్ విక్రయాలు కూడా తగ్గిపోవడంతో ఆయా శాఖల పరిధిలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పన్నులు గోవిందా! రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రోజుకు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, గత 8 రోజులుగా ఈ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం రోజుకు రూ.10 కోట్ల మేర కూడా ఆదాయం రావడం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఒక్క శాఖ పరిధిలోనే గత పక్షం రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,500 కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో జీఎస్టీ బకాయిలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించడంతో పరిస్థితి సజావుగా ఉంటే మరికొంత ఆదాయం వచ్చి ఉండేది. ఇక, రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడ్డాయి. వచ్చే ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల రాబడి వస్తుందన్న ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారమే ఈ ఆరు రోజుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా రోజుకు సుమారు రూ.20 కోట్ల చొప్పున ఈ 15 రోజుల్లో కొంచెం రూ. 250 కోట్ల వరకు ఆదాయం కోల్పోయింది. రవాణా శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.1,000 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. మరోవైపు మైనింగ్, ఇసుక అమ్మకాలు తదితర పన్నేతర రాబడుల ఊసే లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని, వచ్చే సంవత్సరం బడ్జెట్ నిర్వహణపై ఈ పరిణామాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరువులో అధిక మాసం.. రోజువారీ రాబడులు లేకపోయినా కరోనా రూపంలో చేయాల్సిన అనివార్య ఖర్చును సర్దేందుకు ఆర్థిక శాఖ అధికారులు కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో చేయాల్సిన ఖర్చులు, పేదలకు బియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1,500 చొప్పున నగదు పంపిణీ, అవసరమైతే సరుకులు ఇళ్లకు పంపాల్సి రావడం లాంటి ఖర్చులు ఎంత తక్కువ వేసినా రూ.3 వేల కోట్లు దాటుతాయని, వీటికి తోడు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అయ్యే రోజువారీ ఖర్చులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కత్తి మీద సాములా మారిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆర్థిక మూలాలు బలంగా ఉండటం, ఆర్థిక క్రమశిక్షణ లాంటి సానుకూలతలను ఆసరాగా చేసుకుని ప్రజలకు అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎన్ని డబ్బులైనా సర్దుబాటు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
సొంత కార్లు.. బినామీ బిల్లులు
సాక్షి, హైదరాబాద్: అద్దె వాహనాలు.. రాష్ట్ర ఖజానాకు భారీగా కన్నం వేస్తున్నాయి. అవసరానికి మించి వాహనాలు తీసుకోవడం.. సొంత వాహనాలను కూడా అద్దెవాహనాలుగా పెట్టడం.. ఆటో, మోటార్ సైకిళ్ల నంబర్లతో తప్పుడు బిల్లులు పెట్టి సొమ్ము స్వాహా చేయడం యథేచ్ఛగా సాగిపోతోంది. అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ఈ తతంగం కొనసాగుతున్నట్లు ప్రభుత్వ విచారణలోనే వెల్లడైంది. దీంతో అక్రమాల నియంత్రణకు సర్కారు చర్యలు మొదలుపెట్టింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని వివిధ కార్యాలయాల్లో 500 వాహనాలు, వాటి బిల్లులను తనిఖీ చేయించింది. అందులో 173 మంది అధికారులు అద్దె వాహనాల పేరుతో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. ‘అద్దె’వెసులుబాటుతో దందా రాష్ట్రంలో కొత్త వాహనాల కొనుగోలుపై నిషేధం అమల్లో ఉంది. అవసరమైతే అన్ని విభాగాలు, అన్ని శాఖలు, కార్యాలయాల అధికారులు అద్దె వాహనాలను వినియోగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కనీసం 2,500 కిలోమీటర్లు ప్రయాణిస్తే జిల్లాల్లో నెలకు రూ.33 వేలు, హైదరాబాద్‌లో రూ.34 వేలు చెల్లించేలా నిబంధనలను విధించింది. 2,500 కిలోమీటర్లకు మించి తిరిగితే ఆర్థిక శాఖ అనుమతితో అదనపు బిల్లులు చెల్లించేలా షరతులు విధించింది. ఈ వెసులుబాటును అధికారులు దందాగా మార్చుకున్నారు. ఇలా వేలాది వాహనాలు చేరి, ఖర్చు కోట్లలోకి చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తల పట్టుకుంటోంది. ఇక ఎలాగూ ప్రభుత్వానికే నడుపుతున్నామనే ఉద్దేశంతో అద్దె వాహనాల యజమానులు ట్యాక్సీ పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం ఆర్టీఏకు కట్టాల్సిన పన్నులు చెల్లించడం లేదు. దాంతో ఖజానాకు గండి పడుతోంది. ఆన్లైన్లోనమోదుతో అడ్డుకట్ట అద్దె వాహనాల బాగోతంపై ఆర్థిక శాఖ అప్రమత్తమైంది. దీనికి కళ్లెం వేసేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు కార్యాలయాల వారీగా ప్రస్తుతమున్న వాహనాలు, వాటి రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటికి చెల్లిస్తున్న అద్దె వివరాలను సేకరిస్తోంది. వాటిని ఆన్లైన్లో నమోదుచేసి.. అలా నమోదైన వాహనాలకు సంబంధించి మాత్రమే బిల్లులు చెల్లించేలా ట్రెజరీలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఎన్నెన్నో అక్రమాలు - హైదరాబాద్‌లోని అత్యధిక కార్యాలయాల్లో టెండర్లు పిలవకుండానే వాహనాలను అద్దెకు తీసుకున్నారు. - రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది అధికారులు సొంత వాహనాలనే అద్దె వాహనాలుగా చూపి, బినామీ పేర్లతో బిల్లులు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. - రెగ్యులర్ పోస్టుతో పాటు అదనంగా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు అధికారులు.. రెండు పోస్టుల పేరుతో రెండు అద్దె వాహనాలు చూపుతూ, రెండు చోట్లా బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. - విద్యుత్ శాఖ, హైదరాబాద్ వాటర్ సప్లై విభాగాల్లో పనిచేస్తున్న పలువురు డిప్యూటీ ఇంజనీర్లు, డీజీఎం స్థాయి అధికారులు నిర్ణీత రూ.33 వేల కంటే అధికంగా బిల్లులు క్లెయిమ్ చేసుకున్నారు. - ఇక కొందరు అధికారులైతే కార్లు వినియోగించినట్లుగా చూపుతూ ఏకంగా బైకులు, ఆటోల నంబర్లు వేసి తప్పుడు బిల్లులు పెట్టారు. మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్, అద్దె కార్ల ఓనర్లకు డబ్బులిచ్చి వారి కార్ల పేరిట తప్పుడు బిల్లులు తీసుకుని.. సొమ్ముచేసుకుంటున్నారు. - ఇలా అక్రమాలకు పాల్పడుతున్న అధికారులు.. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీ ఆఫీసుల్లో సిబ్బందిని మామూళ్లతో మభ్యపెట్టి.. బిల్లులు పాస్ చేయించుకుంటున్నట్లు తేలింది. - పాత మహబూబ్‌నగర్ జిల్లాలో హౌజింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ ఇంజనీరింగ్ అధికారి బినామీ పేరుతో సొంత వాహనాన్ని అద్దెకు పెట్టడంతో పాటు.. దానికి అవసరమయ్యే డీజిల్‌ను సైతం కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. -
అంత భయంకరమైన దెబ్బ తగల్లేదు
అత్యవసర ఖర్చులు పోను రూ.1,000–1,200 కోట్లు మిగులుతున్నాయి పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీఎం కేసీఆర్ వివరణ సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు అంత భయంకరమైన దెబ్బ తగల్లేదని, అత్యవసర ఖర్చులు పోను ఇతర అవసరాల కోసం నెలకు రూ.1,000–1,200 కోట్ల వరకు మిగులుతున్నాయని సీఎం కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్మెంట్ పథ కంపై జరిగిన చర్చలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంత మేర వివరించే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గిపోతుందని అనుకున్నా అంత భయంకరమైన దెబ్బ తగల్లేదని చెప్పారు. ‘రిజిస్ట్రేషన్ల ద్వారా రోజుకు రూ.15–17 కోట్ల ఆదాయం వచ్చేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అది రూ.10.5 కోట్ల నుంచి 11 కోట్ల వరకు వచ్చింది. నిన్న మొన్న రూ.6–7 కోట్లకు తగ్గింది. మోటారు వాహనాల విక్రయాలు 15–20 శాతం తగ్గాయి. వ్యాట్ ఆదాయం కొనసాగుతోంది. మున్ముందు ఎలా ఉంటుందో ఇప్పుడే తెలియదు. పెద్ద పెద్ద నిపుణులు కూడా నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేయలేకపోతున్నారు. దాని అసలు ప్రభావం జనవరిలో తెలుస్తుందని అంటున్నారు’అని ముఖ్యమంత్రి చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మారకాలు పెరిగాయని, ఈ మారకాల్లో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని, ఈ మారకాల ద్వారా 90–95 శాతం వరకు పన్ను వసూలవుతోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయపడాల్సినంత భయంకరంగా ఏమీ లేదని, వేతనాలు, పింఛన్లు, అప్పు చెల్లింపులు పోను ఇతర అవసరాల కోసం రూ.1,000–1,200 కోట్ల వరకు మిగిలే విధంగా ఆదాయం ఉంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఇప్పటివరకు రూ.24,500 కోట్ల వరకు కొత్త నోట్లు రాష్ట్రానికి వచ్చాయని, ఈ నెలలో మరో రూ.11 వేల కోట్ల వరకు ఇస్తామని ఆర్బీఐ చెప్పిందని కేసీఆర్ వెల్లడించారు. -
నల్ల ఖాతాల నుంచి రూ. 2,428 కోట్ల పన్ను
న్యూఢిల్లీ: నల్లధనం వెల్లడికి గతేడాదితో ముగిసిన ఏకకాల గవాక్ష విధానం ద్వారా 644 సంస్థల ఖాతాల నుంచి రూ. 2,428.4 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ మొత్తం గతేడాది డిసెంబర్ 31 వరకూ వచ్చినదని ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అయితే ఈ విభాగంలోని రాబడిలో కొంత తగ్గుదల ఉందని పేర్కొంది. డిక్లరేషన్లు ఇచ్చిన 644 సంస్థలు రూ. 4,164 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఏకకాలగవాక్ష విధానం ద్వారా ఆ సంస్థల ఆస్తులపై ట్యాక్స్ 30 శాతం, పెనాల్టీ 30 శాతం చెల్లించాల్సి ఉండటం వల్ల డిసెంబర్ 31 వరకూ రూ. 2,428.4 కోట్లు వచ్చిందని తెలిపింది. అయితే ఈ మొత్తం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. కాగా, నల్లధనం, పన్ను విధింపు చట్టం గతేడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ఏకకాల సమ్మతి గవాక్ష విధానం ద్వారా తమ నల్లధన ఖాతాల వివరాలను సంస్థలు వెల్లడించి పన్ను, పెనాల్టీ చెల్లించి శిక్ష తప్పించుకోవచ్చు. వివరాలు వెల్లడించని వారు తర్వాత భారీ పెనాల్టీతో పాటు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది. -
కళకళలాడిన ఖజానా!
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఈ నెల 31తో ముగుస్తుంది)లో రాష్ట్ర ఖజానాకు నిధుల వరద పారింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బడ్జెట్లో పేర్కొన్న లక్ష్యానికన్నా అదనంగా రూ.1,077 కోట్లు వచ్చింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ద్రవ్య విధాన పత్రంలో పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌తో పాటు, వ్యాట్, రవాణా, ఎక్సైజ్ రంగాల్లో అదనపు ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.37,398 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ద్రవ్య విధాన పత్రంలో సవరించిన బడ్జెట్ అంచనా మేరకు రూ.38,475 కోట్ల ఆదాయం రానున్నట్టు పేర్కొన్నారు. అంటే లక్ష్యానికన్నా అదనంగా రూ.1,077 కోట్ల ఆదాయం వస్తున్నట్టు స్పష్టమైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 2014-15లో ఏకంగా 48.81 శాతం వృద్ధి నమోదైనట్టు ఈ పత్రంలో వివరించారు. 2013-14లో ఈ రంగం నుంచి రూ.1,795.81 కోట్లు వచ్చినట్టు పేర్కొన్నారు. 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2,461 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. రూ.2,672 కోట్లు వచ్చింది. అలాగే వ్యాట్, ఎక్సైజ్, రవాణా రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అంటే ప్రతిసేవకూ యూజర్ చార్జీలను వసూలు చేయడంతో పాటు గనుల రంగం నుంచి పన్నేతర ఆదాయాన్ని భారీగా పెంచనున్నారు. రాష్ట్ర అప్పుల పరిమాణం పెరిగిపోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. 2004-05 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 29.55% ఉండగా 2013-14 నాటికి ఇవి 20.09 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014-15లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 24.70 శాతానికి పెరిగినట్టు వివరించారు. కాగా 2014-2015 ఆర్ధిక సంవత్సరానికి గాను సవరించిన అప్పు రూ. 1,29,264 కోట్లు ఉన్నట్లు వివరించారు. హామీల అమలుకు రెండు మూడేళ్లు! హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలనూ రెండు మూడేళ్లలో నిలబెట్టుకుంటామని, ఈ ఏడాది బడ్జెట్లో కేటాయింపులు చేయలేకపోయినా, రానున్న సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు నిధులిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు. టీడీపీ మేనిఫెస్టోను విపక్ష నేత జగన్ కంఠస్థం చేశారని, అన్ని హామీల గురించి ప్రశ్నిస్తున్నారని.. చెబుతూ ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. హామీల అమలు విషయంలో రైతులు, మహిళలు, అన్ని వర్గాలను సంతృప్తిపరచగలిగామని, కానీ విపక్ష నేత జగన్‌ను సంతృప్తిపరచలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. రాబడి, వ్యయం మధ్య వ్యత్యాసం ఉంటే రుణం తెచ్చుకుంటామని, ఈ విషయం విపక్షానికి అర్థం కావడం లేదని విమర్శించారు. రూ.1.13 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టామని, అందులో రూ.25 వేల కోట్ల లోటుందని, రెవెన్యూ పెంచుకోవడం ద్వారా సమీకరించుకుంటామన్నారు. బడ్జెట్ సంస్కరణల్లో భాగంగా జీరో బేస్డ్ బడ్జెట్‌ను 1999లోనే ప్రవేశ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి యనమల గుర్తు చేశారు. 2004 వరకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, తర్వాత రాబడి పెరిగిందని అన్నారు. అప్పట్లో రోజుమార్చి రోజు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వెల్లడించారు. పీఆర్సీ భారం రూ.5 వేల కోట్లు పడిందని వివరించారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పన్నుల రాబడి తగ్గిందని యనమల వివరించారు. రాబడి తగ్గకుండా చూసుకోడానికి వ్యాట్‌తో పాటు లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ.4 అదనంగా వసూలు చేయడాన్ని మంత్రి సమర్ధించుకున్నారు. రైతుల రుణమాఫీ గత ఏడాదే ప్రారంభించామని, ఈ ఏడాది రాబడి పెరిగితే మొత్తం రుణాలు మాఫీ చేస్తామని, లేదంటే వచ్చే ఏడాది కూడా కొంత చెల్లిస్తామని యనమల చెప్పారు. పెన్షన్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రస్తుతం 37 లక్షల మందికి ఇస్తున్నామని, మరో 1.5 లక్షల మందికి త్వరలో మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. హుద్‌హద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రూ.4 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు. పోలవరం మునక ప్రాంతంలోని 7 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, టీచర్లు, ఇతర ఉద్యోగులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఇసుక మీద ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద వ్యాట్ పెంపు సూచనను పరిశీలిస్తున్నామన్నారు. -
అప్పుల తిప్పలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం పెరుగుతోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి వెచ్చించడంతో అప్పుల భారం ఏటికేటికీ పెరిగిపోతోంది. ఏడాది కాలంలోనే తలసరి అప్పు అదనంగా 7,272 రూపాయలు పెరిగింది. 14వ ఆర్థిక సంఘం విధించిన అప్పుల నిబంధనలను అధిగమించి మరీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24.33 శాతానికి మించకూడదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దీన్ని అధిగమించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అప్పులు 1,46,852.53 కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయి. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25.05 శాతం. అప్పుల భారం పెరగడంతో.. తలసరి అప్పు కూడా పెరిగిపోతోంది. రాష్ట్ర జనాభా 4.95 కోట్ల మంది వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తలసరి అప్పు 29,667 రూపాయలకు పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తలసరి అప్పు 22,395 రూపాయలుగా ఉంది. అంటే తలసరి అప్పు ఏడాది కాలంలోనే 7,272 రూపాయలు పెరిగినట్లైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పులు రూ.1,29,264 కోట్లుగా ఉన్నాయి. అంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 17,588 కోట్లు అప్పు చేస్తున్నారు. విశేషమేమంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ సమర్పణ సమయంలో చెప్పిన దాదాపు రూ. 12 వేల కోట్ల కన్నా అదనంగా రూ. 8 వేల కోట్లు అప్పు చేసింది. అంటే మొత్తం రూ. 20 వేల కోట్ల అప్పులు చేసింది. ఇందులో ఆస్తుల కల్పనకు రూ.7 వేల కోట్లు వ్యయం చేసింది. అప్పు చేసిన డబ్బును ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి ఖర్చు చేయడంతో ఆస్తులు తరిగిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి. -
చెల్లింపులన్నీ బంద్!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఉమ్మడి రాష్ట్ర ఖజానా ఖాతా బంద్ అయింది. జీతాలు, వేతనాలు, బిల్లుల చెల్లింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడనుండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఏపీ ఖజానా శాఖ కొత్త ఖాతా తెరిచేవరకు ఎలాంటి చెల్లింపులు జరగవు, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు, ఇతరరత్రా బిల్లులు చెల్లింపులు పూర్తయింది. ఏపీ ఖజానా శాఖ కొత్త ఖాతా తెరిచి లావాదేవీలు ప్రారంభమయ్యేందుకు ఎన్నిరోజులు పడుతుందన్నది ఆ శాఖ అధికారులే చెప్పలేకపోతున్నారు. కనీసం జూన్ పదో తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు జరగకపోవచ్చని సమాచారం. రాష్ట్ర విభజన కారణంగా ఈ నెల 24వతేదీతో ఖజానా చెల్లింపులు నిలిపివేయాలని అధికార యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే అప్పటికి చాలా లావేదేవీలు పూర్తికాకపోవటం, సర్వర్ సమస్యల వల్ల గడువును మరో రెండు రోజులు పొడిగించింది. తాజా గడువు సోమవారంతో ముగిసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్ల చెల్లింపులకు అధికార యంత్రాంగం ప్రాధాన్యమిచ్చింది. సమయం చాలకపోవటంతో వివిధ శాఖలు చేపట్టిన పనులు.. శాసనసభ్యులు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు.. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్మెంట్, ఇతర బిల్లుల చెల్లింపులు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల మేర నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్‌దారు మరణించినా వారి దహన సంస్కారాల కోసం ఇవ్వవలసిన ఆర్థిక సహాయాన్ని అందించటానికి కూడా ప్రస్తుతం అవకాశం లేదు. మరీ అత్యవసరంగా ఏమైనా చెల్లింపులు చేయాల్సి వస్తే జిల్లా అధికారులు ఖజానా శాఖ కమిషనరేట్ దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బిల్లులు నిలిచిపోవటంతో జిల్లాలోని కాంట్రాక్టర్లు, గ్రామ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పనులు నిలిపివేసినవారు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
రాబడిలో టాప్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆదాయం, అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లా తలమానికంగా మారింది. రాష్ట్ర ఖజానాకుఅత్యధిక ఆదాయం సమకూరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకశక్తిగా ఎదిగింది. ఆదాయార్జన శాఖలన్నీ లక్ష్యాలను అధిగమించడంలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాపైనే ఆధారపడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర విభజన జరిగితే జిల్లాకు వ చ్చే రాబడిపై ప్రభావంచూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల రాబడి మినహా.. ఇతర శాఖల నుంచి రూ.4,606 కోట్ల ఆదాయం లభించింది. వాణిజ్య పన్నుల శాఖతో కలుపుకుంటే (రూ.2,873 కోట్లు) ఇది కాస్తా రూ.7,477 కోట్లకు చేరింది. భౌగోళికంగా జిల్లా నైసర్గిక స్వరూపం పూర్తిగా హైదరాబాద్‌కు ఆనుకొని ఉండడంతో ప్రభుత్వ ఖజానాలో సింహభాగం జిల్లా నుంచేజమఅవుతోంది. రాష్ట్రంలోనే రాబడిలో టాప్‌గా నిలుస్తున్నప్పటికీ, నిధుల మంజూరులో మాత్రం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. కేవలం మొక్కుబడిగా నిధులు విదిలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ఖజానాకు కాసుల గలగల రాజధానికి చేరువలో జిల్లా ఉండడంతో శరవేగంగా నగరీకరణ చెందుతోంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో అత్యధికం జిల్లా నుంచే వస్తోంది. భూముల విలువలు అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ఖజానా నింపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ యేటికాయేడు మార్కెట్ ధరలను సవరిస్తోంది. రంగారెడ్డి జిల్లాను దృష్టిలో ఉంచుకునే సర్కారు ఈ ఎత్తుగడను అమలు చేస్తోందన్నది స్పష్టం. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ పంట పండుతోంది. మరోవైపు రవాణా శాఖకు కూడా ప్రధాన ఆదాయ వనరు మన జిల్లానే. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, జీవితపన్ను, త్రైమాసిక పన్నులతో రవాణా శాఖ కోశాగారం నిండుతోంది. ఇంకోవైపు అబ్కారీ శాఖకు పుష్కలంగా ఆదాయం సమకూరుతోంది కూడా జిల్లా నుంచే. లెసైన్సు, ప్రివిలేజ్ రుసుముల రూపేణా అబ్కారీ శాఖ దండుకుంటోంది. నగరీకరణ నేపథ్యంలో మద్యప్రాన ప్రియులు కూడా భారీగా పెరుగుతుండడం ఎక్సైజ్‌శాఖకు కాసుల పంట పండుతోంది. మరోవైపు ల్యాండ్ రెవెన్యూలోనూ రంగారెడ్డి జిల్లాదే అగ్రపథం. నాలా పన్నులు, భూ వినియోగమార్పిడి ఫీజులు తదితర పన్నుల పేర జిల్లాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. వ ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూములకు ‘నాలా’ చట్టాన్ని వర్తింప జేస్తుండడంతో సర్కారుకు కలిసివస్తోంది. ఫలితంగా ల్యాండ్ రెవెన్యూలోనూ మన జిల్లా వాటానే అధికంగా ఉంటోంది. ఇక వాణిజ్య పన్నుల వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు జిల్లావ్యాప్తంగా విస్తరించడంతో కమర్షియల్ టాక్స్ వసూళ్లు దండిగా ఉంటున్నాయి. విడిపోతే ఎలా? ప్రస్తుతం రాష్ర్టంలోనే అత్యధిక రాబడి మన జిల్లా నుంచే నమోదవుతున్నప్పటికీ, భవిష్యత్తులో దీంట్లో మార్పులు జరిగే అవకాశాల్లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కొన్ని హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయంటున్నారు. ఐదేళ్లుగా ఒడుదొడుకులను ఎదుర్కొని ఇటీవల కోలుకున్న స్థిరాస్తి రంగం తెలంగాణ ప్రకటనతో మళ్లీ ఆటుపోట్లకు లోనవుతోంది. 20 రోజులుగా భూముల క్రయవిక్రయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇదే పరిస్థితి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తైసాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఈ రంగానికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఇక ఎక్సైజ్ శాఖ రాబడిలో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ, ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల్లో భారీ మార్పు నమోదు కావచ్చు. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి జిల్లాలవారీగా డీలర్షిప్లున్నా వాటి ఆయిల్ డిపోలు మన జిల్లాలో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి నుంచి పెట్రోలు, డీజిల్ తదితర ముడిచమురును కొనుగోలు చేసే డీలర్లు విధిగా ఆ డిపోల పరిధిలో వ్యాట్ చెల్లిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో నమోదు కావాల్సిన వ్యాట్ మన జిల్లాలో జమ అవుతోంది. రాష్ట్ర విభజన జరిగి తే ఈ ఆదాయంలో భారీ సవరణలు జరిగే అవకాశ ముంది. ఈ పన్నులన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే చెల్లిస్తే ఆదాయం నమోదులో మార్పు తప్పకపోవచ్చు. నిధుల్లో వాటా పెరగాల్సిందే! ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు సమకూరుస్తున్న రంగారెడ్డి జిల్లాకు దీర్ఘకాలంగా అన్యాయం జరుగుతోంది. అత్యధిక రాబడి సాధిస్తున్నప్పటికీ, ఆ నిష్పత్తిలో నిధుల వాటా రావడంలేదు. ఫలితంగా శివార్లు మినహా.. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలు మౌలిక సదుపాయాల్లేక అల్లాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా సమపాళ్లలో నిధులు రాబట్టడంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరముంది. జిల్లాలో వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయం (రూ.కోట్లలో) వాణిజ్యపన్నులు 2,872.66 స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 1,809.76 ఎక్సైజ్ 2,004 రవాణ 600.43 గనులు 107.36 అటవీశాఖ 63.48 ల్యాండ్ రెవెన్యూ 19.57