కళకళలాడిన ఖజానా!
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(ఈ నెల 31తో ముగుస్తుంది)లో రాష్ట్ర ఖజానాకు నిధుల వరద పారింది. సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యానికన్నా అదనంగా రూ.1,077 కోట్లు వచ్చింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ద్రవ్య విధాన పత్రంలో పేర్కొన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌తో పాటు, వ్యాట్, రవాణా, ఎక్సైజ్ రంగాల్లో అదనపు ఆదాయం లభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో రాష్ట్ర సొంత పన్నుల ద్వారా రూ.37,398 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే ద్రవ్య విధాన పత్రంలో సవరించిన బడ్జెట్ అంచనా మేరకు రూ.38,475 కోట్ల ఆదాయం రానున్నట్టు పేర్కొన్నారు. అంటే లక్ష్యానికన్నా అదనంగా రూ.1,077 కోట్ల ఆదాయం వస్తున్నట్టు స్పష్టమైంది.
- స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం 2014-15లో ఏకంగా 48.81 శాతం వృద్ధి నమోదైనట్టు ఈ పత్రంలో వివరించారు. 2013-14లో ఈ రంగం నుంచి రూ.1,795.81 కోట్లు వచ్చినట్టు పేర్కొన్నారు. 2014-15 బడ్జెట్ అంచనాల్లో రూ.2,461 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. రూ.2,672 కోట్లు వచ్చింది. అలాగే వ్యాట్, ఎక్సైజ్, రవాణా రంగాల ద్వారా అదనపు ఆదాయం వచ్చింది.
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయం పెంచడానికి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. అంటే ప్రతిసేవకూ యూజర్ చార్జీలను వసూలు చేయడంతో పాటు గనుల రంగం నుంచి పన్నేతర ఆదాయాన్ని భారీగా పెంచనున్నారు.
- రాష్ట్ర అప్పుల పరిమాణం పెరిగిపోతున్నట్టు మంత్రి పేర్కొన్నారు. 2004-05 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 29.55% ఉండగా 2013-14 నాటికి ఇవి 20.09 శాతానికి తగ్గినట్లు పేర్కొన్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014-15లో సవరించిన అంచనాల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 24.70 శాతానికి పెరిగినట్టు వివరించారు. కాగా 2014-2015 ఆర్ధిక సంవత్సరానికి గాను సవరించిన అప్పు రూ. 1,29,264 కోట్లు ఉన్నట్లు వివరించారు.
హామీల అమలుకు రెండు మూడేళ్లు!
హైదరాబాద్: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలనూ రెండు మూడేళ్లలో నిలబెట్టుకుంటామని, ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయింపులు చేయలేకపోయినా, రానున్న సంవత్సరాల్లో మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలుకు నిధులిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ద్రవ్య వినిమయ బిల్లుపై శుక్రవారం అసెంబ్లీలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
టీడీపీ మేనిఫెస్టోను విపక్ష నేత జగన్ కంఠస్థం చేశారని, అన్ని హామీల గురించి ప్రశ్నిస్తున్నారని.. చెబుతూ ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. హామీల అమలు విషయంలో రైతులు, మహిళలు, అన్ని వర్గాలను సంతృప్తిపరచగలిగామని, కానీ విపక్ష నేత జగన్‌ను సంతృప్తిపరచలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. రాబడి, వ్యయం మధ్య వ్యత్యాసం ఉంటే రుణం తెచ్చుకుంటామని, ఈ విషయం విపక్షానికి అర్థం కావడం లేదని విమర్శించారు. రూ.1.13 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టామని, అందులో రూ.25 వేల కోట్ల లోటుందని, రెవెన్యూ పెంచుకోవడం ద్వారా సమీకరించుకుంటామన్నారు.
బడ్జెట్ సంస్కరణల్లో భాగంగా జీరో బేస్డ్ బడ్జెట్‌ను 1999లోనే ప్రవేశ పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి యనమల గుర్తు చేశారు. 2004 వరకు ఆర్థిక ఇబ్బందులున్నాయని, తర్వాత రాబడి పెరిగిందని అన్నారు. అప్పట్లో రోజుమార్చి రోజు ఓవర్ డ్రాఫ్ట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వెల్లడించారు. పీఆర్సీ భారం రూ.5 వేల కోట్లు పడిందని వివరించారు.
- అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో పన్నుల రాబడి తగ్గిందని యనమల వివరించారు. రాబడి తగ్గకుండా చూసుకోడానికి వ్యాట్‌తో పాటు లీటరు పెట్రోలు, డీజిల్‌పై రూ.4 అదనంగా వసూలు చేయడాన్ని మంత్రి సమర్ధించుకున్నారు.
- రైతుల రుణమాఫీ గత ఏడాదే ప్రారంభించామని, ఈ ఏడాది రాబడి పెరిగితే మొత్తం రుణాలు మాఫీ చేస్తామని, లేదంటే వచ్చే ఏడాది కూడా కొంత చెల్లిస్తామని యనమల చెప్పారు.
- పెన్షన్ల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ప్రస్తుతం 37 లక్షల మందికి ఇస్తున్నామని, మరో 1.5 లక్షల మందికి త్వరలో మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
- హుద్‌హద్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రూ.4 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి చర్యలు చేపట్టనున్నామని మంత్రి తెలిపారు.
- పోలవరం మునక ప్రాంతంలోని 7 మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని, టీచర్లు, ఇతర ఉద్యోగులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఇసుక మీద ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామన్నారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల మీద వ్యాట్ పెంపు సూచనను పరిశీలిస్తున్నామన్నారు.