అంత భయంకరమైన దెబ్బ తగల్లేదు
అత్యవసర ఖర్చులు పోను రూ.1,000–1,200 కోట్లు మిగులుతున్నాయి
పెద్ద నోట్ల రద్దు అనంతరం రాష్ట్ర ఆర్థిక స్థితిపై సీఎం కేసీఆర్ వివరణ
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు అంత భయంకరమైన దెబ్బ తగల్లేదని, అత్యవసర ఖర్చులు పోను ఇతర అవసరాల కోసం నెలకు రూ.1,000–1,200 కోట్ల వరకు మిగులుతున్నాయని సీఎం కె. చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథ కంపై జరిగిన చర్చలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంత మేర వివరించే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆదాయం తగ్గిపోతుందని అనుకున్నా అంత భయంకరమైన దెబ్బ తగల్లేదని చెప్పారు.
‘రిజిస్ట్రేషన్ల ద్వారా రోజుకు రూ.15–17 కోట్ల ఆదాయం వచ్చేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అది రూ.10.5 కోట్ల నుంచి 11 కోట్ల వరకు వచ్చింది. నిన్న మొన్న రూ.6–7 కోట్లకు తగ్గింది. మోటారు వాహనాల విక్రయాలు 15–20 శాతం తగ్గాయి. వ్యాట్ ఆదాయం కొనసాగుతోంది. మున్ముందు ఎలా ఉంటుందో ఇప్పుడే తెలియదు. పెద్ద పెద్ద నిపుణులు కూడా నోట్ల రద్దు ప్రభావాన్ని అంచనా వేయలేకపోతున్నారు. దాని అసలు ప్రభావం జనవరిలో తెలుస్తుందని అంటున్నారు’అని ముఖ్యమంత్రి చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మారకాలు పెరిగాయని, ఈ మారకాల్లో దేశంలోనే మన రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని, ఈ మారకాల ద్వారా 90–95 శాతం వరకు పన్ను వసూలవుతోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భయపడాల్సినంత భయంకరంగా ఏమీ లేదని, వేతనాలు, పింఛన్లు, అప్పు చెల్లింపులు పోను ఇతర అవసరాల కోసం రూ.1,000–1,200 కోట్ల వరకు మిగిలే విధంగా ఆదాయం ఉంటోందని సీఎం కేసీఆర్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రజలకు ఇబ్బంది ఎదురుకాకుండా ఉండేందుకుగాను ఇప్పటివరకు రూ.24,500 కోట్ల వరకు కొత్త నోట్లు రాష్ట్రానికి వచ్చాయని, ఈ నెలలో మరో రూ.11 వేల కోట్ల వరకు ఇస్తామని ఆర్‌బీఐ చెప్పిందని కేసీఆర్ వెల్లడించారు.