ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy ordered to undertake reforms to fill Govt treasury | Sakshi
Sakshi News home page

ఆదాయం పెంచాల్సిందే.. ఖజానా నింపేందుకు సంస్కరణలు: సీఎం రేవంత్‌రెడ్డి

Published Fri, Jul 12 2024 5:53 AM | Last Updated on Fri, Jul 12 2024 5:53 AM

CM Revanth Reddy ordered to undertake reforms to fill Govt treasury

ఖజానా నింపేందుకు సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

జూన్‌ వరకు వచ్చిన ఆదాయం ఆశాజనకంగా లేదు 

పన్నుల వసూళ్లపై నిక్కచ్చిగా వ్యవహరించండి  

ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలి  

విమాన ఇంధనంపై పన్నును సవరించే అంశాన్ని పరిశీలించండి 

ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తానన్న ముఖ్యమంత్రి 

ఆదాయం తెచ్చే ప్రధాన శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచేందుకు వీలైనన్ని సంస్కరణలు తీసుకుని రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు వచ్చిన ఆదాయంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు ఆదాయం రావాలంటే ఆయా శాఖలు లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని స్పష్టం చేశారు. 

గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి రాష్ట్రానికి ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, మైనింగ్, స్టాంపులు రిజిస్ట్రేటేషన్లు, రవాణా శాఖల ఉన్నతాధికారులతో సీఎం దాదాపు నాలుగు గంటలపాటు సమీక్షించారు. 

గత సంవత్సరంతో పోలిస్తే ఆదాయం పెరగాలని, పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ప్రతి విభాగం నెలవారీగా లక్ష్యాలను రూపొందించుకుని, ఆ లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఆదాయం వచ్చే వనరులపై, పన్నుల వసూళ్లపై అధికారులు నిక్కచ్చిగా ఉండాలని స్పష్టంచేశారు. సంబంధిత విభాగాన్ని అవసరమైతే పునర్‌వ్యవస్థీకరించుకోవాలని దిశా నిర్దేశం చేశారు. 
 
జీఎస్టీ రాబడిపై దృష్టి పెట్టండి 
నిర్దేశించిన వార్షిక లక్ష్యంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్‌ వరకు వచ్చిన ఆదాయం అంత ఆశాజనకంగా లేదని సీఎం రేవంత్‌ అభిప్రాయపడ్డారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో పొందుపరిచిన వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏ నెలకానెల లక్ష్యాలను నిర్దేశించుకొని రాబడి సాధించాలన్నారు. ఇకపై ప్రతి నెలా మొదటి వారంలో నిర్ణీత ఆదాయ లక్ష్యాలపై తాను సమీక్షిస్తానని, అలాగే, ప్రతి శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల లక్ష్య సాధన పురోగతిపై సమావేశమవుతారని చెప్పారు. 

ప్రధానంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే జీఎస్టీని పెంచుకునే చర్యలు వెంటనే చేపట్టాలని సీఎం చెప్పారు. వాణిజ్య పన్నుల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని, పక్కాగా ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిందని, ప్రత్యామ్నాయంగా విమాన ఇంధనంపై ఉన్న పన్నును సవరించే అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు.  

మద్యం ఆదాయం ఎందుకు పెరగలేదు? 
ఎన్నికలప్పుడు మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగినప్పటికీ అంతమేరకు ఆదాయం పెరగకపోవటానికి కారణమేంటని సీఎం రేవంత్‌ ఆరా తీశారు. అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేయాలని, నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ను అరికడితే ఆదాయం పెరిగే అవకాశముందని ఈ సందర్భంగా చర్చ జరిగింది. డిస్టిలరీస్‌ నుంచి మద్యం అడ్డదారి పట్టకుండా నిఘా పెట్టాలని, అందుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై పరిమిత కాలం పన్ను సబ్సిడీ అమలైందని, తిరిగి పన్ను వసూలు చేయటం ద్వారా వాహనాల అమ్మకాలపై ఏమైనా ప్రభావం పడిందా అన్న అంశంపై అధ్యయనం చేయాలని సీఎం నిర్దేశించారు. 

రియల్‌ ఎస్టేట్‌కు అనుకూలం 
రీజనల్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో విస్తరణ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులతోపాటు ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడిందన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఈ ఆరు నెలల్లో వాణిజ్య నిర్మాణాలు పెరిగాయని, గృహ నిర్మాణాలు కూడా అదే మాదిరి పుంజుకుంటాయని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, అదే స్థాయిలో రిజిస్ట్రేటేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణాను అరికట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement