సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఖజానాపై అప్పుల భారం పెరుగుతోంది. చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి వెచ్చించడంతో అప్పుల భారం ఏటికేటికీ పెరిగిపోతోంది. ఏడాది కాలంలోనే తలసరి అప్పు అదనంగా 7,272 రూపాయలు పెరిగింది. 14వ ఆర్థిక సంఘం విధించిన అప్పుల నిబంధనలను అధిగమించి మరీ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 24.33 శాతానికి మించకూడదని 14వ ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో దీన్ని అధిగమించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మొత్తం అప్పులు 1,46,852.53 కోట్ల రూపాయలకు పెరుగుతున్నాయి. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 25.05 శాతం. అప్పుల భారం పెరగడంతో.. తలసరి అప్పు కూడా పెరిగిపోతోంది.
రాష్ట్ర జనాభా 4.95 కోట్ల మంది వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి తలసరి అప్పు 29,667 రూపాయలకు పెరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో తలసరి అప్పు 22,395 రూపాయలుగా ఉంది. అంటే తలసరి అప్పు ఏడాది కాలంలోనే 7,272 రూపాయలు పెరిగినట్లైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అప్పులు రూ.1,29,264 కోట్లుగా ఉన్నాయి. అంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 17,588 కోట్లు అప్పు చేస్తున్నారు. విశేషమేమంటే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం బడ్జెట్ సమర్పణ సమయంలో చెప్పిన దాదాపు రూ. 12 వేల కోట్ల కన్నా అదనంగా రూ. 8 వేల కోట్లు అప్పు చేసింది. అంటే మొత్తం రూ. 20 వేల కోట్ల అప్పులు చేసింది. ఇందులో ఆస్తుల కల్పనకు రూ.7 వేల కోట్లు వ్యయం చేసింది. అప్పు చేసిన డబ్బును ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ వ్యయానికి ఖర్చు చేయడంతో ఆస్తులు తరిగిపోయి అప్పులు పెరిగిపోతున్నాయి.