సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆదాయం, అభివృద్ధిలో రాష్ట్రంలోనే జిల్లా తలమానికంగా మారింది. రాష్ట్ర ఖజానాకుఅత్యధిక ఆదాయం సమకూరుస్తూ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కీలకశక్తిగా ఎదిగింది. ఆదాయార్జన శాఖలన్నీ లక్ష్యాలను అధిగమించడంలో ప్రధానంగా రంగారెడ్డి జిల్లాపైనే ఆధారపడుతున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర విభజన జరిగితే జిల్లాకు వ చ్చే రాబడిపై ప్రభావంచూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య పన్నుల రాబడి మినహా.. ఇతర శాఖల నుంచి రూ.4,606 కోట్ల ఆదాయం లభించింది. వాణిజ్య పన్నుల శాఖతో కలుపుకుంటే (రూ.2,873 కోట్లు) ఇది కాస్తా రూ.7,477 కోట్లకు చేరింది. భౌగోళికంగా జిల్లా నైసర్గిక స్వరూపం పూర్తిగా హైదరాబాద్‌కు ఆనుకొని ఉండడంతో ప్రభుత్వ ఖజానాలో సింహభాగం జిల్లా నుంచేజమఅవుతోంది. రాష్ట్రంలోనే రాబడిలో టాప్‌గా నిలుస్తున్నప్పటికీ, నిధుల మంజూరులో మాత్రం జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోంది. కేవలం మొక్కుబడిగా నిధులు విదిలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి.
ఖజానాకు కాసుల గలగల రాజధానికి చేరువలో జిల్లా ఉండడంతో శరవేగంగా నగరీకరణ చెందుతోంది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయంలో అత్యధికం జిల్లా నుంచే వస్తోంది. భూముల విలువలు అనూహ్యంగా పెరిగిపోతుండడంతో ఖజానా నింపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ యేటికాయేడు మార్కెట్ ధరలను సవరిస్తోంది. రంగారెడ్డి జిల్లాను దృష్టిలో ఉంచుకునే సర్కారు ఈ ఎత్తుగడను అమలు చేస్తోందన్నది స్పష్టం. ఈ క్రమంలోనే రిజిస్ట్రేషన్ల శాఖ పంట పండుతోంది. మరోవైపు రవాణా శాఖకు కూడా ప్రధాన ఆదాయ వనరు మన జిల్లానే. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు, జీవితపన్ను, త్రైమాసిక పన్నులతో రవాణా శాఖ కోశాగారం నిండుతోంది. ఇంకోవైపు అబ్కారీ శాఖకు పుష్కలంగా ఆదాయం సమకూరుతోంది కూడా జిల్లా నుంచే. లెసైన్సు, ప్రివిలేజ్ రుసుముల రూపేణా అబ్కారీ శాఖ దండుకుంటోంది. నగరీకరణ నేపథ్యంలో మద్యప్రాన ప్రియులు కూడా భారీగా పెరుగుతుండడం ఎక్సైజ్‌శాఖకు కాసుల పంట పండుతోంది.
మరోవైపు ల్యాండ్ రెవెన్యూలోనూ రంగారెడ్డి జిల్లాదే అగ్రపథం. నాలా పన్నులు, భూ వినియోగమార్పిడి ఫీజులు తదితర పన్నుల పేర జిల్లాకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. వ ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూములకు ‘నాలా’ చట్టాన్ని వర్తింప జేస్తుండడంతో సర్కారుకు కలిసివస్తోంది. ఫలితంగా ల్యాండ్ రెవెన్యూలోనూ మన జిల్లా వాటానే అధికంగా ఉంటోంది. ఇక వాణిజ్య పన్నుల వసూళ్లలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా కొనసాగుతోంది. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు జిల్లావ్యాప్తంగా విస్తరించడంతో కమర్షియల్ టాక్స్ వసూళ్లు దండిగా ఉంటున్నాయి.
విడిపోతే ఎలా?
ప్రస్తుతం రాష్ర్టంలోనే అత్యధిక రాబడి మన జిల్లా నుంచే నమోదవుతున్నప్పటికీ, భవిష్యత్తులో దీంట్లో మార్పులు జరిగే అవకాశాల్లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో కొన్ని హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయంటున్నారు. ఐదేళ్లుగా ఒడుదొడుకులను ఎదుర్కొని ఇటీవల కోలుకున్న స్థిరాస్తి రంగం తెలంగాణ ప్రకటనతో మళ్లీ ఆటుపోట్లకు లోనవుతోంది. 20 రోజులుగా భూముల క్రయవిక్రయాలపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఇదే పరిస్థితి రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తైసాధారణ పరిస్థితులు నెలకొనేవరకు ఈ రంగానికి పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఇక ఎక్సైజ్ శాఖ రాబడిలో పెద్దగా వ్యత్యాసం లేనప్పటికీ, ప్రధాన ఆదాయ వనరుగా నిలిచే వాణిజ్య పన్నుల్లో భారీ మార్పు నమోదు కావచ్చు. పెట్రోలియం ఉత్పత్తుల విక్రయాలకు సంబంధించి జిల్లాలవారీగా డీలర్‌షిప్‌లున్నా వాటి ఆయిల్ డిపోలు మన జిల్లాలో ఉన్నాయి. ఫలితంగా ఇక్కడి నుంచి పెట్రోలు, డీజిల్ తదితర ముడిచమురును కొనుగోలు చేసే డీలర్లు విధిగా ఆ డిపోల పరిధిలో వ్యాట్ చెల్లిస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో నమోదు కావాల్సిన వ్యాట్ మన జిల్లాలో జమ అవుతోంది. రాష్ట్ర విభజన జరిగి తే ఈ ఆదాయంలో భారీ సవరణలు జరిగే అవకాశ ముంది. ఈ పన్నులన్నీ ఏ జిల్లాకు ఆ జిల్లాలోనే చెల్లిస్తే ఆదాయం నమోదులో మార్పు తప్పకపోవచ్చు.
నిధుల్లో వాటా పెరగాల్సిందే!
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు నిధులు సమకూరుస్తున్న రంగారెడ్డి జిల్లాకు దీర్ఘకాలంగా అన్యాయం జరుగుతోంది. అత్యధిక రాబడి సాధిస్తున్నప్పటికీ, ఆ నిష్పత్తిలో నిధుల వాటా రావడంలేదు. ఫలితంగా శివార్లు మినహా.. గ్రామీణ ప్రాంతాలు ఇప్పటికీ కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలు మౌలిక సదుపాయాల్లేక అల్లాడుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రంలోనైనా సమపాళ్లలో నిధులు రాబట్టడంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరముంది.
జిల్లాలో వివిధ శాఖల నుంచి వస్తున్న ఆదాయం (రూ.కోట్లలో)
వాణిజ్యపన్నులు 2,872.66
స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 1,809.76
ఎక్సైజ్ 2,004
రవాణ 600.43
గనులు 107.36
అటవీశాఖ 63.48
ల్యాండ్ రెవెన్యూ 19.57
రాబడిలో టాప్!
Published Sun, Aug 25 2013 1:13 AM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement
Advertisement