చెల్లింపులన్నీ బంద్!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఉమ్మడి రాష్ట్ర ఖజానా ఖాతా బంద్ అయింది. జీతాలు, వేతనాలు, బిల్లుల చెల్లింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. జూన్ 2న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడనుండటంతో చెల్లింపులు నిలిచిపోయాయి. ఏపీ ఖజానా శాఖ కొత్త ఖాతా తెరిచేవరకు ఎలాంటి చెల్లింపులు జరగవు, ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లకు పింఛన్లు, ఇతరరత్రా బిల్లులు చెల్లింపులు పూర్తయింది. ఏపీ ఖజానా శాఖ కొత్త ఖాతా తెరిచి లావాదేవీలు ప్రారంభమయ్యేందుకు ఎన్నిరోజులు పడుతుందన్నది ఆ శాఖ అధికారులే చెప్పలేకపోతున్నారు.
కనీసం జూన్ పదో తేదీ వరకు ఎలాంటి లావాదేవీలు జరగకపోవచ్చని సమాచారం. రాష్ట్ర విభజన కారణంగా ఈ నెల 24వతేదీతో ఖజానా చెల్లింపులు నిలిపివేయాలని అధికార యంత్రాంగం తొలుత నిర్ణయించింది. అయితే అప్పటికి చాలా లావేదేవీలు పూర్తికాకపోవటం, సర్వర్ సమస్యల వల్ల గడువును మరో రెండు రోజులు పొడిగించింది. తాజా గడువు సోమవారంతో ముగిసింది. ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పింఛన్ల చెల్లింపులకు అధికార యంత్రాంగం ప్రాధాన్యమిచ్చింది. సమయం చాలకపోవటంతో వివిధ శాఖలు చేపట్టిన పనులు..
శాసనసభ్యులు, ఎంపీల నియోజకవర్గ అభివృద్ధి పనుల బిల్లులు.. ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్‌మెంట్, ఇతర బిల్లుల చెల్లింపులు జిల్లాలో సుమారు రూ.30 కోట్ల మేర నిలిచిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగి లేదా పింఛన్‌దారు మరణించినా వారి దహన సంస్కారాల కోసం ఇవ్వవలసిన ఆర్థిక సహాయాన్ని అందించటానికి కూడా ప్రస్తుతం అవకాశం లేదు. మరీ అత్యవసరంగా ఏమైనా చెల్లింపులు చేయాల్సి వస్తే జిల్లా అధికారులు ఖజానా శాఖ కమిషనరేట్ దృష్టికి తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బిల్లులు నిలిచిపోవటంతో జిల్లాలోని కాంట్రాక్టర్లు, గ్రామ సర్పంచ్‌లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పనులు నిలిపివేసినవారు ఆర్థిక భారం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.