న్యూఢిల్లీ: నల్లధనం వెల్లడికి గతేడాదితో ముగిసిన ఏకకాల గవాక్ష విధానం ద్వారా 644 సంస్థల ఖాతాల నుంచి రూ. 2,428.4 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ మొత్తం గతేడాది డిసెంబర్ 31 వరకూ వచ్చినదని ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. అయితే ఈ విభాగంలోని రాబడిలో కొంత తగ్గుదల ఉందని పేర్కొంది. డిక్లరేషన్లు ఇచ్చిన 644 సంస్థలు రూ. 4,164 కోట్లు చెల్లించాల్సి ఉందని, అయితే ఏకకాలగవాక్ష విధానం ద్వారా ఆ సంస్థల ఆస్తులపై ట్యాక్స్ 30 శాతం, పెనాల్టీ 30 శాతం చెల్లించాల్సి ఉండటం వల్ల డిసెంబర్ 31 వరకూ రూ. 2,428.4 కోట్లు వచ్చిందని తెలిపింది. అయితే ఈ మొత్తం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.
కాగా, నల్లధనం, పన్ను విధింపు చట్టం గతేడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ చట్టం ప్రకారం ఏకకాల సమ్మతి గవాక్ష విధానం ద్వారా తమ నల్లధన ఖాతాల వివరాలను సంస్థలు వెల్లడించి పన్ను, పెనాల్టీ చెల్లించి శిక్ష తప్పించుకోవచ్చు. వివరాలు వెల్లడించని వారు తర్వాత భారీ పెనాల్టీతో పాటు శిక్ష కూడా అనుభవించాల్సి ఉంటుంది.
నల్ల ఖాతాల నుంచి రూ. 2,428 కోట్ల పన్ను
Published Thu, Jan 7 2016 2:07 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
Advertisement