బ్రోచర్‌ను విడుదల చేస్తున్న రామకృష్ణ
దొండపర్తి(విశాఖ దక్షిణ): ప్రజలకు సులభతర, సురక్షిత రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే కార్డు–2.0 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ రామకృష్ణ తెలిపారు. నూతన దస్తావేజుల రిజిస్ట్రేషన్ విధానం కార్డు–2.0పై ఉన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన విధానం, సాఫ్ట్‌వేర్ పనితీరు, దాని ప్రయోజనాలను వివరించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో అప్పటి అవసరాలకు తగినట్లుగా రూపొందించిన రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నామని చెప్పారు. అయితే, రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటికీ చెక్‌పెట్టి, మెరుగైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో రెండువేల గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా సులువుగా దస్తావేజుల తయారీ నుంచి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందుగానే అపాయింట్‌మెంట్ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రధానంగా చిన్నచిన్న కారణాలతో దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించే అవకాశం ఉండదని ఐజీ వివరించారు.
ప్రయోగాత్మకంగా 23 చోట్ల..
ఈ కార్డు–2.0ను ప్రయోగాత్మకంగా 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిషేధిత భూములు, స్టాంప్ డ్యూటీ విలువ, మార్కెట్ విలువ, డాక్యుమెంట్ జనరేషన్, సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆటో మ్యుటేషన్ ఇలా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఎటువంటి ఫిర్యాదులు, ఇబ్బందులు తలెత్తలేదని ఐజీ రామకృష్ణ చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు.
విష ప్రచారాన్ని నమ్మొద్దు
ఇక కార్డు–2.0పై కొంతమంది మిలిటెంట్ తరహాలో విషప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్‌లైన్, ఈ–సైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను తనఖా సంస్థలు, బ్యాంకులు అంగీకరించవన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 వచ్చిన తరువాత ఈ–సైన్ ద్వారా ప్రజలు దస్తావేజుల మీద సంతకాలు చేయవచ్చని తెలిపారు.
ఈ నూతన విధానం ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అదే విధంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి దూరమవుతుందనడంలో నిజంలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ బాలకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment