వివాహ రిజిస్ట్రేషన్ల కోసం అవస్థలు..తప్పని తిప్పలు
Published Thu, Sep 5 2013 3:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో గత నెలరోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి పెళ్లి నిమిత్తం వచ్చినవారు ఈ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నాక భార్యను తీసుకెళ్లేందుకు వీసా కోసం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలి.
శ్రావణమాసంలో శుభముహూర్తాలు ఉండటంతో గత పక్షం రోజుల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయకపోవడంతో చాలామంది ఏంచేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల్ని కలిసి సమస్యను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ ప్రాంతంవారైనా హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
వాస్తవానికి వధూవరుల్లో ఎవరోఒకరు నివాసముంటున్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయాలనే నిబంధన ఉంది. అయితే 2011లో తెలంగాణలో సకల జనుల సమ్మె సందర్భంగా 42 రోజులపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు. అప్పుడు ప్రవాసాంధ్రులు, ఇతరుల నుంచి వచ్చిన వినతుల మేరకు రాష్ట్రం లోని ఏప్రాంతంవారైనా సీఐజీ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ చేయిం చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం సీమాంధ్రలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడినందున అత్యవసర వివాహ రిజిస్ట్రేషన్ అవసరమైనవారు హైదరాబాద్‌లోని సీఐజీ కార్యాలయానికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
Advertisement
Advertisement