అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలు ‘మీ సేవ’కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖకులు గురువారం నుంచి చేపట్టిన మూడు రోజుల పెన్‌డౌన్ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్లపై పడింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్‌రిజిస్ట్రార్ (ఎస్‌ఆర్) కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రజలు లేక కార్యాలయాలు బోసి పోయాయి. లేఖకులు తమ ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయడంతో ఎప్పుడూ కిటకిటలాడుతుండే ఆ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. పెన్‌డౌన్ కారణంగా తొలిరోజున స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.50 లక్షల పైగానే ఆదాయానికి బ్రేక్ పడింది. మలి రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.
మూడు రోజుల పాటు కొనసాగనున్న పెన్‌డౌన్‌తో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలకు రూ1.50 కోట్లు పైగానే ఆదాయానికి బ్రేక్‌పడుతుంది. ప్రతి రోజూ జిల్లా పరిధిలోని 21 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 900 నుంచి వెయ్యి వరకు దస్తావేజు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని రెండు ఎస్‌ఆర్‌లు, రూరల్ ఎస్‌ఆర్ కార్యాలయంలో ప్రతి రోజూ 100 నుంచి 200 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి.
ఆదాయంలో అధిక శాతం ఈ రెండు కార్యాలయాల నుంచే వస్తుంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం రోజుకు రూ.15 లక్షలకు పైగా ఉంటుంది. రూరల్‌తో పాటు, జిల్లాలోని రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని అన్ని ఎస్‌ఆర్‌లో రూ.35 లక్షలకు పైగానే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుంది. భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దస్తావేజు లేఖకులే కీలకంగా ఉన్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా వీరి సహకారంతోనే నడుస్తుంది. ప్రజలు తమ భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తిగా దస్తావేజు లేఖకుల ద్వారానే సిద్ధం చేయిస్తారు. లేఖకులు పెన్‌డౌన్‌కు దిగడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి బ్రేక్ పడింది.
‘రిజిస్ట్రేషన్’ ప్రైవేటీకరణ.. కడపు కొట్టే చర్య
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవలను ‘మీ సేవ’కు అప్పగించాలన్న ప్రభుత్వ ఆలోచన దస్తావేజు లేఖకుల (డాక్యుమెంట్ రైటర్‌స) కడుపుకొట్టేలా ఉందని దస్తావేజు లేఖకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జె.ప్రసాద్ అన్నారు. తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖకులు గురువారం నుంచి మూడు రోజులపాటు పెన్‌డౌన్ చేపట్టారు. ఆందోళనలో భాగంగా అనంతపురంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దస్తావేజు లేఖకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జె.ప్రసాద్ మాట్లాడుతూ దస్తావేజులు రాసే వృత్తిపై ఆధారపడి వేలాదిమంది జీవిస్తున్నారన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సేవలన్నీ ‘మీ సేవ’కు అప్పగించి తమను వీధినపడేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆగ్రహించారు. తమ బాధను అర్థం చేసుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సంఘం నాయకులు హరినాథ్‌బాబు, వేణుగోపాల్, డి.కె.సుధాకర్, ప్రభాకర్‌స్వామి, బాబా, జగదీశ్వరప్రసాద్, కుమార్, రాధాకృష్ణ, నటేష్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము
దస్తావేజు లేఖకుల పెన్‌డౌన్‌కూ, రిజిస్ట్రేషన్లకూ సంబంధం లేదు. దస్తావేజులను ప్రజలు సిద్ధం చేసుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎవరినీ వెనక్కి పంపించం.
- పెద్దన్న, జిల్లా రిజిస్ట్రార్, అనంతపురం
రిజిస్ట్రేషన్లకు బ్రేక్
Published Fri, Dec 27 2013 3:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement