
సమైక్య సమ్మెతో 13 జిల్లాల్లో స్తంభించిన పాలన
* మూతపడ్డ ప్రభుత్వాఫీసులు... నిలిచిన పౌరసేవలు
* రోడ్డెక్కని ఆర్‌టీసీ బస్సులు.. బోసిపోయిన బస్టాండ్లు
* తిరుమలకూ తిరగని బస్సులు.. పుణ్యక్షేత్రం వెలవెల
* తెరుచుకోని విద్యా సంస్థలు.. పనిచేయని బ్యాంకులు
* అన్ని జిల్లాల్లో భారీగా ఉద్యోగుల ధర్నాలు, ర్యాలీలు
* సోనియా, దిగ్విజయ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలు దహనం
* ఆర్‌టీసీకి రోజుకు రూ. 13 కోట్ల మేర ఆదాయ నష్టం
* రాజధానిలో పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్‌జీవోలు ఇచ్చిన సమ్మె పిలుపుతో మంగళవారం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సకలం బంద్ అయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్‌టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సీమాంధ్ర పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్‌టీసీ బస్టాండ్లు బోసిపోయాయి. పంచాయతీ మొదలు జిల్లా కేంద్రం వరకూ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మునిసిపాలిటీల్లో పౌరసేవలు ఆగిపోయాయి. ఒక్క ఆర్‌టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్, డీజిల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.
ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ. 150 కోట్ల రాబడి నిలిచిపోయింది. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలకు అంతరాయం కలిగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో వివిధ ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా ర్యాలీలు, నిరాహార దీక్షలు నిర్వహించాయి. ఆందోళనకారులు కూడళ్లలో మానవహారాలు, రహదారులపై వంటావార్పులు, ఆటపాటలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మొదటి రోజు సమ్మె పూర్తిగా విజయవంతం అయింది. బంద్ ప్రభావం రైలు ప్రయాణంపై కూడా కనిపించింది. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీగా సమ్మెలో పాల్గొన్న టీచర్లు...
ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొనే విషయంలో ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ టీచర్లు సైతం పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాయాల బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో ఉండటంతో తరగతులు జరగలేదు. పలు జిల్లాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి. పదమూడు జిల్లాల్లోనూ బ్యాంకులు మూతపడటంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఎస్‌పీ కార్యాలయాల్లోని మినిస్టీరియల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా పోలీసు కార్యాలయాల్లో పాలనా కార్యకలాపాలకు విఘాతం కలిగింది.
ఆర్‌టీసీలోని ప్రధాన యూనియన్లు.. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సమ్మెలో ఉండటంతో 13 జిల్లాల్లో ఆర్‌టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరుపతి, తిరుమల మధ్య కూడా ఆర్‌టీసీ బస్సులు తిరగలేదు. ఆర్‌టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సమ్మెకు మద్దతు ప్రకటించకపోవటంతో.. నెల్లూరులో మంగళవారం 102 బస్సులు నడిచాయి. సీమాంధ్రలో ఉద్యమం వల్ల ఇప్పటి వరకు ఆర్‌టీసీ రూ. 98 కోట్ల రాబడిని కోల్పోయిందని.. ఇప్పుడు సమ్మె వల్ల 13 జిల్లాల్లో బస్సులు పూర్తిగా నిలిచిపోతే రోజూ రూ. 13 కోట్ల రాబడి కోల్పోతామని, ఆర్‌టీసీ ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆ సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ విజ్ఞప్తి చేశారు.
జిల్లాల్లో సమ్మె సంపూర్ణం
విశాఖ జిల్లాలో 40 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రీజియన్‌లో సుమారు 1,060 బస్సులు నిలిచిపోయాయి. బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోవటంతో మంగళవారం ఒక్క రోజే సుమారు రూ. 350 కోట్ల మేరకు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనగా.. 482 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి, ప్రైవేట్ వాహనాలు కూడా చాలావరకు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.
విజయనగరం జిల్లాలో 17 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. విజయనగరం జోన్ పరిధిలో 2,800 బస్సులు నిలిచిపోయాయి. ఆర్‌టీసీ సుమారు రూ. 2.7 కోట్ల ఆదాయం కోల్పోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 615 ఆర్‌టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయూరుు. జిల్లా వ్యాప్తంగా కూరగాయల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవటంతో రూ. 25 లక్షల మే ర టర్నోవర్ నిలిచిపోయింది. తూర్పుగోదావరిలో 45 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా, మరో 19 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రాజమండ్రిలో నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు.
విజయవాడలో వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 1,200 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఎన్‌టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిబ్బంది జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లాలో 25,200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి భారీ మానవహారంతో నిరసన తెలిపారు. కోల్డ్‌స్టోరేజీల బంద్‌తో మిర్చియార్డులో వ్యాపార లావాదేవీలు జరగలేదు. ప్రకాశం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది ఏపీఎన్‌జీవోలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగడాల ర్యాలీ నిర్వహించారు.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుసగా 14వ రోజు మంగళవారం బంద్ పాటించారు. అనంతపురం జిల్లాలో 870 బస్సులు రోడ్డెక్కలేదు. వైఎస్సార్ కడపలో ఆర్‌టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 29 వేల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే 10వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. 1,350 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.
పుణ్యక్షేత్రాలు వెలవెల
ఉద్యోగుల సమ్మె ప్రభావం ఆధ్యాత్మిక క్షేత్రాలపై తీవ్రంగా కనిపించింది. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల కొండ బోసిపోయింది. శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో ఎక్కడా సందడి కనిపించలేదు. శ్రీవారి సర్వదర్శనం మూడు గంటల్లోనే లభిస్తోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కాణిపాకం, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కూడా వెలవెలబోయాయి. పదుల సంఖ్యలో కూడా భక్తులు రాలేదు. భీమవరంలోని మావుళ్లమ్మ, నిడదవోలులోని కోట సత్తెమ్మ, జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి తదితర క్షేత్రాలు నిర్మానుష్యంగా కనిపించారుు.
హైదరాబాద్ సమ్మెలో స్వల్ప ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ప్రభావం హైదరాబాద్‌లో స్వల్పంగానే కనిపించింది. అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు మంగళవారం యథావిధిగా పనిచేశాయి. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో కొద్ది సంఖ్యలో సీమాంధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేయటానికే పరిమితమయ్యారు. శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో 30 మంది సీమాంధ్ర ఉద్యోగులు కాసేపు నిరసన ప్రదర్శనలు చేశారు.
నాంపల్లిలోని గృహకల్ప, జలసౌధ, డీఎంహెచ్‌ఓ కార్యాలయాల వద్ద సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విద్యుత్‌సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు వేర్వేరుగా భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సీఎం
సమ్మె నేపథ్యంలో విద్యుత్, నీటి సరఫరా, వైద్య సేవలు, రవాణా, పౌర సరఫరా.. తదితర శాఖల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆర్‌టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సమ్మె పరిస్థితులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమ్మె చేస్తే కఠిన చర్యలు: ప్రభుత్వం
సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ నెల 8న మెమో (నంబర్ 25994) జారీ చేశారు. ‘నో వర్క్.. నో పే’ అంటూ 2011 ఏప్రిల్ 13న జారీ చేసిన 177 జీవో అమల్లో ఉందని, జీవోలోని అంశాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. సమ్మె జరిగే రోజుల్లో జిల్లాలో పరిస్థితిని వివరిస్తూ రోజువారీ నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ఈ ఆదేశాలపై సీమాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ‘‘ప్రభుత్వానికి ముందస్తుగా నోటీసు ఇచ్చి సమ్మెలో పాల్గొనే హక్కు ఉద్యోగులకు ఉన్న ప్రజాస్వామిక హక్కు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయటం అణచివేత చర్యే. వెంటనే ఈ నల్ల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’’ అని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు.