నిషేధం జీవోలు సీమాంధ్ర ఉద్యోగులకు వర్తించవా?
నిషేధం జీవోలు సీమాంధ్ర ఉద్యోగులకు వర్తించవా?
Published Wed, Aug 7 2013 3:09 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదంటూ సకల జనుల సమ్మె సమయంలో నల్ల జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులకు వాటిని ఎందుకు వర్తింప జేయట్లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రశ్నించింది. తెలంగాణ పట్ల వివక్షతకు ఇంతకంటే నిదర్శనం ఉండబోదని పేర్కొంది. జేఏసీ కార్యవర్గ అత్యవసర సమావేశం మంగళవారం టీఎన్జీవో భవన్‌లో దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగింది. అనంతరం జేఏసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, విఠల్‌తో కలిసి దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు.
సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగులకు న్యాయమైన వాటా దక్కలేదని తాము చాలాసార్లు చెప్పామని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలను చూస్తేనే.. సీమాంధ్ర ఉద్యోగుల సంఖ్య ఎంత ఉందనేది అర్థమవుతోందన్నారు. సీమాంధ్రులు అభివృద్ధి పేరిట హైదరాబాద్‌లో వాటా అడగడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తిరుమల వెళ్లి స్వామివారికి ముడుపులు చెల్లిస్తారని, అందువల్ల తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేశామంటూ తెలంగాణవారు వాటా అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించారు.
హైదరాబాద్‌లో వాటా కావాలంటూ సీమాంధ్రులు వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సభ పెడితే.. తాము కూడా అదేరోజున లక్షలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసుపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడానికి 12న సమావేశం కానున్నామని తెలిపారు.
సీమాంధ్ర ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని దేవీప్రసాద్ ఆరోపించారు. అయినప్పటికీ సంయమనం పాటించాల్సిందిగా తెలంగాణ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. విభజన నిర్ణయం నుంచి కేంద్రం వెనుకడుగు వేస్తే సమ్మె కంటే తీవ్ర ఉద్యమం నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు.
Advertisement