ప్రొద్దుటూరు : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి సగం సీట్లే భర్తీ అయ్యాయి. మరికొన్ని కళాశాలలు సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా రెండో కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం విద్యార్థులకు సీట్ అలాట్‌మెంట్ చేస్తూ సెల్ ద్వారా సమాచారం అందించారు. ఇదిలావుండగా చాలా మంది విద్యార్థులు తమ సెల్‌కు మెసేజ్ రాలేదని కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చారు. వెబ్ ఆప్షన్ల నమోదుపై సరైన వగాహన లేని కారణంగా చాలా మంది విద్యార్థులు నష్టపోయారు.
గత ఏడాదిని దృష్టిలో ఉంచుకుని 10-15 వేల మధ్యలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులు తక్కువ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వారికి సీటు రాకపోవడంతో తొలివిడత కౌన్సెలింగ్‌లో నష్టపోయారు. వాస్తవానికి ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుగా ప్రారంభం కావడంతోపాటు ఎన్‌ఐటీ, ఐఐటీ కౌన్సెలింగ్ కూడా జరగకపోవడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ విషయంపై సరైన అవగాహన లేని విద్యార్థులు తమ ర్యాంక్‌కు సీటు వస్తుందని భావించి తక్కువ ఆప్షన్లు ఇచ్చుకుని నష్టపోయారు.
శుక్రవారం ప్రొద్దుటూరులోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చిన ఓ విద్యార్థి ఈ విషయంపై మాట్లాడుతూ తనకు 10వేలకుపైగా ర్యాంక్ వచ్చిందని, తాను బీసీ కేటగిరికి చెందిన వాడిని కావడంతో ఆరు కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకోగా ఎక్కడా సీటు అలాట్ కాలేదన్నారు. దీనిపై హెల్ప్ లైన్ సెంటర్ అధికారులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 3 వేల వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, సరైన అవగాహన లేకపోతే నష్టపోతారన్నారు. రెండో కౌన్సెలింగ్‌లోనైనా జాగ్రత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు.
సగం సీట్లే భర్తీ
జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి తొలివిడత కౌన్సెలింగ్‌లో దాదాపు సగం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ, పులివెందులలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఇవికాక జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 10 వేల సీట్లు ఉన్నాయి. కడప, రాజంపేట పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే బ్రాంచిల వారిగా 3 అంకెల సంఖ్యలో విద్యార్థులు చేరారు.
మరో 3, 4 కళాశాలలకు సంబంధించి బ్రాంచిల వారిగా సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం గమనార్హం. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ బ్రాంచికి రెండు, మరో రెండు బ్రాంచిలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం నలుగురు విద్యార్థులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మరికొన్ని కళాశాలల్లోని బ్రాంచిలకు సంబంధించి ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంతో వెబ్‌సైట్‌లో అలాంటి వివరాలే కనిపించలేదు. కాగా సీట్లు ఎక్కువగా భర్తీ అయిన కళాశాలల్లో మేనేజ్‌మెంట్ కోటాకు సంబంధించి అధికంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు ముందు రూ.50 వేలు చెప్పారని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 70 వేలకు పెంచారని ఓ విద్యార్థి తండ్రి శుక్రవారం తెలిపారు. మెకానికల్, ఈసీఈ, సీఎస్‌ఈ, సివిల్ బ్రాంచిలపై విద్యార్థులు ఎక్కువగా దృష్టి సారించారని అధ్యాపక వర్గాలు తెలిపాయి.
రెండో కౌన్సెలింగ్ పైనే ఆశలు
Published Sat, Jun 27 2015 4:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:25 AM
Advertisement