సాక్షి, చెన్నై:ప్లస్ టూ పరీక్షా ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. దీంతో ఉన్నత చదువులను అంది పుచ్చుకోవాలన్న ఆశతో ఏ కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఏ కళాశాలలో చేరాలన్న ప్రయత్నాల్లో విద్యార్థు లు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులైన బీఈ, బీటెక్‌ల ప్రవేశ నిమిత్తం అన్నా వర్సిటీ నేతృత్వంలో ఉన్నత విద్యా శాఖ కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో విద్యార్థుల దృష్టి ఆ వర్సిటీ పరిధిలోని కళాశాల మీద పడింది. ఏ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతోంది, అక్కడి పరిస్థితుల ఎలా ఉన్నయన్న విషయూలపై ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిధిలోని 525కు పైగా కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశం నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి అన్నా వర్సిటీ శ్రీకారం చుట్టింది. శనివారం 8.30 గంటలకు దరఖాస్తుల విక్రయానికి సమయం నిర్ణయించారు. అయితే, వేకువ జామునే పెద్ద ఎత్తున విద్యార్థుల ఆ వర్సిటీకి పోటెత్తారు. దీంతో 5.30 గంటలకే దరఖాస్తుల విక్రయాలను ప్రారంభించారు.
60 కేంద్రాల్లో: ఇంజనీరింగ్ చదవాలన్న కాంక్షతో ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దరఖాస్తులను సులభంగా స్వీకరించే విధంగా అన్నా వర్సిటీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 కేంద్రాల్లో దరఖాస్తులను విక్రయిస్తోంది. అన్నావర్సిటీలో 20 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రత్యేక క్యూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కౌంటర్ సిద్ధం చేశారు. పురసై వాక్కం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బ్రాడ్ వే భారతీ మహిళా కళాశాలలోనూ దరఖాస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు.
ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన తరగతుల విద్యార్థులు కులధృవీకరణ పత్రం చూపించడంతోపాటుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర తరగతుల విద్యార్థులు రూ.500 చెల్లించి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుంది. జూన్‌లో కౌన్సెలింగ్ : దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో కౌన్సెలింగ్ జూన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉదయం దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టినానంతరం విలేకరులతో అన్నా వర్సిటీ వీసీ రాజారాం విలేకరులతో మాట్లాడారు. తమ వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఆయా కళాశాలల్లో కల్పించిన మౌళిక వసతులు, విద్యా వ్యవహారాలకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కోటాగా రెండు లక్షల సీట్లు ఉన్నట్టు వివరించారు.
జూన్ మొదటి వారంలో ర్యాండమ్ నెంబర్ల జాబితాను, అనంతరం ర్యాంకుల జాబితాను వెలువరించనున్నామన్నారు. జూన్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించి జూలై 30న ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ దరఖాస్తులు 32 జిల్లాల్లో 60 సెంటర్లలో ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు వరకు విక్రయించనున్నామన్నారు. అదే రోజున దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. గత ఏడాది 2,35,211 దరఖాస్తులు ముద్రించామని, ఈ ఏడాది అదనంగా 14,789 దరఖాస్తులు ముద్రించి, మొత్తం 2.5 లక్షలు సిద్ధం చేశామని వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు లక్ష్యంగా పాఠ్యాంశాల్లో సరికొత్త మార్పులు చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది లక్షా 90 వేల 850 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో లక్షా 84 వేల 930 మంది ఎంపిక చేసినట్టు వివరించారు. సెలవు దినాల్లో మినహా తక్కిన అన్ని రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర గంటల వరకు దరఖాస్తుల విక్రయం, స్వీకరణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య, కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు కుమార్ జయంత్, రైమన్ ఉదయ కృష్ణ రాజ్‌లు పాల్గొన్నారు.
దరఖాస్తులకు శ్రీకారం
Published Sat, May 3 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 6:53 AM
Advertisement
Advertisement