be
-
‘గుడా’ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించాలి
ఎమ్మెల్యేలు మద్దతు లేఖలతో సరిపెట్టకూడదు రాజమహేంద్రవరంలో ఏర్పాటుతో ‘గుడా’ పేరుకు సార్థకత విలేకర్ల సమావేశంలో అఖిలపక్ష నేతలు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేద్రవరం నగరపాలకసంస్థ పాలక మండలి సాధారణ సమావేశంలో గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (గుడా) కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అజెండాలో పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని అఖిల పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. గోదావరి నది పేరుతో పెట్టిన గుడా కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని ఆనం రోటరీ హాల్లో నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు ‘గుడా’ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని అజెండాలో పెట్టినట్టు తెలిపారు. ఇందుకు మద్దతుగా సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు లేఖలు ఇచ్చారని చెప్పారు. మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలు రాలేదని, రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్లో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. వైఎస్సార్సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం పరిపాలన తీరుతో స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చి సరిపెట్టకుండా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కొంత మంది నేతలు గుడా కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినా మద్దతు తెలుపుదామంటున్నారని, గోదావరి తల్లి పేరుతో ఉన్న గుడా కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడమే సరైన నిర్ణయమన్నారు. అలాంటి నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు, తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాజకీయ నేతలు దృష్టి సారిస్తే ఆ హామీలలో కొన్నయినా కార్యరూపం దాల్చేవని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరంలోనే గుడా కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమన్నారు. గుడా కార్యాలయం ఏర్పాటుకు తమ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికైనా సిద్ధమని వైఎస్సార్సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు చెప్పారు. ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ లేఖలు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గుడా కార్యాలయం సాధించే వరకు ఎమ్మెల్యేలు ముందుండాలని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు కోరారు. ఈ అంశానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ Ðవెంకట సుబ్బారాయుడు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, వైఎస్సార్సీపీ నేతలు పెంకే సురేష్, మజ్జి అప్పారావు, వాకచర్ల కృష్ణ, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, కోడికోట, ఆరీఫ్, కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల భాగ్యలక్ష్మి, అధ్యాపకులు విక్టర్‌బాబు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ సునీల్, బీజేపీ నేత మట్టాడి జయప్రకాష్, ఆర్ఎంపీ డాక్టర్ బళ్లా శ్రీనివాస్, మీడియా ఇన్చార్జి ఆర్.నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తులకు శ్రీకారం
సాక్షి, చెన్నై:ప్లస్ టూ పరీక్షా ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. దీంతో ఉన్నత చదువులను అంది పుచ్చుకోవాలన్న ఆశతో ఏ కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఏ కళాశాలలో చేరాలన్న ప్రయత్నాల్లో విద్యార్థు లు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులైన బీఈ, బీటెక్‌ల ప్రవేశ నిమిత్తం అన్నా వర్సిటీ నేతృత్వంలో ఉన్నత విద్యా శాఖ కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో విద్యార్థుల దృష్టి ఆ వర్సిటీ పరిధిలోని కళాశాల మీద పడింది. ఏ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతోంది, అక్కడి పరిస్థితుల ఎలా ఉన్నయన్న విషయూలపై ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిధిలోని 525కు పైగా కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశం నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి అన్నా వర్సిటీ శ్రీకారం చుట్టింది. శనివారం 8.30 గంటలకు దరఖాస్తుల విక్రయానికి సమయం నిర్ణయించారు. అయితే, వేకువ జామునే పెద్ద ఎత్తున విద్యార్థుల ఆ వర్సిటీకి పోటెత్తారు. దీంతో 5.30 గంటలకే దరఖాస్తుల విక్రయాలను ప్రారంభించారు. 60 కేంద్రాల్లో: ఇంజనీరింగ్ చదవాలన్న కాంక్షతో ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దరఖాస్తులను సులభంగా స్వీకరించే విధంగా అన్నా వర్సిటీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 కేంద్రాల్లో దరఖాస్తులను విక్రయిస్తోంది. అన్నావర్సిటీలో 20 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రత్యేక క్యూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కౌంటర్ సిద్ధం చేశారు. పురసై వాక్కం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బ్రాడ్ వే భారతీ మహిళా కళాశాలలోనూ దరఖాస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన తరగతుల విద్యార్థులు కులధృవీకరణ పత్రం చూపించడంతోపాటుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర తరగతుల విద్యార్థులు రూ.500 చెల్లించి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుంది. జూన్‌లో కౌన్సెలింగ్ : దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో కౌన్సెలింగ్ జూన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉదయం దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టినానంతరం విలేకరులతో అన్నా వర్సిటీ వీసీ రాజారాం విలేకరులతో మాట్లాడారు. తమ వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఆయా కళాశాలల్లో కల్పించిన మౌళిక వసతులు, విద్యా వ్యవహారాలకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కోటాగా రెండు లక్షల సీట్లు ఉన్నట్టు వివరించారు. జూన్ మొదటి వారంలో ర్యాండమ్ నెంబర్ల జాబితాను, అనంతరం ర్యాంకుల జాబితాను వెలువరించనున్నామన్నారు. జూన్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించి జూలై 30న ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ దరఖాస్తులు 32 జిల్లాల్లో 60 సెంటర్లలో ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు వరకు విక్రయించనున్నామన్నారు. అదే రోజున దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. గత ఏడాది 2,35,211 దరఖాస్తులు ముద్రించామని, ఈ ఏడాది అదనంగా 14,789 దరఖాస్తులు ముద్రించి, మొత్తం 2.5 లక్షలు సిద్ధం చేశామని వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు లక్ష్యంగా పాఠ్యాంశాల్లో సరికొత్త మార్పులు చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది లక్షా 90 వేల 850 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో లక్షా 84 వేల 930 మంది ఎంపిక చేసినట్టు వివరించారు. సెలవు దినాల్లో మినహా తక్కిన అన్ని రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర గంటల వరకు దరఖాస్తుల విక్రయం, స్వీకరణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య, కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు కుమార్ జయంత్, రైమన్ ఉదయ కృష్ణ రాజ్‌లు పాల్గొన్నారు.