‘గుడా’ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించాలి
‘గుడా’ తీర్మానాన్ని ఏకపక్షంగా ఆమోదించాలి
Published Sat, May 13 2017 10:52 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
ఎమ్మెల్యేలు మద్దతు లేఖలతో సరిపెట్టకూడదు
రాజమహేంద్రవరంలో ఏర్పాటుతో ‘గుడా’ పేరుకు సార్థకత
విలేకర్ల సమావేశంలో అఖిలపక్ష నేతలు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేద్రవరం నగరపాలకసంస్థ పాలక మండలి సాధారణ సమావేశంలో గోదావరి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (గుడా) కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో అజెండాలో పెట్టిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని అఖిల పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. గోదావరి నది పేరుతో పెట్టిన గుడా కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినప్పుడు ఆ పేరుకు సార్థకత ఉంటుందన్నారు. ఇందుకు స్థానిక ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. శనివారం నగరంలోని ఆనం రోటరీ హాల్లో నగరపాలక సంస్థ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి అధ్యక్షతన అఖిలపక్ష నేతలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిలారెడ్డి మాట్లాడుతూ తమ విజ్ఞప్తి మేరకు ‘గుడా’ కార్యాలయం ఏర్పాటు అంశాన్ని అజెండాలో పెట్టినట్టు తెలిపారు. ఇందుకు మద్దతుగా సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు లేఖలు ఇచ్చారని చెప్పారు. మార్చి 25న జరిగిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీ నేతలు రాలేదని, రాజకీయాలకు అతీతంగా కౌన్సిల్‌లో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతన లేదన్న విషయం పరిపాలన తీరుతో స్పష్టమవుతోందన్నారు. ఎమ్మెల్యేలు లేఖలు ఇచ్చి సరిపెట్టకుండా కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కొంత మంది నేతలు గుడా కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేసినా మద్దతు తెలుపుదామంటున్నారని, గోదావరి తల్లి పేరుతో ఉన్న గుడా కార్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడమే సరైన నిర్ణయమన్నారు. అలాంటి నేతలు తమ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యుడు, రాజమహేంద్రవరం బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఎన్నికలకు ముందు, తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధికి ఇచ్చిన ఏ హామీలు నెరవేర్చలేదని గుర్తు చేశారు. రాజకీయ నేతలు దృష్టి సారిస్తే ఆ హామీలలో కొన్నయినా కార్యరూపం దాల్చేవని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ సిటీ కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు మాట్లాడుతూ అన్ని రకాల రవాణా సౌకర్యాలు ఉన్న రాజమహేంద్రవరంలోనే గుడా కార్యాలయం ఏర్పాటు చేయడం సమంజసమన్నారు. గుడా కార్యాలయం ఏర్పాటుకు తమ పార్టీ తరఫున పోరాటాలు చేయడానికైనా సిద్ధమని వైఎస్సార్‌సీపీ రూరల్ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు చెప్పారు. ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ లేఖలు ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు కార్యాలయం ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. గుడా కార్యాలయం సాధించే వరకు ఎమ్మెల్యేలు ముందుండాలని సీపీఐ నగర కార్యదర్శి నల్లా రామారావు కోరారు. ఈ అంశానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్టు చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బూర్లగడ్డ Ðవెంకట సుబ్బారాయుడు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు పిల్లి నిర్మల, ఈతకోట బాపన సుధారాణి, వైఎస్సార్‌సీపీ నేతలు పెంకే సురేష్, మజ్జి అప్పారావు, వాకచర్ల కృష్ణ, మార్తి లక్ష్మి, మార్తి నాగేశ్వరరావు, కానుబోయిన సాగర్, కాటం రజనీకాంత్, కోడికోట, ఆరీఫ్, కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల భాగ్యలక్ష్మి, అధ్యాపకులు విక్టర్‌బాబు, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ సునీల్, బీజేపీ నేత మట్టాడి జయప్రకాష్, ఆర్‌ఎంపీ డాక్టర్ బళ్లా శ్రీనివాస్, మీడియా ఇన్‌చార్జి ఆర్.నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement