ఎంసెట్ కౌన్సెలింగ్కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ : ఎంసెట్ కౌన్సిలింగ్కు లైన్ క్లియర్ అయ్యింది. ఎంసెట్ అడ్మిషన్లు ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి ప్రవేశాల నిబంధనలనే పాటించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తుతో రాజకీయాలు వద్దన్న సుప్రీంకోర్టు ... స్థానికతపై 1956 వాదన సరికాదని అభిప్రాయపడింది.
రాష్ట్ర విభజన అనేది రాజకీయ నిర్ణయమని, విభజన పేరుతో విద్యార్థులను తొలగించటం సరైంది కాదన్ని న్యాయస్థానం అభిప్రాయపడింది. కౌన్సెలింగ్ పొడిగింపు కోరటం సమంజసం కాదని, అది అనేక సమస్యలకు దారి తీస్తుందని, విద్యార్థులకు ఫీజులు చెల్లించవద్దు అనుకుంటే చెల్లించకండి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది హరీష్ సాల్వే అంగీకరించారు. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది.
కాగా ఈనెల ఏడో తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించడం, దీన్ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి విధివిధానాలను నిర్ణయించేందుకు సమయం కావాలని, అందువల్ల అక్టోబర్ ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని టీ సర్కారు వాదిస్తోంది. మరోవైపు అంత ఆలస్యం అయితే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని ఆంద్రప్రదేశ్ సర్కారు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.