ఎంసెట్‌పై తర్జనభర్జన | Confusion over EAMCET | Sakshi
Sakshi News home page

ఎంసెట్‌పై తర్జనభర్జన

Published Wed, Aug 22 2018 4:03 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM

Confusion over EAMCET - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్‌పై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. గతేడాది నుంచి ఎంబీబీఎస్, డెంటల్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం.. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ద్వారా నీట్‌ నిర్వహిస్తోంది. రెండేళ్ల క్రితం వరకు నీట్‌లో రాష్ట్రాలు పాల్గొనడం ఆప్షన్‌గా ఉండేది. కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నీట్‌ను తప్పనిసరి చేశారు. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్, డెంటల్‌ తదితర కోర్సుల సీట్లను నీట్‌ ర్యాంకుల ద్వారానే భర్తీ చేస్తున్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రం ఎంసెట్‌ నిర్వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఇంజనీరింగ్‌తోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సులన్నిటికీ ప్రవేశపరీక్షలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ని ఏర్పాటు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే..
ప్రస్తుతం ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎస్‌ఈఆర్‌లు తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న జేఈఈతోపాటు ఇతర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశ పరీక్షలు, రీసెర్చ్‌ ఫెలోషిప్‌ పరీక్షలన్నిటినీ ఎన్‌టీఏ ద్వారా నిర్వహించాలని కేంద్రం ప్రతిపాదించింది. రాష్ట్రాల్లో ఇంజనీరింగ్, తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్‌టీఏ ప్రవేశపరీక్ష ర్యాంకులను పరిగణనలోకి తీసుకోవాలన్నదే ఈ ప్రతిపాదనల ఉద్దేశం. దీనిపై రాష్ట్రం తన అభిప్రాయాలను తెలియచేయాల్సి ఉంది. కేంద్రం ప్రతిపాదనకు రాష్ట్రం ఆమోదం తెలిపితే ఇక రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కోర్సుల సీట్లను కూడా ఎన్‌టీఏ ప్రవేశ పరీక్ష ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాల్సి ఉంటుంది.

నీట్‌ తరహాలోనే ఎన్‌టీఏ ప్రవేశ పరీక్షలోనూ విద్యార్థులకు జాతీయ ర్యాంకులను, రాష్ట్ర ర్యాంకులను వేర్వేరుగా ప్రకటిస్తారని ఈ ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి సెట్స్‌ అడ్మిషన్ల వర్గాలు వివరించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌టీఏకు అంగీకరిస్తే ఎంసెట్‌కు స్వస్తి పలుకుతారు. ప్రస్తుతం దీనిపైనే ఉన్నత విద్యామండలి, ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటికే నీట్‌తో మెడికల్‌ సీట్ల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో నుంచి జారిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల ప్రవేశ పరీక్షలనూ ఎన్‌టీఏ నిర్వహిస్తే ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్ల భర్తీ అధికారం రాష్ట్రానికి లేకుండా పోతుందనే భావన ప్రభుత్వంలో ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ప్రతిపాదనలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉన్నత విద్యామండలి వర్గాలు వివరించాయి. ఒకవేళ ఎన్‌టీఏ ప్రవేశపరీక్ష ద్వారా సీట్ల భర్తీకి రాష్ట్రం అంగీకరిస్తే వచ్చే ఏడాది నుంచి ఎంసెట్‌ నిలిచిపోనుంది. 

గ్రేడింగ్‌ విధానంతో వెయిటేజీకి సమస్య
ఎన్‌టీఏ ప్రవేశపరీక్షను కాదని ఎంసెట్‌ను నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఎంసెట్‌ యథాతథంగా కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు ఎంసెట్‌ ర్యాంకుల ప్రకటనలో ఇంటర్మీడియెట్‌ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇస్తున్నారు. ఇంటర్మీడియెట్‌లో గతేడాది నుంచి మార్కుల విధానానికి బదులు గ్రేడింగ్‌ విధానానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థుల ఫలితాలను గ్రేడ్ల రూపంలోనే ప్రకటించనున్నారు. ఎంసెట్‌లో 25 శాతం మార్కుల వెయిటేజీ నిర్ణయించడానికి ఈ గ్రేడింగ్‌ల పద్ధతి సమస్యగా మారుతోంది. ఎంసెట్‌లో వెయిటేజీ కొనసాగించాలా? వద్దా అన్న చర్చ కూడా ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ పరిశీలనలో ఉందని మండలి అధికారులు వివరించారు. ఒకవేళ వెయిటేజీని కొనసాగించాలంటే ఇంటర్మీడియెట్‌ బోర్డు నుంచి అభ్యర్థుల వారీగా మార్కులను వేరుగా తెప్పించాల్సి ఉంటుందని సెట్స్‌ ప్రవేశాల అధికారి ఒకరు వివరించారు. 

రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫార్మా కోర్సుల్లో 1.38 లక్షల సీట్లు
ఎంసెట్‌లో ఎంపీసీ, బైపీసీ విభాగాల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మాడీ కోర్సులకు సంబంధించి మొత్తం 460 కాలేజీల్లో 1,38,367 సీట్లు ఉన్నాయి. ఇందులో కన్వీనర్‌ కోటా సీట్లు 96,857 ఉన్నాయి. ఇటీవల పూర్తయిన ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో కన్వీనర్‌ కోటా కింద 59,609 సీట్లు భర్తీ అవ్వగా ఇంకా 37,248 సీట్లు మిగిలిపోయాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement