ఎటూ ‘సెట్’ కాలేదు | deadlock continues over conducting eamcet exmas | Sakshi
Sakshi News home page

ఎటూ ‘సెట్’ కాలేదు

Published Sun, Jan 4 2015 1:12 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

ఎటూ ‘సెట్’ కాలేదు - Sakshi

ఎటూ ‘సెట్’ కాలేదు

ఎంసెట్ నిర్వహణపై కొనసాగుతున్న ప్రతిష్టంభన
 అధికారం మాదంటే మాది అని ఇరు రాష్ట్రాల వాదనలు
 గవర్నర్‌తో మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావు సమావేశం
 మధ్యేమార్గంగా పలు సూచనలు చేసిన నరసింహన్
 చెరో ఏడాది.. లేదంటే చెరో ఐదేళ్లు నిర్వహించుకోండి
 ఈసారికి తెలంగాణకు.. వచ్చే ఏడాది కేంద్రం చెప్పినట్లు చేయండి
 ఏదేమైనా చర్చలతోనే సమస్యకు పరిష్కారం చూపాలని సూచన
 రేపు భేటీ కానున్న ఇరు రాష్ట్రాల విద్యామంత్రులు..!
 తెలంగాణ సెట్స్ తేదీల ప్రకటన వాయిదా
 
 సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ పరీక్షల అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది.. ఇరు రాష్ట్రాలూ పట్టువిడవకుండా వ్యవహరిస్తుండడంతో వివాదం సమసిపోయే అవకాశం కనిపించడం లేదు.. శనివారం గవర్నర్ నరసింహన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు జగదీశ్‌రెడ్డి, గంటా శ్రీనివాసరావుతో సమావేశమై చర్చించినా వ్యవహారం కొలిక్కి రాలేదు. భేటీలో ఇరువురు మంత్రులూ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ అధికారం తమదేనంటూ ఎవరికి వారే వాదన వినిపించినట్లు సమాచారం. అయితే మధ్యే మార్గంగా గవర్నర్ పలుసూచనలు చేశారు. ఏ నిర్ణయమైనా సరే.. ఇరు రాష్ట్రాల మంత్రులు కూర్చుని చర్చించిన తర్వాతే ప్రకటించాలని, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గవర్నర్ సూచన నేపథ్యంలో ఇరు రాష్ట్రాల విద్యా మంత్రులు సోమవారం సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని మంత్రులిద్దరూ ధ్రువీకరించలేదు.
 
 ఏదో ఒకటి తేల్చండి..: విద్యార్థుల ఆందోళనలను తొలగించేలా, వారికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాలకు సూచించినట్లు తెలిసింది. ఎంసెట్‌ను విడివిడిగాా అయినా, ఉమ్మడిగా నిర్వహించినా... ఇద్దరు కలిసి చర్చించి ప్రకటించాలని సూచించినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడమే మంచిదని పేర్కొన్నట్లు సమాచారం. లేదంటే చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని, ఇందుకు రెండు రాష్ట్రాలు చర్చల ద్వారానే పరిష్కారించుకోవాలని గవర్నర్ స్పష్టం చేశారు. అలా కాకపోతే ఒక ఏడాది తెలంగాణ మరో ఏడాది ఆంధ్రప్రదేశ్ నిర్వహించేలా ఒప్పందానికి రావాలని... లేదా చెరో ఐదేళ్లు ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు ఒప్పందం చేసుకోవాలని సూచించినట్లు తెలి సింది. లేదంటే ఈసారి తెలంగాణ ప్రభుత్వానికి నిర్వహణ అధికారం అప్పగించి, వచ్చే ఏడాది నుంచి కేంద్రం ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకునేలా ఒప్పందం చేసుకోవాలని కూడా నరసింహన్ సూచించినట్లు సమాచారం. ఈ అంశాలన్నింటిపై మరోసారి రెండు రాష్ట్రాల సీఎంలతో చర్చించి ఒక నిర్ణయానికి రావాలని మంత్రులకు గవర్నర్ తెలిపారు. ఎవరికివారు మొండి వాదనలతో న్యాయ వివాదంగా మారకుండా చూడాలని వారికి హితవు పలికినట్లు తెలిసింది. అయితే రెండు రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు మాత్రం ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనల ప్రకారం అధికారం తమదంటే.. తమదేనని గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. అయితే ఈసారి తెలంగాణ ప్రభుత్వం పరీక్ష నిర్వహించేలా ఒప్పందం చేసుకుని... ఆ తరువాత ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవాలన్న గవర్నర్ సూచనపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
 
 స్పష్టత లేకపోవడంతోనే సమస్య!
 
 పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను, కోటా, రిజర్వేషన్లను కొనసాగించాలని ఉందిగాని.. ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ఎవరు నిర్వహించాలన్న విషయంలో స్పష్టత లేదు. ముఖ్యంగా రెండు అంశాలపై గందరగోళం నెలకొంది.. సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూల్‌లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు వివక్ష లేకుండా సేవలందించాలి. ఆ సేవలను పొందేందుకు 2 రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేకుంటే కేంద్ర నిర్ణయమే అంతిమం అవుతుంది.
 
 న్యాయ పోరాటం చివరి యత్నమే: గంటా
 
 ‘ఉమ్మడి ఎంసెట్ కోసం న్యాయ పోరాటమనేది ఏమీ వీలు కానప్పుడు మేము తీసుకొనే అంతిమ నిర్ణయం అవుతుంది’ అని ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టంచేశారు. శని వారం సాయంత్రం తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు గంటా  రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. అనంతరం గంటా మీడియాతో మాట్లాడారు.   ఇదిలా ఉండగా ఎంసెట్‌పై గవర్నర్ చేసిన సూచనలకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రి గంటా శ్రీనివాసరావు గవర్నర్‌కు లిఖితపూర్వక లేఖ ఇచ్చారు.  ఉమ్మడిగా పరీక్షల కోసం ఏ విధానానికైనా తాము కట్టుబడి ఉంటామని గంటా గవర్నర్‌కు వినిపించడంతో పాటు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు.
 
 
 సెక్షన్ 75 ప్రకారం.. పదో షెడ్యూల్‌లోని సంస్థలు భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంతోపాటు పొరుగు రాష్ట్ర ప్రజలకు ఎలాంటి వివక్ష లేకుండా గతంలో మాదిరిగానే సేవలు అందించాలి. ఆ సేవలను పొందేందుకు రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. లేనిపక్షంలో కేంద్రం తీసుకునే నిర్ణయమే అంతిమం.
 
 మా పరిధిలోనే ఉండాలి...: తెలంగాణ


 ఏపీ ఉన్నత విద్యా మండలి భౌగోళికంగా తెలంగాణలోనే ఉన్నందున.. అది తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేయాలి. కానీ ఏపీ ఉన్నత విద్యా మండలి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సూచనల మేరకు పనిచేసింది. మొన్నటి ఇంజనీరింగ్ ప్రవేశాల సందర్భంగా కొంత గడువు పెంచాలని మేం సుప్రీంకోర్టును కోరాం. కానీ గడువులోగా ప్రవేశాలను పూర్తిచేస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి ఆ కేసులో ఇంప్లీడ్ అయింది. అంటే అది ఏపీ ప్రభుత్వం కోసమే పనిచేస్తోంది. మాకు ఇప్పటివరకు ఏ విషయంలోనూ అధికారికంగా జవాబుదారీగా పని చేయలేదు. దీంతో విభజన చట్టంలోని నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసుకున్నాం. ఉమ్మడి పరీక్షల నిర్వహణ అధికారం మాకే ఉంది. ఏపీ ప్రభుత్వం అడిగితే సేవలు అందిస్తాం. ఒకవేళ ఏపీ వాదన సరైంది అనుకున్నా... మాతో చర్చించకుండా,  ఏకపక్షంగా ఏపీ మండలి పరీక్షల తేదీలను ఎలా ప్రకటిస్తుంది?
 
 వారి మండలికి చట్టబద్ధత లేదు: ఏపీ


 సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా ఏర్పడిన తెలంగాణ ఉన్నత విద్యా మండలికి ఉమ్మడి పరీక్ష నిర్వహించే అధికారం లేదు. నిబంధనల ప్రకారం పదో షెడ్యూల్‌లోని సంస్థలు స్వతంత్రంగానే ఉంటాయే తప్ప.. వాటిని ఏదో ఒక్క ప్రభుత్వానికి సంబంధించినవిగా పరిగణించడానికి వీల్లేదు. అందుకే విభజన చట్టంలో ఏపీ 58 శాతం, తెలంగాణ 42 శాతం వాటాగా ఆయా సంస్థలకు నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. సెక్షన్ 101 ప్రకారం జీవో ద్వారా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేయడం పదో షెడ్యూల్‌కు, సెక్షన్ 75కు విరుద ్ధం. పదో షెడ్యూల్‌కు సంబంధం లేని సంస్థలను మాత్రమే 101 సెక్షన్ ద్వారా తెలంగాణ ఏర్పాటుచేసుకోవాలి. అలా ఏర్పడే సంస్థలు తెలంగాణ పరిధిలో మాత్రమే పనిచేస్తాయి. దాని ప్రకారం ఏర్పడిన తెలంగాణ మండలి ఏపీకి సేవలందిస్తుందని  పేర్కొనడం చట్ట విరుద్ధం.
 
 సెక్షన్ 95 ప్రకారం... విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లోని ఉన్నత విద్యా సంస్థల ప్రవేశాల్లో ఇప్పుడున్న కోటా, రిజర్వేషన ్లను పాటిస్తూ, ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియను పదేళ్ల పాటు కొనసాగించాలి.
 
 పదేళ్ల పాటు కోటా ఇస్తాం..: తెలంగాణ


 హైదరాబాద్ పరిసరాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లోని సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం కల్పించేందుకు విభజన చట్టంలో పదేళ్ల నిబంధనను విధించారు. అందుకు మేం సిద్ధం. తెలంగాణలోని విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటా సీట్లను మెరిట్ ఆధారంగా తెలంగాణ, ఏపీ విద్యార్థులతో భర్తీ చేస్తాం. అందుకోసమే ఏపీ ప్రభుత్వ ప్రతినిధిని ప్రవేశాల కమిటీలోనూ సభ్యుడిగా చేర్చాం. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి విద్యా సంస్థల్లోని 15 శాతం ఓపెన్ కోటాలో ఏపీ విద్యార్థులతోపాటు తెలంగాణ విద్యార్థులకు మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తే సరిపోతుంది. ఇక్కడి విద్యార్థులు ఏపీలో, ఏపీ విద్యార్థులు ఇక్కడ పోటీ పడాల్సిందల్లా ఆ 15 శాతం సీట్లలోనే. దానికి పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన పుడు అభ్యంతరం ఏముంది.
 
 సాధ్యం కాదు..: ఏపీ


 పదేళ్ల పాటు ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ అంటే పరీక్షల నిర్వహణతో కూడా కూడుకున్నదే. పరీక్షలు వేరుగా, ప్రవేశాలను వేరుగా చూడరాదు. వేర్వేరు పరీక్షల వల్ల ఉమ్మడి ప్రవేశాలకు మెరిట్ జాబితా రూపొందించడం సాధ్యం కాదు. విద్యార్థులు రెండు పరీక్షలు రాయాల్సి వస్తుంది. వేర్వేరు పరీక్షలు ఈ సెక్షన్‌లోని నిబంధనలకు విరుద్ధం. ఒకే పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిం చాలి. లేకపోతే విద్యార్థులు నష్టపోతారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement