సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 700కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నా ఇక్కడి లక్షలాది మంది విద్యార్థులు వలసబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరినట్లు అనధికారిక సమాచారం. ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యమే విద్యార్థులు వలసబాట పడ్డానికి కారణంగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి తరగతులు కూడా మొదలయ్యాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ఇంతవరకూ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా ఖరారు కాలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కళాశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. కనీసం అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలు కూడా ఖరారు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని, ప్రణాళికా లోపాన్ని విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలకు వెళితే ఫీజు రీయింబర్స్‌మెంటు భారం తగ్గుతుంది..’ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి.
ఎంసెట్ ఫలితాలొచ్చి రెండు నెలలైనా: ఎంసెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రభుత్వం ప్రకటించలేదు. జూన్ మొదటి వారంలో ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో సుమారు రెండన్నర లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. జూలై మొదటి వారంలోనే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తే గత నెలాఖరుకే కౌన్సెలింగ్ పూర్తయి విద్యార్థులు కళాశాలల్లో చేరేవారు. ఈ నెలలో తరగతులు కూడా ఆరంభించడానికి వీలయ్యేది. అయితే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనందున కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రకటన జారీలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు మొదటి వారంలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా వాటి అమల్లో ప్రభుత్వం విఫలమైంది.
మేనేజ్‌మెంట్ కోటా సీట్లపైనే వివాదం: ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీపై ఏర్పడిన వివాదం మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. మేనేజ్‌మెంట్ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఇది తేలే వరకూ మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ వీలుకాదు.
గుణపాఠం నేర్వని సర్కారు: గతేడాది కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా లక్షన్నర మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వలసలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు వలసబాట పట్టడం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో సీట్లు మిగిలిపోయి కళాశాలల నిర్వహణ భారంగా మారనుంది. సీట్లు భర్తీ కాని కారణంగా గతేడాది లక్షన్నర సీట్లు మిగిలిపోయాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళితే ఫీజు రీయింబర్స్‌మెంట్ భారం తగ్గుతుందనే భావంతోనే ప్రభుత్వం కన్వీనరు కోటా సీట్ల భర్తీ కోసం చొరవ తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యార్థుల వలసబాట!
Published Mon, Aug 5 2013 2:43 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
Advertisement
Advertisement